https://oktelugu.com/

SRH Vs KKR: ఈడెన్ గార్డెన్స్ సగం ఖాళీ.. కారణం ఇదే..

SRH Vs KKR ఐపీఎల్(IPL) మ్యాచ్ లు జరిగే స్టేడియాలు ప్రేక్షకులతో కిక్కిరిసిపోతాయి. ముంబై, చెన్నై, హైదరాబాదు, బెంగళూరు వంటి జట్లు మ్యాచ్ లు ఆడితే చెప్పతరం కాదు.

Written By: , Updated On : April 3, 2025 / 09:59 PM IST
SRH Vs KKR (1)

SRH Vs KKR (1)

Follow us on

SRH Vs KKR: ఇటీవల హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్.. అంతకుముందు రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లతో మ్యాచ్ లు జరిగినప్పుడు టికెట్లకు విపరీతమైన డిమాండ్ ఉన్నది. కొందరైతే బ్లాక్ లో కూడా టికెట్లను విక్రయించారు. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. ఐపీఎల్ మ్యాచ్ జరిగే ప్రతి స్టేడియానికి ప్రేక్షకులు భారీగా వస్తున్నారు. మనదేశంలో క్రికెట్ అంటే అంత ఆసక్తి ఉంటుంది కాబట్టి.. పైగా ఎండాకాలంలో వినోదాన్ని కోరుకుంటారు కాబట్టి.. ప్రేక్షకులు మైదానాలకు బారులు తీరుతున్నారు. టికెట్ల ధరల మీద రాష్ట్రానికి, కేంద్రానికి జీఎస్టీ ద్వారా ఆదాయం వస్తుంది.. ఫలితంగా ప్రభుత్వాలు కూడా తమ వంతు బాధ్యతగా పోలీస్ సెక్యూరిటీ.. ఇతర వసతులు సమకూర్చుతాయి. కాకపోతే ప్రేక్షకులు ఎలాగైనా వస్తున్నారని చెప్పి.. క్రికెట్ అంటే చెవి కోసుకుంటున్నారని చెప్పి అడ్డగోలుగా టికెట్ ధరలు పెంచితే మొదటికే మోసం వస్తుంది. ఇప్పుడు అదే పరిస్థితి గురువారం నాటి కోల్ కతా నైట్ రైడర్స్
, సన్ రైజర్స్ హైదరాబాద్(SRH vs KKR) జట్ల మధ్య జరిగిన మ్యాచ్ నిరూపించింది.

సగం స్టేడియం ఖాళీ

ఐపీఎల్ లో అత్యధిక ఫ్యాన్ బేస్ ఉన్న జట్లలో హైదరాబాద్ కూడా ఒకటి. ఈ జట్టు ఆడుతున్న మ్యాచులు చూసేందుకు అభిమానులు ఎక్కడికైనా వెళ్తారు. కానీ గురువారం హైదరాబాద్, కోల్ కతా జట్ల మధ్య ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో ప్రేక్షకులు అంతగా కనిపించలేదు. సహజంగా ఈడెన్ గార్డెన్స్ కెపాసిటీ 68,000. ఇక్కడ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు ఆడుతున్న మ్యాచ్ లకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ కు అద్దె చెల్లిస్తోంది. అయితే టికెట్ ధరలను అమాంతం పెంచడంతో ఒక్కసారిగా ప్రేక్షకులు దిగ్భ్రాంతి చెందారు. గత సీజన్లో ఇదే సమయానికి టికెట్ ధర 900 ఉండగా.. ఇప్పుడు అది 3500 వరకు పెరిగిందని తెలుస్తోంది. దీంతో ప్రేక్షకులు ఈడెన్ గార్డెన్స్ వైపు చూడటమే మానేశారని తెలుస్తోంది. అందువల్లే గురువారం నాటి హైదరాబాద్, కోల్ కతా మ్యాచ్ కు ప్రేక్షకులు భారీగా హాజరు కాలేదు. సగం స్టేడియం ఖాళీగానే కనిపిస్తోంది.. దీంతో సోషల్ మీడియాలో కోల్ కతా జట్టు యాజమాన్యంపై విమర్శలు పెరిగిపోయాయి..”ప్రేక్షకులు క్రికెట్ ఆటను ఆస్వాదించడానికి మైదానానికి వస్తుంటారు. పైగా ఐపీఎల్ జరిగేది రాత్రి సమయాల్లో.. అప్పటిదాకా మ్యాచ్ చూసేది ఆనందం కోసం.. అభిమానుల ఆటతీరును తనివి తీరా ఆస్వాదించడం కోసం.. కానీ వీటిని దూరం చేస్తున్నారు. ప్రేక్షకుల జేబులు కొల్లగొడుతున్నారు. అందువల్లే ప్రేక్షకులు మైదానం వైపు చూడడం మానేశారు. ఇక తదుపరి జరిగే మ్యాచ్లకు కూడా ప్రేక్షకులు ఇలాగే హాజరు కాకుండా ఉంటి ఉంటే.. టికెట్ రేట్లు తగ్గుతాయో చూడాలని” నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.