Sujana Chaudhary : విదేశాల్లో ఏపీ ఎమ్మెల్యే ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. లండన్ లో సూపర్ మార్కెట్లో జరిగిన ప్రమాదంలో ఎమ్మెల్యే గాయపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అయితే ఆపరేషన్ చేయాల్సి ఉండడంతో హుటాహుటిన హైదరాబాద్ తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న సుజనా చౌదరి( Sujana Chaudhari) ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్నారు. ఈనెల 2న ప్రధాని మోదీ అమరావతిలో పర్యటించిన సమయంలో సుజనా చౌదరి ఇక్కడే ఉన్నారు. అటు తర్వాత కుటుంబ సభ్యులకు లండన్ వెళ్లారు. ఓ సూపర్ మార్కెట్లో కిందకు పడిపోయారు. దీంతో ఆయన కుడి భుజానికి తీవ్ర గాయం అయింది. ఎముక విరిగిపోయినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. అందుకే సర్జరీ కోసం ఆయనను హైదరాబాద్ తీసుకొస్తున్నారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్లు చెబుతున్నారు.
Also Read : రాజకీయాలపై అసంతృప్తితో చంద్రబాబు అంతరంగిక నేత!
* సుదీర్ఘకాలం టిడిపిలో..
తెలుగుదేశం పార్టీలో( Telugu Desam Party) సుదీర్ఘకాలం పని చేశారు సుజనా చౌదరి. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో బిజెపిలో చేరారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ భారతీయ జనతా పార్టీలో చేరారు సుజనా చౌదరి. 2024లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. భారీ మెజారిటీతో గెలిచారు. చంద్రబాబు మంత్రివర్గంలో పదవి వస్తుందని భావించారు. కానీ ఆయనకు దక్కలేదు. పురందేశ్వరి స్థానంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులు అవుతారని ప్రచారం నడుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిలో ఈనెల రెండున పర్యటించిన నరేంద్ర మోడీకి ఆహ్వానం పలికారు. గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన నేతలు సుజనా చౌదరి కూడా ఉన్నారు. అటు తరువాత లండన్ వెళ్లారు. ఇంతలోనే అక్కడ గాయం కావడంతో తిరిగి ఆయనను హైదరాబాద్ తీసుకొస్తున్నారు.
* రెండు పార్టీల్లో ఆందోళన..
సుజనా చౌదరికి తీవ్ర గాయాలయ్యాయని తెలియడం బిజెపితో పాటు టిడిపి శ్రేణుల్లో కూడా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు కు( AP CM Chandrababu) అత్యంత సన్నిహిత నేత సుజనా చౌదరి. దీంతో చంద్రబాబు సైతం సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మరోవైపు బిజెపి శ్రేణులు త్వరగా కోలుకోవాలని పూజలు చేస్తున్నాయి. త్వరలో ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి సుజనా చౌదరికి వస్తుందని వార్తలు వస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆయన ప్రమాదానికి గురికావడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రస్తుతం విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు సుజనా చౌదరి. మొన్న మధ్యన అసెంబ్లీలో తనదైన శైలిలో ప్రసంగించారు. రాష్ట్ర సమస్యలపై ఆయన సంధించిన ప్రశ్నలు హైలెట్ అయ్యాయి. మొన్నటికి మొన్న ప్రధాని పర్యటనలో సైతం యాక్టివ్ గా ఉన్నారు సుజనా చౌదరి. అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం.
Also Read : ఇదే కరెక్ట్ సమయం.. ఏపీ విషయంలో బిజెపి భారీ స్కెచ్!