Smriti Mandhana: మహారాష్ట్రకు చెందిన స్మృతి.. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టుకు నాయకత్వం వహిస్తోంది. గత సీజన్లో ఈమె నాయకత్వంలో బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఇక వైట్ బాల్ ఫార్మాట్ లో స్మృతి అదరగొడుతోంది.. భారీగా పరుగులు చేస్తూ తిరుగులేని ప్లేయర్ గా రికార్డులు సృష్టిస్తోంది. 2013 లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా స్మృతి వన్డేల్లోకి ప్రవేశించింది. ఇదే సంవత్సరం బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా టి20 లలోకి ప్రవేశించింది. 2014లో ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా టెస్టుల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటివరకు 50 వన్డేలు ఆడి 1,951 పరుగులు చేసింది. ఇందులో నాలుగు సెంచరీలు, 16 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 58 టి20 మ్యాచ్ లు ఆడి 1,298 పరుగులు చేసింది. ఇందులో తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో ఐసీసీ ఉత్తమ మహిళా క్రికెటర్ అవార్డుకు ఎంపికైంది.
Also Read: సూపర్ ఓవర్ లో RR ఐదు బంతులే ఎందుకు ఆడింది?
అరుదైన గౌరవం
28 సంవత్సరాల స్మృతి మందానకు మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు అరుదైన గౌరవం ఇచ్చారు.. మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ లో రత్నగిరి జెట్స్ జట్టుకు ఐకాన్ గా స్మృతి మందాన ను నియమించారు. వచ్చే మూడు సంవత్సరాల పాటు ఆమె ఈ స్థానంలో కొనసాగుతుందని మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు వెల్లడించారు..” స్మృతి అద్భుతమైన క్రికెటర్. టీమిండియా కు ఎన్నో విజయాలు అందించింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లోను తన సత్తా చాటింది. బెంగళూరు జట్టును విజేతగా నిలిపింది. ఆమె నాయకత్వం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఆమెను ఆదర్శంగా తీసుకొని ఎంతో మంది మహిళలు క్రికెట్లోకి వస్తున్నారు. ఆమె గురించి మరింత మందికి తెలియాలి. మహిళా క్రికెట్ మనదేశంలో వెలుగొందాలని ఈ నిర్ణయం తీసుకున్నామని” మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు వెల్లడించారు.. స్మృతి మందానను రత్నగిరి జట్టుకు ఐకాన్ గా నియమించడం పట్ల తమకు సంతోషంగా ఉందని వారు పేర్కొన్నారు.
తిరుగులేని బ్యాటింగ్
స్మృతి మందాన అద్భుతంగా బ్యాటింగ్ చేస్తుంది. ప్రత్యర్థి జట్టు బౌలర్లపై ప్రారంభం నుంచే ఎదురు దాడికి దిగుతుంది. పిచ్ ఎలాంటిదైనా సరే సమర్థవంతంగా బ్యాటింగ్ చేస్తుంది. అందువల్లే ఆమెను ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టుకు కెప్టెన్ గా నియమించారు. ఆమె సారధ్యంలో బెంగళూరు జట్టు విజేతగా నిలిచింది. ఇక టీమిండియాలోనూ తన ప్రతిభను నిరూపించుకుంది.. అందువల్లే ఆమెను రత్నగిరి జట్టుకు ఐకాన్ గా మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ నిర్వాహకులు ప్రకటించారు. 2028 వరకు స్మృతి మందాన రత్నగిరి జట్టుకు ఐకాన్ గా ఉంటుంది.. అంతేకాదు మహారాష్ట్ర ప్రీమియర్ లీగ్ పోటీలకు హాజరవుతుంది.. అయితే తనను ఐకాన్ గా నియమించడం పట్ల స్మృతి మందాన హర్షం వ్యక్తం చేసింది.