SRH Vs KKR
SRH Vs KKR: ప్రస్తుత ఐపీఎల్ లో హైదరాబాద్ జట్టు ఇప్పటి వరకూ మూడు మ్యాచ్లు ఆడింది. రాజస్థాన్ రాయల్స్ జట్టుపై మాత్రమే గెలిచింది.. లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లపై ఓటమిపాలైంది. వరుసగా రెండు ఓటములు ఎదురు కావడంతో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో ఎనిమిదవ స్థానానికి పడిపోయింది..మరీ దారుణంగా గత చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ పదో స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. దీంతో గురువారం జరిగే మ్యాచ్ అటు హైదరాబాద్.. ఇటు కోల్ కతా కు అత్యంత ముఖ్యంగా మారింది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. సర్వశక్తులు ఒడ్డడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈడెన్ గార్డెన్స్ వేదికగా కొద్దిరోజులుగా ముమ్మరంగా సాధన చేస్తున్నాయి..
Also Read: సన్ రైజర్స్ ఇంత “చెత్త”!
ఇవి రెండే కీలకం
ఈడెన్ గార్డెన్స్ లో జరిగే మ్యాచ్లో రెండే కీలకంగా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి హైదరాబాద్ 300 స్కోర్ చేయడం.. రెండు ఈడెన్ గార్డెన్స్ లోని పిచ్. ఈ మైదానంలోనైనా సన్ రైజర్స్ హైదరాబాద్ 300 స్కోర్ చేస్తుందా? అనే ప్రశ్న ప్రతి హైదరాబాద్ అభిమానిని తొలచి వేస్తోంది. ఈ మ్యాచ్లో హైదరాబాద్ 300 స్కోర్ చేస్తుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ జట్టుపై హైదరాబాద్ జట్టు 286 పరుగులు చేసింది. వాస్తవానికి ఈ మ్యాచ్లో హైదరాబాద్ 300 స్కోర్ చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కీలక ఆటగాళ్లు వెంట వెంటనే అవుట్ కావడంతో హైదరాబాద్ స్కోర్ 286 పరుగుల వద్ద ఆగిపోయింది. ఇక కోల్ కతా మైదానంలోని పిచ్ స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఇదే వేదికగా కోల్ కతా, బెంగళూరు మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో కోల్ కతా బౌలర్లు సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి వంటి వారు వికెట్లు తీయడానికి ఇబ్బంది పడితే.. బెంగళూరు స్పిన్ బౌలర్ కృణాల్ పాండ్యా అదరగొట్టాడు. మరోవైపు హైదరాబాద్ బ్యాటర్లు హెడ్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ దూకుడు అయిన ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంది. ఇషాన్ కిషన్ తొలి మ్యాచ్ లో సెంచరీ చేశాడు. మిగతా రెండు మ్యాచ్లలో తేలిపోయాడు. అతడి నుంచి హైదరాబాద్ జట్టు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోంది. ఇక కెప్టెన్ కమిన్స్, షమీ తమ సత్తా చాటాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు వారు తమ స్థాయిలో రాణించలేకపోయారు.. మొత్తంగా చూస్తే గురువారం నాటి మ్యాచ్ కు సంబంధించి హైదరాబాద్ 300 స్కోర్ చేస్తుందా.. పిచ్ పై స్పిన్నర్లు ప్రభావం చూపిస్తారా.. అనే రెండు అంశాలపైనే ప్రధానంగా చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా సాగుతూ ఉండడం విశేషం.