India vs Zimbabwe 3rd T20I: అతడి బ్యాటింగ్ అమోఘంగా ఉంటుంది. మణి కట్టు సాయంత్రం కొట్టే ఫోర్లు.. అలవోకగా బాదే సిక్సర్లను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. కానీ అలాంటి ఆటగాడు ఫామ్ కోల్పోయాడు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా తనను తాను నిరూపించుకోలేకపోతున్నాడు. ఓపెనర్ గా చరిత్ర సృష్టించాల్సిన వాడు.. టి20 వరల్డ్ కప్ లో ఎక్స్ ట్రా ప్లేయర్ గా మిగిలిపోయాడు. దీంతో అమెరికా నుంచి మధ్యలోనే స్వదేశానికి వచ్చాడు. అయినప్పటికీ అతని మీద ఎంతో నమ్మకంతో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ జింబాబ్వే టూర్ కు కెప్టెన్ ను చేసింది. కానీ అక్కడ రెండు టీ – 20 మ్యాచ్ లోనూ సేమ్ సీన్. మొదటి మ్యాచ్ లో కాస్త పర్వాలేదనిపించినా.. రెండవ మ్యాచ్ లో ఉసూరు మనిపించాడు. దీంతో సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి. అసలు అతన్ని కెప్టెన్ గా ఎందుకు నియమించారంటూ నెటిజన్లు బీసీసీఐ ని ఏకిపారేయడం మొదలుపెట్టారు. “వస్తున్నాడు వెళ్తున్నాడు.. ఇలానే ఆడితే అన్న బ్యాగు సర్దుకుని అస్సాం వెళ్లడం ఖాయమని” ఘాటుగా కామెంట్స్ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల మధ్య టీమిండియా టి20 కెప్టెన్ శుభ్ మన్ గిల్ అర్ద సెంచరీ చేశాడు.
జింబాబ్వేతో జరుగుతున్న 5 t20 మ్యాచ్ ల సీరీస్ లో.. మొదటి టీ20లో మ్యాచ్ లో గిల్ 31 రన్స్ చేశాడు . రెండవ టి20 మ్యాచ్ లో కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో 23 పరుగులు, సౌత్ ఆఫ్రికా తో జరిగిన రెండవ టి20 మ్యాచ్లో గోల్డెన్ డక్, మూడవ టి20 మ్యాచ్లో 12 పరుగులు, వెస్టిండీస్ జట్టుతో జరిగిన తొలి t20 మ్యాచ్ లో మూడు పరుగులు, రెండవ టి20 మ్యాచ్లో ఏడు పరుగులు, మూడవ టి20 మ్యాచ్ లో ఆరు పరుగులు, నాలుగవ టి20 మ్యాచ్లో 77 పరుగులు, ఐదవ టి20 మ్యాచ్లో 9 పరుగులు చేశాడు. జింబాబ్వేతో జరిగిన మూడవ టి20 మ్యాచ్ మినహా.. గత ఆరు ఇన్నింగ్స్ లలో గిల్ ఒక్క అర్ద సెంచరీ కూడా చేయలేకపోయాడు. వాస్తవానికి అద్భుతమైన షాట్లు కొట్టగల నేర్పరితనం గిల్ సొంతం. తిరుగులేని టెక్నిక్ అతడికి కొట్టినపిండి. కానీ గత కొద్దిరోజులుగా అతడు తన పూర్వపు లయను పూర్తిగా కోల్పోయాడు. అనామక ఆటగాడిగా ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టాడు. అందువల్లే టి20 వరల్డ్ కప్ లో 15 మంది క్రీడాకారుల బృందంలో చోటు సంపాదించుకోలేకపోయాడు. వాస్తవానికి శివం దూబే కంటే గిల్ అద్భుతంగా ఆడతాడు. కానీ గత సిరీస్ లలో విఫలం కావడం, ఐపీఎల్ లోనూ ఆశించినంత స్థాయిలో సత్తా చాటకపోవడంతో టీమ్ ఇండియా సెలక్టర్లు అతనిపై పెద్దగా దృష్టి సారించలేకపోయారు.
మూడవ టి20 మ్యాచ్ లో గిల్ 66 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ చెప్పుకో దగ్గదే ఆయనప్పటికీ.. ఈ ఫామ్ ను గిల్ కొనసాగించాల్సి ఉంది. ఎందుకంటే తొలి టీ 20 మ్యాచ్ లో 31 రన్స్ చేసిన గిల్.. ఆ తర్వాత మ్యాచ్లో తేలిపోయాడు. మూడవ టి20 మ్యాచ్ లో 66 పరుగులు చేసిన గిల్.. తదుపరి మ్యాచ్లో ఇదే స్థాయిలో సత్తా చాటాలని అభిమానులు ఆశిస్తున్నారు. ప్రస్తుతం టీమిండియాలో కీలక ఆటగాళ్లయిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా టీ 20 ఫార్మాట్ కు గుడ్ బై చెప్పారు. వారి స్థానాలను భర్తీ చేసేందుకు బీసీసీఐ ఇప్పటి నుంచే కతరత్తు మొదలుపెట్టింది. వారి స్థానంలో ఆడేందుకు విపరీతమైన పోటీ ఉంది. ఒక్కో స్థానం కోసం దాదాపు నలుగురు ఆటగాళ్లు పోటీపడుతున్నారు. యశస్వి జైస్వాల్, రింకూ సింగ్, రుతు రాజ్ గైక్వాడ్ ఎలాగూ సత్తా చాటుతున్నారు. ఇలాంటి సమయంలో గిల్ తన పూర్వపు ఫామ్ కొనసాగించాలి. అప్పుడే అతడు భవిష్యత్తు ఆశా కిరణమవుతాడు.