Shreyas Iyer : ఎటువంటి అంచనాలు లేని.. ఏమాత్రం అవకాశాలు లేని పంజాబ్ జట్టును ఈ సీజన్లో ఏకంగా ఫైనల్ దాకా తీసుకెళ్లాడు అయ్యర్. వాస్తవానికి పంజా ప్రయాణం ఎక్కడిదాకా సాగుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రీతి జింటాకు నమ్మకం అయితే.. జట్టు ఈ స్థాయిలో అదరగొడుతుందని ఆమె కలలో కూడా ఊహించి ఉండదు. అయితే అయ్యర్ మాత్రం తన జట్టును మొదటి నుంచి ఒక దారిలో నడిపాడు. గొప్ప గొప్ప జట్లను ఓడించాడు. కొన్ని సందర్భాల్లో ఓటమిపాలైనప్పటికీ.. అదే సమయంలో మళ్లీ దారిలో పెట్టాడు. ఈ సీజన్లో టేబుల్ టాపర్ గా ఉన్న పంజాబ్ జట్టు క్వాలిఫైయర్-1 లో కన్నడ జట్టుతో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్లో అయ్యర్ కూడా అంతగా రాణించలేదు. దూకుడుగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడు ఆ ఓటమికి భయపడకుండా.. యుద్ధం పూర్తి కాలేదు. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోలేదు. మేము ఏమిటో తదుపరి చూపిస్తామని గుండె ధైర్యంతో చెప్పాడు. అదే ధైర్యాన్ని బలమైన ముంబై జట్టు ఎదుట ప్రదర్శించాడు. తద్వారా తను ఎలాంటి ఆటగాడో నిరూపించుకున్నాడు. మొత్తంగా తాను ఇక్కడికి సాధారణ కెప్టెన్గా రాలేదని.. ఈసారి ట్రోఫీని పట్టుకు పోవడానికి వచ్చానని మాటల ద్వారా స్పష్టం చేశాడు.
Also Read : స్నేహితురాలితో చిల్ అవుతున్న శిఖర్ ధావన్! ఫోటోలు వైరల్
సరిగ్గా 2020లో ఢిల్లీ జట్టుకు నాయకుడిగా ఎంపికైన అయ్యర్.. ఆ సీజన్లో ఆ జట్టును ప్లే ఆఫ్ దాకా తీసుకెళ్లాడు. కానీ దురదృష్టవశాత్తు ఆ జట్టు ఓడిపోయింది. ఢిల్లీ జట్టును అక్కడదాక తీసుకెళ్లడం అప్పట్లో ఒక అద్భుతమైతే..జట్టును నడిపించిన విధానం మరింత అద్భుతం. అప్పట్లోనే అయ్యర్ గురించి విపరీతమైన చర్చ జరిగింది. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ అతడు ఆ జట్టు నుంచి బయటికి వచ్చాడు. కోల్ కతా నాయకుడిగా బాధ్యతలు స్వీకరించాడు. గత సీజన్లో ఏకంగా ఛాంపియన్ గా ఆవిర్భవించేలా చేశాడు. దురదృష్టవశాత్తు ఆ ఘనత మొత్తం మెంటర్ గౌతమ్ గంభీర్ ఖాతాలోకి వెళ్లిపోయింది. అయినప్పటికీ అయ్యర్ ఏమాత్రం ఇబ్బంది పడలేదు. ఇక గౌతమ్ గంభీర్తో ఏర్పడిన వివాదం వల్ల అతడు షారుక్ ఖాన్ జట్టు నుంచి బయటికి వచ్చాడు. అతడిని వెంటనే ప్రీతి జింటా కొనుగోలు చేసింది. భారీ ధరకు అతడిని దక్కించుకుంది. ఆ తర్వాత అతడు ఒక్కసారిగా పంజాబ్ జట్టు రూపురేఖలు మార్చేశాడు. ఈ క్రతువులో ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. జట్టు లో క్రమశిక్షణను నేర్పాడు. పాంటింగ్ తో కలిసి జట్టులో లోపాలను సవరించాడు. అనామక జట్టు నుంచి.. అనితర సాధ్యమైన జట్టుగా పంజాబ్ ను రూపొందించాడు..
పంజాబ్ జట్టుకు నాయకుడిగా వచ్చే కంటే ముందు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో గత ఏడాది అయ్యర్ స్థానం కోల్పోయాడు. టెస్ట్ జట్టులో అవకాశం లభించలేదు. టి20 జట్టులో చోటు దక్కలేదు. చాంపియన్స్ ట్రోఫీ ముందు వరకు వన్డే జట్టులో కూడా అతడికి స్థానం లేదు. దేశీయ టోర్నీలు ఆడటంలేదని బీసీసీఐ పెద్దలు అతని మీద కక్ష కట్టారు. క్రమశిక్షణ పాటించడని ఆరోపించారు. ఇవన్నీ మనసులో పెట్టుకున్న అతడు..ఒక్క ఆరోపణ చేయకుండా దేశీయ టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ముంబై జట్టు 11 సంవత్సరాల తర్వాత విజయ్ హజారే, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో చోటు దక్కించుకున్నాడు. దానికంటే ముందు ఛాంపియన్స్ ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టీమిండియా ట్రోఫీ సాధించడంలో కీలక భూమిక పోషించాడు.. మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్లో కన్నడ జట్టును ఓడించి ట్రోఫీ గనక అందుకుంటే అయ్యర్ మానియా మామూలుగా ఉండదు. రెండు భిన్నమైన జట్లను రెండు సీజన్లో విజేతలుగా నిలిపిన ఘనత అతడి సొంతమవుతుంది.