Sunrisers Hyderabad : ఐపీఎల్ లో వేగానికి మాత్రమే గుర్తింపు ఉంటుంది. వేగంతో ఆడితేనే ఫలితం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మేధాశక్తిని ఉపయోగించి ఆడితేనే ప్రయోజనం లభిస్తుంది. అంతే తప్ప ప్రతి మ్యాచ్ లో కష్టాన్ని కాక అదృష్టాన్ని నమ్ముకుంటే అసలుకే మోసం వస్తుంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు చేసింది ఇదే. రాజస్థాన్ జట్టుపై రికార్డ్ స్థాయిలో 286 పరుగులు చేసిన తర్వాత.. హైదరాబాద్ జట్టు మీద అంచనాలు ఎక్కడికో శిఖరగ్రానికి చేరుకున్నాయి. ఈ సమయంలో ఆటగాళ్లకు ఒక రకమైన ఫీలింగ్ వచ్చేసింది. తాము నిలబడి నీళ్లు తాగేరకం కాదని.. పరిగెత్తి పాలు తాగే రకమని అనుకున్నారు. పిచ్ తో సంబంధం లేకుండా దూకుడుగా ఆడేందుకు మాత్రమే ప్రయత్నించారు. అది కాస్త బెడిసి కొట్టింది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. వరుసగా ఎదురయింది. అయినప్పటికీ హైదరాబాద్ జట్టు ఆటగాళ్ల తీరు మారలేదు. పైగా దూకుడు ఏమాత్రం తగ్గించబోమని కెప్టెన్ కమిన్స్ వ్యాఖ్యానించడం సంచలనానికి దారి తీసింది. ఇక ఇదే తీరు మిగతా మ్యాచ్లో కూడా కొనసాగించడంతో హైదరాబాద్ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఇన్ని వరుస ఎదురు దెబ్బలు తగిలినప్పటికీ హైదరాబాద్ జట్టు మేనేజ్మెంట్ మార్పులు చేపట్టలేదు. పైగా ప్లేయర్లతో మైదానంలో ప్రాక్టీస్ చేయించకుండా ప్రత్యేక ఫ్లైట్లు కట్టించుకుని ఏకంగా మాల్దీవులకు తీసుకెళ్ళింది.
Also Read: 300 లోడింగ్.. సన్ రైజర్స్ కు మొదటికే మోసం!
ప్లేయర్లను మార్చలేదు..
రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో సూపర్ సెంచరీ చేసిన ఇషాన్ కిషన్.. ఆ తర్వాత ఏమాత్రం ఆకట్టుకోలేదు. నితీష్ కుమార్ రెడ్డి కూడా ఊహించినంత స్థాయిలో బ్యాటింగ్ చేయలేదు. క్లాసెన్ కూడా అడపాదడపా ఇన్నింగ్స్ మాత్రమే ఆడాడు. అభిషేక్ శర్మ పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయినప్పటికీ.. మిగతా మ్యాచ్లో అతడు విఫలమయ్యాడు.. జట్టుకు ఉపయుక్తమైన ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్ వర్షం వల్ల రద్దవడంతో హైదరాబాద్ పరిస్థితి గ్రూప్ దశ వరకే ఆగిపోయింది. కానీ ఆ జట్టు గడిచిన మ్యాచ్లలో సమర్థవంతమైన ఆట తీరు ప్రదర్శిస్తే పరిస్థితి ఇంతకు దిగజారేది కాదు. కీలకమైన మ్యాచులలో విఫలమై.. గెలవాల్సిన చోట చేతులెత్తేసి.. ఇప్పుడు వర్షాన్ని తిడితే ఏం ఉపయోగం.. ఇషాన్ కిషన్, మహమ్మద్ షమీ, నితీష్ కుమార్ రెడ్డి, కొంతమంది బ్యాటర్ల స్థానంలో కొత్త వాళ్లకు అవకాశాలు ఇచ్చి ఉంటే హైదరాబాద్ పరిస్థితి మరో విధంగా ఉండేది. తక్కువలో తక్కువ హైదరాబాద్ ఒక మూడు మ్యాచ్లు గెలిచి ఉంటే.. ఇవాళ గ్రూప్ దశ నుంచి ఇంటికి వెళ్లాల్సిన దుస్థితి ఉండకపోయేది. అందుకే క్రికెట్లో అదృష్టాన్ని ఎప్పుడు నమ్ముకోకూడదు. కష్టాన్ని మాత్రమే నమ్ముకోవాలి. కష్టంతో మాత్రమే ఆడాలి. అప్పుడే జట్టు నిలబడగలుగుతుంది. కలబడగలుగుతుంది. తనదైన రోజున విజేతగా ఆవిర్భవించగలుగుతుంది.
Also Read: సన్ రైజర్స్ ను దెబ్బకొట్టిన హైదరాబాదీ!