Smriti Mandhana: ఢిల్లీ జట్టుతో ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం ద్వారా బెంగళూరు కీర్తి పతాక రెపరెపలాడుతోంది.. ముఖ్యంగా ఆ జట్టు కెప్టెన్ స్మృతి మందాన పై ప్రశంసల జల్లు కురుస్తోంది. జట్టుకు ట్రోఫీ తెచ్చిన ఆనందంలో స్మృతి కూడా ఆనంద తాండవం చేస్తోంది. ఆ సంతోషంలోనే ఆమె అడ్డంగా దొరికిపోయింది. ఫలితంగా నెటిజన్ల ముందు సిగ్గు పడిపోతుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..
ఆదివారం ఢిల్లీ జట్టుపై 8 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత బెంగళూరు సంబరాల్లో మునిగిపోయింది. ఆ జట్టు క్రీడాకారిణులు ఉత్సాహంగా మైదానంలో గంతులేశారు. కేరింతలు కొట్టారు. బాణ సంచా పేలుళ్ళ మధ్య సంబరాలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో పలాష్ ముచ్చల్ అనే ఓ సంగీత దర్శకుడు ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ ఫోటో బెంగళూరు కెప్టెన్ స్మృతిని అడ్డంగా దొరికేలా చేసింది. ఎందుకంటే అది కొంతకాలంగా పలాష్ ముచ్చల్ తో స్మృతి ప్రేమలో ఉంది. అయితే ఆ విషయాన్ని బయటపడకుండా జాగ్రత్తపడుతోంది. ఇటీవల మీరు సింగిలా? లేదా మింగిలా? అని విలేకరులు ప్రశ్నిస్తే.. అది మీకు అనవసరం అన్నట్టుగా ఆమె సమాధానం చెప్పింది. అయితే పలాష్ చేసిన పనితో స్మృతి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.
నిన్న ట్రోఫీ గెలిచిన అనంతరం తన ప్రియుడితో స్మృతి ఫోటో దిగింది. దీనిని అతడు తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశాడు. ఈసారి కప్ మనదే అన్నట్టుగా రాసుకొచ్చాడు. అయితే దీనికి స్మృతి ఎరుపు రంగులో లవ్ సింబల్స్ ఎమోజీలతో రిప్లై ఇచ్చింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో ఉందని నెటిజన్లు ఒక అంచనాకు వచ్చారు. పలాష్ ప్రముఖ బాలీవుడ్ గాయకుడు పాలక్ ముచ్చల్ సోదరుడు. ప్రస్తుతం పలాష్ సంగీత దర్శకుడిగా రాణిస్తున్నాడు.. డిష్కియావూన్ అనే సినిమాకు సంగీతం అందించాడు. ఓ వేడుకలో పలాష్ – స్మృతి కలుసుకున్నారు. ఆ తర్వాత అది ప్రేమగా మారింది. ఇప్పటివరకూ వీరిద్దరూ తమ ప్రేమను అధికారికంగా ప్రకటించలేదు. తాజా ఫొటో ద్వారా దానిని ధ్రువపరిచారు. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టా గ్రామ్ లో చక్కర్లు కొడుతోంది.