Sri Lanka vs Afghanistan: లంకలో ఆఫ్ఘనిస్తాన్ పప్పులు ఉడకడం లేదు

శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా రెండో వన్డే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Written By: Suresh, Updated On : February 13, 2024 2:25 pm

Sri Lanka vs Afghanistan(1)

Follow us on

Sri Lanka vs Afghanistan: తొలి వన్డేలో దాదాపు శ్రీలంక జట్టును ఓడించినంత పనిచేసిన ఆఫ్ఘనిస్తాన్.. రెండవ వన్డేలో తేలిపోయింది. శ్రీలంక బౌలర్ల ముందు దాసోహం అయింది. మొత్తానికి 155 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రెండు వరుస విజయాలతో 3 వన్డేల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే శ్రీలంక సొంతం చేసుకుంది.. వాస్తవానికి ఈ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తారని అందరూ అనుకున్నారు. ఆ జట్టు అభిమానులు కూడా ఇదే ఆశించారు. కానీ శ్రీలంక బౌలర్లను ప్రతిఘటించకపోవడంతో ఆఫ్గనిస్తాన్ ఓడిపోవాల్సి వచ్చింది. మొదటి వన్డేలో చూపించిన దూకుడు ఈ వన్డేలో ప్రదర్శించకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ పప్పులు శ్రీలంకలో ఉడకలేదు. ఫలితంగా ట్రోఫీ శ్రీలంకకు దక్కింది.

శ్రీలంకలోని పల్లెకెలె వేదికగా రెండో వన్డే జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోరు సాధించింది. శ్రీలంక బ్యాటర్లలో అసలంక 97 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. కుశాల్ మెండిస్ 61, సమర విక్రమ 52, జనిత్ లియాంగే 50 పరుగులు చేసి శ్రీలంక భారీ స్కోరు సాధించేందుకు దోహదపడ్డారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఓమర్జాయ్ మూడు వికెట్లు, నూర్ అహ్మద్, క్వైస్ అహ్మద్ తలా ఒక వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో ఫీల్డింగ్ విభాగంలోనూ ఆఫ్గనిస్తాన్ ఆటగాళ్లు నిరాశ జనకమైన ప్రదర్శనను చూపించారు. కీలకమైన క్యాచ్ లు జారవిడవడంతో శ్రీలంక ఆటగాళ్లు జీవదానాలు పొందారు. లేకుంటే శ్రీలంక అంత భారీ స్కోరు చేసి ఉండేది కాదు.

309 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంక బౌలర్ల ముందు బ్యాట్లు ఎత్తేసింది. 33.5 ఓవర్లలో కేవలం 153 పరుగులు చేసి ఆల్ అవుట్ అయింది. తొలి వన్డేలో మెరిసిన ఇబ్రహీం ఈ మ్యాచ్ లో 54 పరుగులు చేసి పరవాలేదు అనిపించాడు. రహమత్ షా 63 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయితే వీరికి ఇతర బ్యాటర్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవాలని వచ్చింది. వచ్చిన బ్యాటర్లు సింగిల్ డిజిట్ స్కోర్ కే పెవిలియన్ చేరడంతో శ్రీలంక బౌలర్లు పండగ చేసుకున్నారు. శ్రీలంక బౌలర్లలో హసరంగా నాలుగు వికెట్లు తీసుకున్నాడు. అసిత్ ఫెర్నాండో, మధు శంక తలా రెండు వికెట్లు పడగొట్టారు. మొదటి వన్డేలో లక్ష్య చేదనకు దిగి గెలిచినంత పనిచేసిన ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్లు ఈ మ్యాచ్ లో తేలిపోయారు. ఒకవేళ వారి గనుక ప్రతిఘటించి ఉంటే రెండో వన్డేలో ఫలితం మరో విధంగా ఉండేది.