SRH Vs KKR Final 2024: ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి ఘట్టానికి చేరుకుంది. టైటిల్ కోసం హైదరాబాద్, కోల్ కతా తలపడనున్నాయి. హోరా హోరీగా సాగే ఈ మ్యాచ్ కు చెన్నైలోని చెపాక్ మైదానం వేదికగా మారింది. ఈ మైదానంలో జరిగిన క్వాలిఫైయర్ -2 మ్యాచ్ లో హైదరాబాద్ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో కోల్ కతా, హైదరాబాద్ మధ్య పోరు హోరాహోరీగా సాగే అవకాశం కనిపిస్తోంది. ఫైనల్ మ్యాచ్ కావడంతో, బరిలో హైదరాబాద్ ఉండడంతో బెట్టింగ్ లు కూడా జోరుగా సాగుతున్నాయి.. కొంతమంది సీనియర్ క్రికెటర్లు ఎవరు గెలుస్తారో జోస్యం కూడా చెప్పడం ప్రారంభించారు.
ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠ గా సాగుతుందనే అంచనాలు ఉన్న నేపథ్యంలో.. చెన్నైలోని చెపాక్ మైదానంలో శనివారం భారీ వర్షం కురిసింది. దీంతో కోల్ కతా జట్టు ప్రాక్టీస్ రద్దు చేసుకుంది. సన్ రైజర్స్ శుక్రవారం రాజస్థాన్ జట్టుతో క్వాలిఫైయర్ -2 మ్యాచ్ గెలిచిన అనంతరం.. శనివారం సాధనే చేయలేదు. ఆటగాళ్లు పూర్తిగా హోటల్ కే పరిమితమయ్యారు. కోల్ కతా జట్టుకు గత నాలుగు రోజులుగా విశ్రాంతి లభిస్తున్నప్పటికీ.. వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఆ జట్టు సాధన చేసేందుకు ఇబ్బంది ఎదురైంది.
వాతావరణ శాఖ నిపుణుల ప్రకారం ఆదివారం కూడా చెన్నైలో వర్షం పడే అవకాశం ఉందట. వర్షం కురిస్తే.. మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటనే ఆందోళన అభిమానుల్లో నెలకొంది. అయితే ఆదివారం చెన్నై పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం లేదట. ఉరుములతో కూడిన జల్లులు పడతాయట. అది కూడా కేవలం ఒక్క శాతం మాత్రమే అవకాశం ఉందట. ఆదివారం మాత్రం అక్కడ మబ్బులతో కూడిన వాతావరణం ఏర్పడింది. ఉదయం కొన్ని ప్రాంతాలలో చిరుజల్లులు కురిశాయి.. అక్కడ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఆదివారం మ్యాచ్ మొత్తం తుడిచి పెట్టుకుపోయే ప్రమాదం లేదు. ఒకవేళ అలాంటి అనూహ్య పరిస్థితి ఏర్పడితే.. సోమవారం రిజర్వ్ డే ఉంది. ఆదివారం మ్యాచ్ మధ్యలో ఆగిపోతే.. సోమవారం అక్కడి నుంచి కంటిన్యూ చేస్తారు.
అలాంటి పరిస్థితి తలెత్తకుండా.. రిజర్వ్ డే దాకా వెళ్లకుండా.. ఆదివారమే నిర్వాహకులు మ్యాచ్ పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాదు మ్యాచ్ నిర్వహణకు రెండు గంటల పాటు అదనపు సమయం తీసుకునేందుకూ వెనుకాడరు. రిజర్వ్ డే నాడు కూడా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోతే పాయింట్లు పట్టికలో హైదరాబాద్ కంటే ముందు స్థానంలో ఉన్న కోల్ కతా ను ఐపీఎల్ – 17వ సీజన్ విజేతగా ప్రకటిస్తారు. ఈ ప్రకారం కోల్ కతా మూడవసారి టైటిల్ సాధిస్తుంది. అయితే అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూడాలని వరుణ దేవుడని హైదరాబాద్ అభిమానులు కోరుకుంటున్నారు. “వరుణ దేవా ప్లీజ్ కురువకయ్యా” అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.