Swami Swaroopanand: ప్లేట్ మార్చిన స్వరూపానంద.. జగన్ చెప్పినా వినలేదంటూ కామెంట్స్

ఒక్క పరిపూర్ణానంద స్వామీజీయే కాదు. వైసిపి ఆస్థాన స్వామీజీ.. స్వామి స్వరూపానంద కూడా ప్లేటు ఫిరాయించారు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు.

Written By: Dharma, Updated On : June 11, 2024 9:30 am

Swami Swaroopanand

Follow us on

Swami Swaroopanand: ఇటీవల స్వామీజీలు రాజకీయ జోష్యాలు చెబుతున్నారు. నేరుగా రాజకీయాలు చేస్తున్నారు. ఊసరవెల్లి మాదిరిగా రంగులు మార్చుతున్నారు. హిందూపురం బిజెపి టికెట్ ఆశించిన స్వామీజీ పరిపూర్ణానందకు దక్కలేదు. దీంతో ఆయన చంద్రబాబును కలిశారు. అయినా లాభం లేకపోవడంతో నిరసన గళమెత్తారు. ఏపీలో వైసిపి అధికారంలోకి రాబోతుందని.. తనకు స్పష్టమైన సమాచారం ఉందని.. జగన్ జాతకరీత్యా 1, 2, 3 కలుపుకొని.. 123 స్థానాలు వస్తాయని కూడా తేల్చి చెప్పారు. కానీ ఫలితాలు చూస్తే ఘోరంగా వచ్చాయి. కనీసం వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. కూటమి ధాటికి ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి.

అయితే ఒక్క పరిపూర్ణానంద స్వామీజీయే కాదు. వైసిపి ఆస్థాన స్వామీజీ.. స్వామి స్వరూపానంద కూడా ప్లేటు ఫిరాయించారు. ఇప్పుడు జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబుకు పొగడ్తలతో ముంచేత్తుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖ కేంద్రంగా నడిపే ఆశ్రమంలో ఎక్కువగా వైసీపీ నేతలు కనిపించేవారు. సీఎం హోదాలో కొన్నిసార్లు జగన్ స్వామీజీ వద్దకు వెళ్లి సేవలు చేసేవారు. మరో వైసీపీ నేత విజయసాయిరెడ్డి అయితే పాదాభివందనం చేశారు. జగన్ ప్రభుత్వం స్వరూపానందకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చింది. స్వరూపానంద కూడా జగన్, ఆయన ప్రభుత్వాన్ని కొనియాడేవారు. కానీ ఎన్నికల్లో జగన్ కు ఓటమి ఎదురయ్యే సరికి స్వరూపానంద స్వరం మారింది. ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి కూడా జగన్ పై విమర్శలు చేశారు. చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు.

పైగా తాను ఎవరికి భయపడి ఈ వ్యాఖ్యలు చేయడం లేదని కూడా చెప్పుకొచ్చారు.’ నేను ఎవరికీ భయపడి కాదు. ఎప్పుడు స్వరూపానంద ఒకలాగే ఉంటారు. చంద్రబాబు అంటే నాకు ఎంతో గౌరవం. ఆయన పెద్దవాడు. రాష్ట్రానికి పెద్దదిక్కుగా పరిపాలన కొనసాగాలి. ఆయన కుటుంబం బాగుండాలి. పరిపూర్ణమైన ఆయుష్షుతో ఉంటూ రాష్ట్రాన్ని బాగా పరిపాలించాలి. నేను చంద్రబాబును కొత్తగా పొగుడుతున్నాను అనుకోవద్దు. గతంలో మురళీమోహన్ ఎంపీగా ఉన్నప్పుడు చంద్రబాబు గెలవాలని రాజమండ్రిలో పెద్ద సభలు పెట్టి, సాధువులను పిలిచి యాగం చేశాను. జగన్ తప్పులు చేస్తే ఎత్తిచూపాను. శ్రీశైలం కుంభాభిషేకం ఆపాలని చెబితే.. జగన్ కోర్టులను మేనేజ్ చేసి ఆ అభిషేకం చేశారు. సింహాచలం, తిరుమలలో తప్పులు జరిగితే నేను బయటకు వచ్చి గళం విప్పాను. నేను ఎవరికీ అనుకూలం కాదు వ్యతిరేకం కాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాను ‘ అంటూ చెప్పుకొచ్చారు స్వరూపానంద.

అయితే తాజాగా ఈ స్వామీజీ వ్యాఖ్యలను విన్న వైసీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే ఇటువంటి స్వామీజీలను నమ్ముకుంటే మిగిలేది ఇదేనంటూ ఆవేదన చెందుతున్నారు. కాగా స్వామీజీ లో వచ్చిన ఈ మార్పుపై నెటిజెన్లు కూడా రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. నావల్లే గెలిచాడు జగన్ అంటూ చెప్పుకొచ్చిన స్వామీజీకి వైసీపీ నేతలు పాద పూజ చేశారని.. ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి స్వామీజీ తత్వం బోధపడిందని ఎక్కువ మంది వ్యాఖ్యానిస్తున్నారు.