SRH Vs KKR
SRH Vs KKR: ఐపీఎల్ లో ఇంతటి దారుణంగా ఆడుతున్న ఆటగాడి పేరు వెంకటేష్ అయ్యర్ (Venkatesh Iyer).. అతడు ఆడుతున్న జట్టు కోల్ కతా నైట్ రైడర్స్(Kolkata knight riders). దీంతో అతనిపై విమర్శలు పెరిగిపోయాయి. అసలు అటువంటి ఆటగాడికి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు అంటూ కోల్ కతా మేనేజ్మెంట్ పై అభిమానులు మండిపడడం మొదలుపెట్టారు. మూడు మ్యాచ్ల తర్వాత వెంకటేష్ అయ్యర్ ఒక్కసారిగా గేర్ మార్చాడు. గురువారం ఈడెన్ గార్డెన్స్ వేదికగా హైదరాబాద్ జట్టు(sun risers Hyderabad)తో జరిగిన మ్యాచ్లో బ్యాట్ తో శివతాండవం చేశాడు..106/4 వద్ద జట్టు ఉన్న సమయంలో.. రఘువంశి(50) పెవిలియన్ చేరుకున్న సందర్భంలో.. ఎటువంటి అంచనాలు లేకుండానే మైదానం లోకి వచ్చాడు వెంకటేష్ అయ్యర్.. రావడమే ఆలస్యం బాదుడే మంత్రంగా పెట్టుకున్నాడు. 29 బంతులు ఎదుర్కొని ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సహాయంతో 60 పరుగులు చేశాడు. రింకూ సింగ్ తో కలిసి ఐదో వికెట్ కు ఏకంగా 91 పరుగులు జోడించాడు. కేవలం 41 బంతుల్లోనే వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్(32) ఈ ఘనత సాధించడం విశేషం.. దీంతో కోల్ కతా జట్టు స్కోర్ రాకెట్ వేగంతో దూసుకుపోయింది. ఒకానొక దశలో 150 పరుగులకే చాప చుట్టేస్తుందనుకున్న తరుణంలో.. అనూహ్యంగా కోల్ కతా 200 పరుగులు చేసింది.. వెంకటేష్ అయ్యర్ ఈ మ్యాచ్లో 60 పరుగులు చేయడం ద్వారా అనేక రికార్డులు సృష్టించాడు.
రికార్డులు కొల్లగొట్టాడు
మిగతా జట్లపై తన ఆటతీరు ఎలా ఉన్నా..సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే మాత్రం వెంకటేష్ అయ్యర్ రెచ్చిపోతాడు. వరుసగా మూడు మ్యాచ్లలో విఫలమైన అతడు.. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో మాత్రం ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. అంతేకాదు అద్భుతమైన రికార్డులను బాధలు కొట్టాడు.. గత సీజన్లో క్వార్టర్ ఫైనల్ లో హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో వెంకటేష్ అయ్యర్ 28 బంతుల్లోనే 51 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. ఇక ఫైనల్ మ్యాచ్లో అయితే 26 బంతుల్లోనే 52 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇక ప్రస్తుత సీజన్లో గురువారం జరిగిన మ్యాచ్లో 29 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. గురువారం నాటి మ్యాచ్లో మొదటి పది బంతుల్లో అయ్యర్ 11 పరుగులు చేశాడు.. ఆ తర్వాత 11 నుంచి 20 బంతుల మధ్య 19 పరుగులు చేశాడు. 21 నుంచి 29 బంతుల మధ్య 30 పరుగులు చేశాడు. 2024 – 25 ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ జట్టు పై మూడు హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడుగా నిలిచాడు. ఈ జాబితాలో రాజస్థాన్ ఆటగాడు సంజు శాంసన్ మొదటి స్థానంలో కొనసాగుతున్నాడు. 2021 నుంచి 23 సీజన్ వరకు అతడు హైదరాబాద్ జట్టు పై నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు..డూ ప్లే సిస్ 2022 నుంచి 2024 సీజన్ వరకు మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.