IPL 2024 Playoffs : 2021లో 8వ స్థానం, 2022 లోనూ ఎనిమిదవ స్థానమే. ఇక గత ఏడాదయితే చివరి స్థానం.. ఇదీ గత మూడు సంవత్సరాలుగా ఐపీఎల్లో హైదరాబాద్ జట్టు ప్రస్థానం. కానీ ఈసారి ఆ జట్టు ఆట తీరు మారింది. కమిన్స్ నాయకత్వంలో సరికొత్త శక్తి, యుక్తులను కూడదీసుకుంది. ఫలితంగా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. “అంత సీన్ లేదు అని విమర్శించిన వారి నోటి నుంచే.. వారెవ్వా ఏం ఆడుతోంది” అనిపించుకుంది. గట్టి కం బ్యాక్ ఇచ్చి..కప్ రేసులో ముందు వరుసలో ఉంది. దీంతో హైదరాబాద్ అభిమానులు ఆకాశంలో తేలుతున్నారు. ఈసారి కచ్చితంగా టైటిల్ కొడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జట్టు గత మూడేళ్ల ప్రయాణానికి సంబంధించిన వివరాలను వీడియో రూపంలో రూపొందించి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.
2021-8th palce(last)
2022 – 8th place
2023 – 10th place
2024 – Qualified still one match left
Unreal comeback by SRH#SRHvGT pic.twitter.com/pqs7M0rMOO— (@dhfmchanduu) May 16, 2024
హైదరాబాద్ గత మూడు సీజన్ లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. కానీ ఈ సీజన్లో అంతకుమించి అనేలాగా ఆడింది. ముఖ్యంగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం విధ్వంసాన్ని సృష్టించింది. ఐపీఎల్ లో తన పేరు మీద అనితర సాధ్యమైన రికార్డులను సృష్టించుకుంది. వరుస విజయాలతో ప్లే ఆఫ్ వెళ్లిపోయింది. గుజరాత్ జట్టుతో గురువారం జరగాల్సిన మ్యాచ్ రద్దు కావడంతో 15 పాయింట్లతో ముందంజ వేసింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది.
'Q' beside our name @SunRisers
Thanks for making this happen @patcummins30 pic.twitter.com/QZ3CMWzayM— Hari Teja (@HariTeja2422) May 16, 2024
గత మూడు సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన హైదరాబాద్ జట్టు.. ఈ సీజన్లో అద్భుతంగా ఆడుతోంది. దీంతో ఆ జట్టు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఆరెంజ్ ఆర్మీకి అనుకూలంగా పోస్టులు పెడుతున్నారు.. “గత మూడు సీజన్లలో వెనుకడుగు వేశాం.. ఈ సారికి తగ్గేది లేదంటూ” తొడ కొడుతున్నారు. కేజీఎఫ్, సలార్ సినిమాల్లోని డైలాగులను జత చేసి వీడియోలలో హల్ చల్ సృష్టిస్తున్నారు.. ఇందులో కమిన్స్ కెప్టెన్ అయిన తర్వాత.. హైదరాబాద్ ఆధిపత్యం ఎలా పెరిగిందో చూపిస్తున్నారు. బ్యాటర్లు కొట్టిన సిక్సులు, బౌలర్లు తీసిన వికెట్లు ఫ్యాన్స్ రూపొందించిన వీడియోలలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. మ్యూజిక్ కు సరిపోయినట్టుగా రూపొందించిన వీడియోలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో హైదరాబాద్ జట్టు ఓటమితో మొదలుపెట్టింది. దీంతో ఈసారి కూడా హైదరాబాద్ గత సీజన్ లాగే పేలవమైన ఆట తీరు ప్రదర్శిస్తుందని అందరూ అనుకున్నారు. హైదరాబాద్ జట్టు అందరి అంచనాలను తలకిందులు చేసింది. అద్భుతమైన విజయాలతో ముందడుగు వేసింది. ప్లే ఆఫ్ రేసులోకి వచ్చేసింది. ఐపీఎల్ ఫస్ట్ హాఫ్ సీజన్లో ఐదు విజయాలు నమోదు చేసింది. అయితే ఆ తర్వాత నాలుగు మ్యాచ్లలో మూడింట ఓడింది. ప్లే ఆఫ్ ముందు కంగారు పెట్టింది. తాజాగా గుజరాత్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడంతో దర్జాగా ప్లే ఆఫ్ లోకి అడుగుపెట్టింది.. ఇక హైదరాబాద్ జట్టు లీగ్ చివరి దశలో తన ఆఖరి మ్యాచ్ పంజాబ్ జట్టుతో ఆడునుంది. ఈ మ్యాచ్ గనుక హైదరాబాద్ గెలిస్తే పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇది జరగాలంటే హైదరాబాద్ జట్టు గెలుపొందడం మాత్రమే కాదు, కోల్ కతా తన చివరి మ్యాచ్లో రాజస్థాన్ పై గెలవాలి. అప్పుడు రాజస్థాన్ 16 పాయింట్లతో మూడవ స్థానానికి వస్తుంది. హైదరాబాద్ 17 పాయింట్లు రెండవ స్థానంతో లీగ్ దశను ముగిస్తుంది. ఒకవేళ ఇది జరిగితే హైదరాబాద్ జట్టు ఫైనల్ వెళ్లేందుకు రెండు దారులు ఉంటాయి. క్వాలిఫైయర్ – 1 లో ఓడితే.. క్వాలిఫైయర్ – 2 లో మరో అవకాశం లభిస్తుంది.