Shivam Dube: టి20 వరల్డ్ కప్ లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తేలిపోతున్నాడు.. లీగ్ మ్యాచ్లలో దారుణంగా ఆడుతూ అభిమానులను నిరాశ పరుస్తున్నాడు. బలహీనమైన ఐర్లాండ్ పై 1, దాయాది పాకిస్తాన్ పై 4, అమెరికా పై 0 పరుగులు చేసి విమర్శలు మూట కట్టుకుంటున్నాడు. దీంతో విరాట్ కోహ్లీ ఆట తీరుపై ట్రోల్స్ మొదలయ్యాయి. చాలామంది సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీని ఉద్దేశించి రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. విరాట్ కోహ్లీ తప్పించి.. యశస్వి జైస్వాల్ కు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ పై శివం దూబే చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
జూన్ 20న భారత్ సూపర్ -8 లో భాగంగా తన తొలి మ్యాచ్ ఆడుతుంది. దీనికంటే ముందు లీగ్ దశలో తన చివరి మ్యాచ్ కెనడా తో తలపడుతుంది. ఫ్లోరిడా వేదికగా జరిగే ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు పొంచి ఉంది. ఒకవేళ వర్షం వల్ల ఈ మ్యాచ్ రద్దు అయితే.. సూపర్ -8 కంటే ముందు విరాట్ కోహ్లీ తిరిగి తన పూర్వపు లయను దక్కించుకోవడం ఒక రకంగా కష్టమే. ఇలాంటి క్రమంలో తోటి ఆటగాడు శివం దూబే విరాట్ కోహ్లీకి సపోర్టుగా నిలిచాడు. విరాట్ కోహ్లీ ఫామ్.. ఆట తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు..
శివం దూబే తొలి రెండు మ్యాచ్లలో ఆకట్టుకోలేక పోయినప్పటికీ.. అమెరికాతో జరిగిన మ్యాచ్లో 31 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. భారత్ ఆ మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. అనంతరం శివం దూబే విలేకరులతో మాట్లాడాడు. ” టి20 వరల్డ్ కప్ లో టీమిండియా ఇప్పటివరకు మూడు లీగ్ మ్యాచ్లు ఆడింది. ఇందులో స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. బ్యాట్ తో అతడు పరుగులు చేయలేకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. సోషల్ మీడియాలో వారి బాధను చూస్తే జాలి వేస్తోంది. అయితే విరాట్ కోహ్లీ తదుపరి మ్యాచ్లలో తన అసలు రూపాన్ని చూపిస్తాడు. ఇందులో ఎవరికీ ఎటువంటి సందేహం లేదు.. కచ్చితంగా ఆ మూడు మ్యాచ్లలో 100 పరుగుల చొప్పున కొట్టేస్తాడని” శివం దూబే వ్యాఖ్యానించాడు.
మరోవైపు న్యూయార్క్ మైదానాలపై సిక్స్ లు ఎందుకు కొట్టడం లేదని విలేకరులు ప్రశ్నిస్తే.. “ఇక్కడి మైదానాలు పూర్తి విభిన్నంగా ఉన్నాయి. న్యూయార్క్ మైదానం అత్యంత కఠినంగా ఉంది.. బంతి నేరుగా వికెట్ల మీదికి దూసుకు వస్తోంది. పరుగులు తీయడం కాదు కదా డిపెండ్ చేయడం చాలా కష్టంగా మారింది.. అలాంటప్పుడు పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుంది. అందువల్లే సిక్సర్లు ఆశించినంత స్థాయిలో కొట్టలేకపోతున్నామని” శివం దూబే వ్యాఖ్యానించాడు.