South Africa Vs Bangladesh: టి20 వరల్డ్ కప్ ఉత్కంఠ గా సాగుతోంది. సోమవారం జరిగిన హోరాహోరీ మ్యాచ్లో బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికా విజయాన్ని సాధించింది. చివరి బంతి వరకు ఉత్కంఠ గా సాగిన ఈ మ్యాచ్లో నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించి.. హ్యాట్రిక్ గెలుపులను నమోదు చేసింది. ఈ విజయం ద్వారా దక్షిణాఫ్రికా సూపర్ -8 లో బెర్త్ ఖరారు చేసుకుంది. ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన దక్షిణాఫ్రికా జట్టు.. 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక ఆ జట్టు తన తదుపరి మ్యాచ్ పసికూన నేపాల్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ లో కనుక గెలిస్తే టేబుల్ టాపర్ గా లీగ్ దశకు ముగింపు పలుకుతుంది.
అందరూ ఊహించినట్టుగానే ఈ మైదానంపై స్వల్ప స్కోర్లు నమోదయ్యాయి. అయినప్పటికీ దక్షిణాఫ్రికాకు అంత ఈజీగా గెలుపు దక్కలేదు. రెండు జట్ల బౌలర్లు టాప్ క్లాస్ ప్రదర్శన చేశారు.. ముందుగా బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది.. క్లాసెన్ 46 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. డేవిడ్ మిల్లర్ 29 పరుగులతో సత్తా చాటాడు. తన్జీమ్ హసన్ షకీబ్ మూడు, తస్కిన్ అహ్మద్ 2 వికెట్లు పడగొట్టి అదరగొట్టారు..
23 పరుగులకే కీలకమైన నాలుగు వికెట్లు కోల్పోయి దక్షిణాఫ్రికా జట్టు కష్టాల్లో పడింది. ఈ దశలో ఆ జట్టును క్లాసెన్, మిల్లర్ ఆదుకున్నారు. బౌలింగ్ కు సహకరిస్తున్న మైదానంపై జాగ్రత్తగా ఆడారు.. ఐదో వికెట్ కు ఏకంగా 75 పరుగుల భాగస్వామ్యాన్ని నిర్మించారు. దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి వెంటవెంటనే అవుటయ్యారు.
దక్షిణాఫ్రికా విధించిన లక్ష్యాన్ని చేదించేందుకు బంగ్లాదేశ్ రంగంలోకి దిగింది. 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైపోయింది. దక్షిణాఫ్రికా మాదిరే బంగ్లాదేశ్ కూడా ప్రారంభంలో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. 50 పరుగులకే కీలకమైన నలుగురు ఆటగాళ్లు అవుట్ అయ్యారు. ఈ దశలో తౌహీద్ 37, మహమ్మదుల్లా 20 పరుగులు 20 పరుగులు చేసి, బంగ్లా ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో బంగ్లాదేశ్ గెలుపునకు 18 బంతుల్లో 20 పరుగులు అవసరమయ్యాయి. ఈ నేపథ్యంలో తౌహీద్ ను రబాడా అవుట్ చేశాడు. దీంతో మ్యాచ్ సౌతాఫ్రికా చేతుల్లోకి వెళ్ళింది. వికెట్ తో పాటు కేవలం రెండు పరుగులు మాత్రమే ఇవ్వడంతో ఒక్కసారిగా బంగ్లా కష్టాల్లో పడింది. ఆ తర్వాత చివరి ఓవర్ కు బంగ్లా విజయ సమీకరణం 11 పరుగులుగా మారింది. ఆ ఓవర్లో కేశవ మహారాజు రెండు వికెట్లు పడగొట్టి, ఆరు పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో బంగ్లా విజయానికి నాలుగు పరుగుల దూరంలో నిలిచింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజు మూడు, నోకియా 2, రబాడ రెండు వికెట్లు పడగొట్టి అదరగొట్టారు.