Indian Cricket Team : స్వదేశంలో భారత్ ఇంతవరకు వైట్ వాష్ కు గురి కాలేదు. కానీ ఆ రికార్డును న్యూజిలాండ్ బద్దలు కొట్టింది. అంతేకాదు భారత్ పై తొలిసారి 3-0 తేడాతో టెస్ట్ సిరీస్ గెలిచింది. ఆ సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు దారుణంగా విఫలమయ్యారు. ఆడుతోంది సొంత దేశంలో అనే విషయాన్ని మర్చిపోయి.. పెవిలియన్ చేరడానికి క్యూ కట్టారు. కనీసం క్రీజ్ లో నిలబడేందుకు ఏమాత్రం ప్రయత్నించలేదు.. ఆ వైఫల్యం టీమిండియా క్రికెట్ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిలిపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా వెళ్లిపోయిన టీం ఇండియా.. పెర్త్ మినహా మిగతా అన్ని టెస్ట్ మ్యాచ్లలో దారుణంగా విఫలమైంది. ఆటగాళ్లు ఏమాత్రం పోరాట పటిమను ప్రదర్శించలేకపోయారు.
వరుసగా విఫలం అవుతున్నప్పటికీ..
ఆటగాళ్లు వరుసగా విఫలమవుతున్నప్పటికీ టీమిండియా మేనేజ్మెంట్ ప్రక్షాళన ప్రారంభించలేదు. హర్షిత్ రాణా, ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్, గిల్ విషయంలో మార్పులు చేర్పులు చేపట్టిన టీమిండియా మేనేజ్మెంట్.. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ , రోహిత్ శర్మ (సిడ్నీ టెస్ట్ మాత్రమే) విషయంలో కఠిన చర్యలు తీసుకోలేకపోయింది. కేఎల్ రాహుల్ వరుసగా విఫలమైనప్పటికీ, విరాట్ కోహ్లీ దారుణంగా ఆడుతున్నప్పటికీ.. ఏమాత్రం పట్టించుకోలేదు.. పైగా చిన్న చిన్న ఆటగాళ్లపై తన ప్రతాపాన్ని చూపించింది. ఆస్ట్రేలియాలో షాన్ మార్ష్ అనే ఆటగాడు సరిగ్గా ఆడలేక పోతుంటే.. జట్టు మేనేజ్మెంట్ మొహమాటం లేకుండా పక్కన పెట్టింది. అతడి స్థానంలో వెబ్ స్టర్ ను తీసుకొచ్చింది.. జోష్ హెజిల్ వుడ్ మెరుగ్గా ఆడినప్పటికీ.. అతని పక్కనబెట్టి బోలాండ్ ను తీసుకొచ్చింది. బోలాండ్ మెల్ బోర్న్, సిడ్ని టెస్టులలో ఆస్ట్రేలియా సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు.. విజయాలు సాధించాలనే తపన.. స్థిరంగా నిలబడాలని కోరిక ఉంటేనే ఇలాంటి మార్పులు సాధ్యమవుతాయి. ఇవి చేయలేదు కాబట్టే టీమ్ ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని కోల్పోయింది. మార్పులు చేర్పులు చేపట్టింది కాబట్టే రెండుసార్లు ఓడిపోయినప్పటికీ.. మూడోసారి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఆస్ట్రేలియా దక్కించుకుంది. అందువల్లే క్రికెట్లో ప్రయోగాలు చేయాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ప్రక్షాళనకు ఎప్పటికప్పుడు సిద్ధం కావాలి. జట్టులో నూతనత్వాన్ని ప్రదర్శించేలా చేయాలి. దృఢత్వాన్ని ప్రస్ఫుటం చేయాలి. బలమైన నేపథ్యాన్ని ఇనుమడింపజేయాలి. అప్పుడే టీం అత్యంత సమర్థవంతంగా ఉంటుంది. లేకపోతే ఇలాంటి వరుస ఓటములనే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. జట్టును ప్రక్షాళన చేయాల్సిందే. ఆడని ఆటగాళ్లను పక్కన పెట్టాల్సిందే. టి20 మాదిరిగానే యువ రక్తాన్ని టెస్ట్ జట్టులోకి ఎక్కించాల్సిందే. లేకపోతే టీమిండియా కు ఇలాంటి ఓటములు తరచుగా ఎదురవుతూనే ఉంటాయి.