AP Politics : విజయవాడ : ఏపీలో విపక్ష పార్టీల స్వరం మారుతోందా? అన్ని పార్టీలు ఏకతాటి పైకి రానున్నాయా? అదే జరిగితే టిడిపి కూటమికి ప్రమాద ఘంటికలు తప్పవా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. ఆ పార్టీ అన్ని ఎన్నికల్లో ఏకపక్ష విజయాలను సొంతం చేసుకుంటూ వచ్చింది. కనీసం ప్రతిపక్షాలను లెక్కలోకి కూడా తీసుకోలేదు. వామపక్షాల మద్దతుతో ప్రజా సంఘాలు చేపట్టిన ఆందోళనలను సైతం ఉక్కు పాదంతో అణచివేశారు జగన్. జగన్ పర్యటనకు వెళ్ళినా, రాష్ట్రస్థాయి ఆందోళనలు జరిగినా.. ముందస్తు అరెస్టులు, అక్రమ నిర్బంధాలు కొనసాగేవి. అదే విపక్షాల్లో ఐక్యతకు కారణమైంది. సైద్ధాంతిక విభేదాలు ఉన్నా.. కూటమి పార్టీలకు ఏకపక్షంగా అన్ని వర్గాల ప్రజల మద్దతు దొరికింది.
2019 ఎన్నికల్లో వైసిపి ఒంటరిగానే ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. అంతకుముందు చంద్రబాబు సర్కార్ చేసిన తప్పిదాలతో విపక్షాలన్నీ దూరమయ్యాయి. చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చారు.జనసేన సైతం టిడిపితో కాకుండా వామపక్షాలతో కలిసి పోటీ చేసింది. అదే ఓట్ల చీలికకు కారణమైంది. వైసీపీ విజయానికి దోహద పడింది.టిడిపి దారుణ పరాజయానికి బీజం పడింది కూడా అప్పుడే.అయితే 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సైతం..ప్రజలు తనను చూసి ఓటు వేశారని విపక్షాలను లెక్కలోకి తీసుకోవడం మానేశారు.సాధారణ ప్రజా ఉద్యమాలను సైతం అణచివేశారు.చివరకు సమస్యల సాధనకు కార్మికులు ఆందోళన బాట పట్టినా ఉక్కు పాదం మోపారు. అందుకే ప్రజా సంఘాలు సైతం జగన్ ఓడించాలని బలమైన నిర్ణయానికి వచ్చాయి. షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీ జగన్ ఓడిపోవాలని బలమైన నిశ్చయంతో పనిచేసింది. వామపక్షాలు సైతం జగన్ కు బుద్ధి చెప్పాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యాయి. లోక్సత్తా ఉద్యమ పార్టీ అయితే ఏకంగా కూటమికి మద్దతు ప్రకటించింది. ఇలా అన్ని పార్టీలు జగన్ ఓటమిని కోరుకున్నాయి.
అయితే ఇప్పుడు విపక్షాల ఐక్యతకు కూటమి ప్రభుత్వం అవకాశం ఇస్తుందా? లేదా? అన్నది చూడాలి. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకు చంద్రబాబు సర్కార్ ఓకే చెప్పిందని డెక్కన్ క్రానికల్ పత్రికలో ఒక కథనం వచ్చింది. దానిని ఖండించాల్సింది పోయి.. ఆ కార్యాలయం పై టిడిపి శ్రేణులు దాడి చేశారు. దీనిని విపక్షాలు ఖండించాయి. వైసీపీ అధినేత జగన్ అయితే తీవ్రంగా స్పందించారు. కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో అప్రజా స్వామిక చర్యలు మీరుతున్నాయని ఆరోపించారు. దీనినే సమర్థిస్తూ మాట్లాడారు షర్మిల. మీకు దమ్ముంటే ప్రధాని మోదీని నిలదీయండి అంటూ సవాల్ చేశారు. వామపక్షాలు సైతం ఇదే భావనను వ్యక్తపరిచాయి. బిజెపిని నిలదీయాలని డిమాండ్ చేశాయి. ఇప్పుడు తాజా పరిస్థితులు చూస్తుంటే.. వైసిపి, వామపక్షాలు, కాంగ్రెస్ తో పాటు చిన్నా చితకా పార్టీలు ఏకతాటి పైకి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఆ పార్టీకి 40 శాతం ఓట్లు వచ్చాయి. అయినా సరే 23 స్థానాలకు పరిమితం అయ్యింది. ఇప్పట్లో టిడిపి కోలుకోలేదని విశ్లేషణలు వచ్చాయి. కానీ అధికార పార్టీ వైఫల్యాలు, విపక్షాలన్నీ ఏకతాటి పైకి రావడం వంటి కారణాలతో తెలుగుదేశం పార్టీ బలపడింది. 2023 మార్చిలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్షాలు టిడిపి అభ్యర్థికి మద్దతు తెలిపాయి. అందుకే రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్లు మూడింటిని టిడిపి కైవసం చేసుకుంది. అప్పటి నుంచే వైసిపికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఇప్పుడు కూడా వైసిపి బలపడడానికి అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే మున్ముందు కూటమి ప్రభుత్వం అనుసరించే విధానాలు బట్టి విపక్షాల మధ్య ఐక్యత కుదిరే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీకి ఎదురైన పరిణామాలే టిడిపి కూటమికి సైతం.. ఎదురవుతాయని చెప్పడం అతిశయోక్తి కాదు.