Happy Birthday Rohit Sharma: అతడిది మహారాష్ట్రలోని బంసోద్. 1987 ఏప్రిల్ 30న పుట్టాడు. తండ్రి పేరు గురునాథ శర్మ. తల్లి పేరు పూర్ణిమ శర్మ. తల్లిది ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం. తండ్రి ఓ రవాణా సంస్థ స్టోర్ హౌస్ లో పనిచేసేవాడు. ఆదాయం అంతంతే.. ఫలితంగా చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కారణం పేదరికం. తాతయ్య వాళ్ళ ఇంట్లో ఉండేవాడు.. ఎప్పుడో ఒకసారి తల్లిదండ్రుల వద్దకు వచ్చేవాడు. వారు ఒక చిన్న గదిలో ఉండేవారు. అతడికి తమ్ముడు కూడా ఉన్నాడు. చిన్నతనం నుంచే అతనికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా ఉండేది కాదు. దీంతో అతని కల కలగానే ఉండేది. అయితే అతడి ఇష్టాన్ని గ్రహించిన మేనమామ 1999లో ఒక క్రికెట్ క్యాంపులో చేర్పించాడు. అలా ఆ క్యాంపులో శిక్షణ పొందిన టీం.. వివేకానంద స్కూల్ టీం తో మ్యాచ్ ఆడింది. ఆ మ్యాచ్లో ఓ 12 సంవత్సరాల బాలుడు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. అతడి ఆటకు ఆ స్కూల్ కోచ్ ఫిదా అయిపోయాడు. మరో మాటకు తావు లేకుండా స్కూల్ లో జాయిన్ అవ్వమని కోరాడు. అయితే ఆ బాలుడు తన ఆర్థిక పరిస్థితి గురించి చెప్పడంతో.. ఆ స్కూల్ కోచ్ పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి ఆ పిల్లాడికి ఫీజు లాంటివేవీ చెల్లించకుండానే చేర్పించాడు. పైగా 275 రూపాయల ఉపకార వేతనం ఇచ్చేందుకు కూడా స్కూల్ మేనేజ్మెంట్ ను కోచ్ ఒప్పించాడు. ఇలా ఆ పిల్లాడికి ఆ స్కూల్లో ప్రవేశం లభించింది. నాలుగు సంవత్సరాల పాటు ఉచితంగా చదువుకున్నాడు. క్రికెట్లో తర్ఫీదు పొందాడు. సీన్ కట్ చేస్తే టీమిండియా పాలిట హిట్ మ్యాన్ గా అవతరించాడు.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 37 వసంతాలు పూర్తిచేసుకుని.. నేడు 38వ ఏట అడుగుపెడుతున్నాడు. పేదరికాన్ని జయించి, తనకిష్టమైన క్రికెట్లో అద్భుతంగా శిక్షణ పొంది తిరుగులేని క్రికెటర్ గా ఎదిగాడు రోహిత్ శర్మ. విరాట్ కోహ్లీ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. టీమిండియా కు మాత్రమే కాదు ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు అత్యంత విజయవంతమైన కెప్టెన్ గా నిలిచాడు. ముంబై జట్టుకు అతడు ఏకంగా ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు అందించాడు.. టీమిండియా జట్టును రెండుసార్లు ఆసియా చాంపియన్ గా అవతరించేలా చేశాడు. స్వదేశంలో గత ఏడాది జరిగిన వరల్డ్ కప్ లో టీమిండియాను ఓటమనేదే లేకుండా ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. ఫైనల్ లో భారత జట్టు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయినప్పటికీ.. అభిమానుల మనసు గెలుచుకున్నాడు రోహిత్ శర్మ. వన్డే క్రికెట్ చరిత్రలో ఏకంగా 264 రన్స్ కొట్టి.. హైయెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.. పేదరికం తన లక్ష్యానికి ఏమాత్రం అడ్డు తగలకుండా చూసుకున్నాడు. ఎదురైన ప్రతి అవరోధాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. టీమ్ ఇండియా కెప్టెన్ గా, సమకాలీన క్రికెట్లో సరికొత్త ఆటగాడిగా ఎదిగాడు.
2007 జూన్ 23న ఐర్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా రోహిత్ శర్మ టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చారు. అదే ఏడాది సెప్టెంబర్ 19న ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టి20 క్రికెట్ మ్యాచ్ ద్వారా పొట్టి ఫార్మాట్లోకి అడుగు పెట్టాడు. కెరియర్ మొదట్లో రోహిత్ శర్మ తడబడ్డాడు. ఆ తర్వాత 2013 లో టెస్ట్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో లోయర్ ఆర్డర్లో బ్యాటింగ్ చేసే అవకాశం రోహిత్ శర్మకు వచ్చింది. ఎప్పుడైతే ఓపెనర్ గా అతడికి ప్రమోషన్ వచ్చిందో.. ఒక్కసారిగా అతడి జాతకం మారిపోయింది. ఇప్పటివరకు రోహిత్ శర్మ 59 టెస్టులు, 262 వన్డేలు, 151 టీ – 20 మ్యాచ్ లు ఆడాడు. వన్డేలలో 10,709, టీ – 20 లలో 3,974, టెస్టులలో 12 సెంచరీలు, 17 హాఫ్ సెంచరీలు చేశాడు. వన్డేలలో 31 సెంచరీలు, 55 అర్థ సెంచరీలు సాధించాడు. టి20 ఫార్మాట్లో కూడా ఐదు సెంచరీలు, 29 ఆఫ్ సెంచరీలు చేశాడు. వన్డేలలో అత్యధిక స్కోరు, టి20 లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కష్టాలు దాటి, కన్నీళ్లు దిగమింగుకొని, ఆకలిని చంపుకుని రోహిత్ శర్మ ఇక్కడ దాకా వచ్చాడు. మైదానంలో తోటి ఆటగాళ్లపై అతడు కోపంగా ఉంటే చాలామంది విమర్శిస్తుంటారు. కానీ, జట్టు కోసం ఆడేటప్పుడు ఎంతటి ఒత్తిడి ఉంటుందో.. నాయకత్వం ఎటువంటి ముళ్ళ కిరీటమో రోహిత్ శర్మకు తెలుసు. అందుకే మైదానం లోపల కఠినంగా ఉండే అతడు.. మైదానం వెలుపల అత్యంత సున్నితంగా ఉంటాడు . ఐదుసార్లు ముంబై జట్టుకు ట్రోఫీ అందించినప్పటికీ, ఆ జట్టు యాజమాన్యం అతడిని కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టింది. అయినప్పటికీ అతడు పల్లెత్తు మాట కూడా అనలేదు. దీనిని బట్టి రోహిత్ శర్మ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవచ్చు. వన్డే వరల్డ్ కప్ తృటిలో చేజారిన నేపథ్యంలో.. టి20 వరల్డ్ కప్ సాధించాలని.. తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పాలని రోహిత్ శర్మ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.