SRH: సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్ అనే ఆటగాడు ఏకంగా సెంచరీ చేశాడు. దీంతో హైదరాబాద్ జట్టుపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈసారి 300 లోడింగ్ అనే ప్రచారం తారస్థాయికి చేరింది. ఇక మీడియా, సోషల్ మీడియాలో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ జట్టును ఆకాశానికి ఎత్తేశాయి. రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా గెలిచిన హైదరాబాద్.. శిఖర స్థానానికి చేరుకుంది. అంత ఎత్తునుంచి కిందపడటానికి హైదరాబాద్ జట్టుకు పెద్దగా సమయం పట్టలేదు. ఢిల్లీ, లక్నో, కోల్ కతా, గుజరాత్ జట్లతో జరిగిన మ్యాచ్లలో హైదరాబాద్ ఓటమిపాలైంది.. దీంతో పాయింట్లు పట్టికలో దిగువ స్థానంలో కొనసాగుతోంది. మరీ దారుణంగా సొంత మైదానంలో జరుగుతున్న మ్యాచ్ లలోనూ హైదరాబాద్ విఫలమవుతున్న తీరు ఆ జట్టు అభిమానులను కలవర పాటుకు గురిచేస్తోంది.”300 కాదురా అయ్యా.. ముందు 20 ఓవర్లు పూర్తిస్థాయిలో ఆడండి.. కనీసం 200 పరుగులైనా చేయండి. బ్రెయిన్ గేమ్ ఆడండి. ప్రత్యర్థి జట్టుపై ఎలా పైచేయి సాధించాలో జర నేర్చుకోండి” అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వ్యాఖ్యానిస్తున్నారంటే హైదరాబాద్ జట్టు పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
Also Read: ఇదెక్కడి మాస్ రా మావ… విరాట్ కోహ్లీని ఇంతలా స్మరిస్తున్నారు..
దూకుడును నమ్ముకొని..
హైదరాబాద్ జట్టు దూకుడును మాత్రమే నమ్ముకుంటే.. గెలుపు సాధ్యమవుతాయని భావిస్తోంది. కానీ ఐపీఎల్లో దూకుడు మాత్రమే సరిపోదు. అప్పుడప్పుడు మైండ్ గేమ్ కూడా ఆడాలి. ఉదాహరణకు చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తనదైన చాకచక్యాన్ని ప్రదర్శించాడు. క్రీజ్ లో పాతుకుపోయిన విజయ్ శంకర్, ధోనిని అవుట్ చేయలేదు. అలాగని చెత్త బంతులు కూడా వేయలేదు. వాళ్లమానాన వాళ్ళే ఆడతారు అన్నట్టుగా వదిలేసేలా చేశాడు. ఫలితంగా చెన్నై జట్టు సొంతమైదానంలో 25 పరుగుల తేడాతో ఢిల్లీ చేతిలో ఓడిపోయింది. వాస్తవానికి ఈ మైదానంపై ఢిల్లీ జట్టు గొప్ప స్కోరు చేయలేదు. కానీ చేసిన స్కోరును కాపాడుకుంది. విజయాన్ని సాధించింది. అయితే ఇదే చాకచక్యం కమిన్స్ లో లోపించింది. ఎంతసేపటికి దూకుడుగా ఆడాలని మాత్రమే అతడు తన సహచర ఆటగాళ్లకు సూచిస్తున్నాడు. దానిని నమ్ముకునే తను బోల్తా పడుతున్నాడు.. జట్టును కూడా బోల్తాపడేలా చేస్తున్నాడు. గతంలో భువనేశ్వర్ కుమార్, నటరాజన్ చాలా పొదుపుగా బౌలింగ్ చేసేవారు. వికెట్లు కూడా పడగొట్టేవారు. మహమ్మద్ షమీ , కమిన్స్ వరుసగా విఫలమవుతున్నారు. వికెట్లు పడగొట్టే స్పిన్నర్లు ప్రస్తుతం హైదరాబాద్ జట్లో లేరు. జంపా, రాహుల్ చాహర్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ వారికి అవకాశం లభించడం లేదు. మొత్తంగా చూస్తే 300 లోడింగ్ అనే అంచనాలు హైదరాబాద్ జట్టుకు మొదటికే మోసం చేస్తున్నాయి.