RCB Vs DC: కలబడ్డ చోట.. కలిసిపోయిన దిగ్గజ ఆటగాళ్లు.. వైరల్ వీడియో

ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరు, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు 47 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 13, 2024 2:02 pm

RCB Vs DC

Follow us on

RCB Vs DC: క్రికెట్ అంటే జెంటిల్మెన్ గేమ్. ఆ ఆట ఆడే వారంతా జెంటిల్మెన్స్ లాగానే వ్యవహరించాలి. అయితే కొన్నిసార్లు ఆటగాళ్లు అదుపు తప్పుతుంటారు. ఆ సమయంలో నోటికి పని చెబుతుంటారు. అలాంటప్పుడు పంచాయితీలు మొదలవుతుంటాయి. చినికి చినికి గాలివాన లాగా పెద్దగవుతుంటాయి. ఇక ఇందులో అభిమానుల హడావిడి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సోషల్ మీడియా వినియోగం పెరిగింది కాబట్టి.. ఆ గొడవలు తారాస్థాయికి చేరుతున్నాయి. అయితే ఇలా ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు పెట్టుకున్న గొడవ అప్పట్లో సంచలనంగా మారింది. ఆ గొడవ వారిద్దరి వరకే పరిమితం కాలేదు. అభిమానులు కూడా రెచ్చిపోయారు. సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు చేసుకున్నారు. కొన్నాళ్లపాటు ఈ గొడవ ఒక ప్రచ్ఛన్న యుద్ధం లాగా కొనసాగింది. చివరికి ఇన్నాళ్లకు ఆ ఆటగాళ్లు కలిసిపోయారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని గొడవకు ముగింపు పలికారు.

ఐపీఎల్ 17వ సీజన్లో భాగంగా ఆదివారం రాత్రి బెంగళూరు, ఢిల్లీ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో బెంగళూరు 47 పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మ్యాచ్ అనంతరం రెండు జట్లకు సంబంధించిన ఆటగాళ్లు పరస్పరం అభినందించుకున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఎదురుపడ్డారు. కోహ్లీని చూసిన తర్వాత గంగూలీ.. అతని గౌరవార్థం క్యాప్ తీసేసి మరీ అభినందనలు తెలియజేశాడు. అనంతరం వారిద్దరు ఆలింగనం చేసుకున్నారు.. ఈ వీడియో వైరల్ గా మారిన నేపథ్యంలో.. అభిమానులు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ” ఇటీవల గంభీర్.. ఇప్పుడు గంగూలీ.. తమ పాత పంచాయితీలను పూర్తిగా మర్చిపోయారు. విరాట్ కోహ్లీ తో స్నేహపూర్వకంగా ఉంటున్నారని” కామెంట్స్ చేస్తున్నారు.

అప్పట్లో ఏమైందంటే..

బీసీసీఐ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ ఉన్నాడు. అప్పట్లో టీమిండియా కెప్టెన్సీ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీని పక్కన పెట్టారు. కోహ్లీకి ఈ విషయాన్ని చెప్పే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని గంగూలీ వ్యాఖ్యానించాడు. తనకు ఈ మార్పు పై ఎవరూ సమాచారం ఇవ్వలేదని కోహ్లీ వ్యాఖ్యానించాడు. దీంతో వారిద్దరి మధ్య ఉన్న గ్యాప్ బయటపడింది.. తన మీద ఉన్న ఒత్తిడిని తగ్గించుకునేందుకు కోహ్లీ టీ20 కెప్టెన్సీ ని వదిలేశాడు. అప్పుడు ఆ బాధ్యతను రోహిత్ శర్మకు బీసీసీఐ అప్పగించింది. దీంతో ఆ నిర్ణయం వివాదానికి కారణమైంది. కోహ్లీ కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. అనంతరం కెప్టెన్సీ ని కూడా పక్కన పెట్టాడు. ఇక అప్పటినుంచి కోహ్లీ, గంగూలీ మాట్లాడుకోవడం మానేశారు. కనీసం ఎదురుపడినప్పటికీ పలకరింపులను కూడా పక్కన పెట్టారు. అప్పట్లో ఈ వీడియోలో చర్చకు దారితీసాయి. అయితే ఢిల్లీతో మ్యాచ్ గెలిచిన అనంతరం గంగూలీ, కోహ్లీ పరస్పరం ఆలింగనం చేసుకోవడంతో గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టినట్టు ప్రకటించారు. దీంతో వారిద్దరి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.