Homeక్రీడలుIND vs NZ : కుర్రాళ్ళు కూడా సీనియర్ల మాదిరే: సూర్య నిలబడకపోయి ఉంటే కథ...

IND vs NZ : కుర్రాళ్ళు కూడా సీనియర్ల మాదిరే: సూర్య నిలబడకపోయి ఉంటే కథ వేరే లెక్క ఉండేది

IND vs NZ : మొన్న ఆసియా కప్ లో ఏం జరిగింది? గెలవాల్సిన కప్పు శ్రీలంకకు వెళ్ళిపోయింది. నిన్న టి20 మెన్స్ వరల్డ్ కప్ సిరీస్ లో ఏం జరిగింది? మనకు దక్కాల్సిన కప్పు ఇంగ్లాండ్ ఎగరేసుకుపోయింది. ఇలా జరిగిందనే కదా.. ఇంకోసారి ఇలాంటి తప్పు పునరావృతం కావద్దనే కదా.. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. కుర్రాళ్ళకు అవకాశం కల్పించింది. సెలక్షన్ కమిటీని పక్కన పెట్టింది. కానీ ఇవాళ కివీస్ తో జరిగిన రెండో టి20 మ్యాచ్ లో సేమ్ సీన్ రిపీట్ అయింది. ఓపెనర్గా బరిలోకి దిగిన రిషబ్ పంత్ పరుగులు తీసేందుకే కష్టపడ్డాడు. 11 బంతులు ఎదుర్కొని ముక్కి మూలిగి ఆరు పరుగులు చేశాడు. ఒక ఫేలవమైన షాట్ ఆడి క్యాచ్ అవుట్ గా వెనుతిరిగాడు. ఒకవేళ కివీస్ బౌలర్ల బౌలింగ్ బాగుంది అనుకుంటే.. అతనితోపాటు ఓపెనర్ గా దిగిన ఇషాన్ కిషన్ 36 పరుగులు చేశాడు.

 

 

-అసలు ఒళ్ళు వంచితే కదా..

క్రికెట్ అంటే మైదానంలో చిరుతల కదలడం.. కానీ ఇవాళ రిషబ్ పంత్ ను చూసిన తర్వాత తనకు అండదండలు ఉన్నాయి కాబట్టి… తాను జై షా వర్గీయుడిని కాబట్టి అవకాశాలు వాటంతట అవే వస్తాయి. నా ఒళ్ళు ఎలా పెరిగినా పర్వాలేదు. అసలు నేను ఒళ్ళు వంచాల్సిన అవసరం లేదు అన్నట్టుగా అతని తీరు ఉంది. మేమేం తక్కువ అన్నట్టు దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్ డక్ ఔట్ గా వెను దిరిగారు. ఈ బ్యాట్స్ మెన్ స్టాండ్ కనుక ఇస్తే ఇండియా స్కోర్ మరింత ఎక్కువ అయ్యేది. సూర్య కుమార్ యాదవ్ పై ఒత్తిడి తగ్గేది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక బ్యాట్స్మెన్ మ్యాచ్ మొత్తం మోయాలి అంటే మాములు విషయం కాదు.

-సూర్య నిలబడకపోయి ఉంటే

వన్ డౌన్ లో వచ్చిన సూర్య కుమార్ యాదవ్ ఇవాళ గనుక నిలబడకపోయి ఉంటే మ్యాచ్ స్వరూపం మరోలా ఉండేది. కివీస్ బౌలర్లు మెరుపులాంటి బంతులతో వణికిస్తున్నప్పటికీ సూర్యకుమార్ యాదవ్ ఎక్కడా కూడా తడబడలేదు. ఒక రకంగా చెప్పాలంటే తుఫానుకు ఎదురెళ్ళాడు. సంద్రం దాడి చేస్తున్నప్పటికీ తీరంలా ఓపికతో ఉన్నాడు. హాఫ్ సెంచరీ దాకా నిదానంగా ఆడిన సూర్య.. ఆ తర్వాత రెచ్చిపోయాడు. సాధారణంగా సూర్య కుమార్ యాదవ్ బౌలర్లపై వచ్చి రాగానే ఎదురుదాడి చేస్తాడు. కానీ ఈసారి తన శైలికి భిన్నంగా ఆడాడు. ఒక రకంగా చెప్పాలంటే జింకను వేటాడే పులిలా సమయోచితంగా ఇన్నింగ్స్ నిర్మించాడు. కీలక సమయంలో ఒక బ్యాట్స్మెన్ ఎలా ఆడాలో ఇవాళ నిరూపించాడు. మిగతా ఆటగాళ్ళకు, సూర్యకు అదే తేడా.

-న్యూజిలాండ్ ఆటగాళ్లు విజృంభించి ఉంటే

భారత్ 191 పరుగులు చేసింది. ఆడుతోంది న్యూజిలాండ్ సొంత గడ్డపై. ఏ రకంగా చూసినా వారికే అడ్వాంటేజ్ ఉంటుంది. కానీ అదృష్టం కొద్దీ పరుగుల ఖాతా ప్రారంభించక ముందే ఓపెనర్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత భారత బౌలర్లు చాలా రోజుల అనంతరం మెరుగైన బౌలింగ్ చేశారు. ఒకవేళ గనుక కివీస్ బ్యాట్స్మెన్ నిలదొక్కుకొని గనుక ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. కివీస్ కెప్టెన్ కు ఏ ఒక్క బ్యాట్స్మెన్ కూడా సహకారం అందించలేదు.. పొరపాటున గనుక ఒక మంచి భాగస్వామ్యం ఏర్పడి ఉంటే ఫలితం మరోలా ఉండేది. మొన్నటి దాకా యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి. భారత క్రికెట్ క్రీడా సమాఖ్య దిద్దుబాటు చర్యలు తీసుకున్న తర్వాత కూడా… ఫలితం అలానే ఉంటే కాయకల్ప చికిత్స చేసి ఏం ఉపయోగం. అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అవకాశం రాగానే ఆటతీరును నిరూపించుకోవాలి. మొన్న టి20 మెన్స్ వరల్డ్ కప్ లో రిషబ్ పంత్ ఔట్ అయిన తర్వాత సామాజిక మాధ్యమాల్లో భారీ ఎత్తున ట్రోల్స్ జరిగాయి. ఇవాళ కూడా జరుగుతూనే ఉన్నాయి. బహుశా అతను ఎక్కువ కాలం ఇంతటి భారీ దేహంతో టి20 మ్యాచ్ లు ఆడలేకపోవచ్చు. కొందరికి అవకాశాలు లేక ప్రతిభ మరుగున పడిపోతుంది.. కొందరికి అవకాశం వచ్చిన ప్రతిభ వెలుగులోకి రాదు.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version