https://oktelugu.com/

SRH Vs KKR 2024: సన్ రైజర్స్ ఓటమి.. కమిన్స్, స్టార్క్ మధ్య మాటలు బంద్..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో క్వాలిఫైయర్ -1 లో హైదరాబాద్, కోల్ కతా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు ముందు నైట్స్ డగ్ షో నిర్వహించారు. ఈ షో లో స్టార్క్ పాల్గొన్నారు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : May 22, 2024 8:01 am
    SRH Vs KKR 2024

    SRH Vs KKR 2024

    Follow us on

    SRH Vs KKR 2024: ఆటను ఆటలాగానే చూడాలి. ముఖ్యంగా క్రికెట్ లాంటి జెంటిల్మెన్ గేమ్ లో.. మైదానంలో మాత్రమే క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలి. బయట స్నేహాన్ని యధావిధిగా కొనసాగించాలి. అయితే కొంతమంది ఆటగాళ్లు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తుంటారు. మైదానంలో వారు గొప్పగా రాణించినప్పటికీ.. మైదానం వెలుపల కూడా అదే వైరాన్ని కొనసాగిస్తుంటారు.. ఈ జాబితాలోకి ఇప్పుడు స్టార్క్, కమిన్స్ వచ్చి చేరారు. వీరిద్దరూ ఆస్ట్రేలియా ఆటగాళ్లు.. ఇటీవల టీమిండియా పై వరల్డ్ కప్, టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన జట్టులో సభ్యులు. కమిన్స్ కెప్టెన్ కాగా, స్టార్క్ కీలక బౌలర్ గా ఉన్నాడు. అయితే ఇప్పుడు వీరిద్దరి మధ్య మాటల్లేవట. ఈ మాట అంటున్నది ఎవరో విమర్శకులు కాదు. సాక్షాత్తూ స్టార్కే. ఇంతకీ అతడు అలా ఎందుకన్నాడో.. ఈ కథనంలో తెలుసుకుందాం.

    ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో క్వాలిఫైయర్ -1 లో హైదరాబాద్, కోల్ కతా తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కోల్ కతా విజయం సాధించింది. ఈ మ్యాచ్ కు ముందు నైట్స్ డగ్ షో నిర్వహించారు. ఈ షో లో స్టార్క్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా షో నిర్వాహకుడు ” కమిన్స్ కు ఒక సందేశం పంపమని” అడిగాడు. దానికి స్టార్క్..”అతనితో మాట్లాడటం మానేశానని” పేర్కొన్నారు. ” ప్రస్తుతం నేను పాట్ తో మాట్లాడను. కాబట్టి అంతా బాగానే ఉంది.. నేను ఆట తర్వాత అతడితో మాట్లాడతానని” స్టార్క్ వివరించాడు. స్టార్క్ చేసిన ఆ వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే స్టార్క్ ఈ వ్యాఖ్యలు సరదాగా చేశాడని.. వారిద్దరి మధ్య మంచి స్నేహం ఉందని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.

    ఇక ఈ ఐపీఎల్ 17వ సీజన్లో కమిన్స్, స్టార్క్ అత్యంత ఖరీదైన ఆటగాళ్లుగా ఉన్నారు.. కమిన్స్ ను హైదరాబాద్ 20.50 కోట్లకు కొనుగోలు చేసింది. ఫలితంగా ఐపీఎల్ లీగ్ లోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా అతడు నిలిచాడు. ఆ తర్వాత స్టార్క్ ను కోల్ కతా జట్టు 24.75 కోట్లకు కొనుగోలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. దీంతో స్టార్క్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా ఆవిర్భవించాడు. కమిన్స్ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. ..

    ఇక ఐపీఎల్ 17వ సీజన్లో స్టార్క్ 12 లీగ్ మ్యాచ్ లు ఆడాడు. 33 సగటుతో 11.36 ఎకానమీతో 12 వికెట్లు పడగొట్టాడు. ప్లే ఆఫ్ మ్యాచ్ లో హైదరాబాద్ పై మూడు వికెట్లు తీశాడు.. లీగ్ దశలో లక్నోపై 3/28, ముంబై జట్టుపై 4/33 తో అద్భుత ప్రదర్శన చేశాడు.

    ఇక కమిన్స్ 13 ఇన్నింగ్స్ లలో 32 సగటుతో 9.23 ఎకానమీతో 15 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రెండవ బౌలర్ గా అవతరించాడు. ప్లే ఆఫ్ లో కోల్ కతా పై కమిన్స్ ఒక వికెట్ పడగొట్టాడు. బెంగళూరు, ముంబై జట్టతో జరిగిన లీగ్ మ్యాచ్లలో 31, 35 పరుగులు చేశాడు.