T20 World Cup 2024 : ఐపిఎల్ సీజన్లో రోహిత్ మెరుపులు మెరిపిస్తున్నాడు. అద్భుతంగా ఆడుతున్నాడు. ఉన్నంత సేపు దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. హార్దిక్ పాండ్యా రాణించలేకపోతున్నప్పటికీ.. తీసిపారేయలేనంత ఆటగాడు కాదు. తనదైన రోజు వస్తే బ్యాటింగ్, బౌలింగ్లో అతడు సత్తా చాట గలడు. ఒంటి చేత్తో మ్యాచ్ గెలిపించగలడు.. అయితే వీరిద్దరూ ఉన్నప్పటికీ ఐపీఎల్ లో ముంబై జట్టు ఆశించినత స్థాయిలో ఆడటం లేదు. పాయింట్ పట్టికలో కింది వరుసలో ఉంది. కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో రాజస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఫలితంగా ప్లే ఆఫ్ ఆశలను సంక్లిష్టం చేసుకుంది. ఈ క్రమంలో ముంబై జట్టు ఆట తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తవుతున్నాయి. మాజీ క్రికెటర్ల నుంచి అభిమానుల వరకు ముంబై జట్టును ఏకి పారేస్తున్నారు. అందులో టీమిండియా మాజీ ఆటగాడు హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
రాజస్థాన్ జట్టు తో జరిగిన మ్యాచ్లో ముంబై ఓడిపోయిన నేపథ్యంలో.. హర్భజన్ సింగ్ ఆ జట్టు ఆటగాళ్ళను తీవ్రంగా విమర్శించాడు..”చాలామంది ఆటగాళ్లు ఫామ్ లేమితో ఇబ్బంది పడుతుంటారు. చాలామంది నుంచి విమర్శలు ఎదుర్కొంటారు. కొన్నిసార్లు జట్టుకు దూరం కూడా అవుతుంటారు. అలాంటి వారికి ఒకటే చెప్పేది. ఫామ్ అనేది తాత్కాలికం. క్లాస్ అనేది శాశ్వతం. దీనికి ఉదాహరణ యశస్వి జైస్వాల్ ఆడిన ఇన్నింగ్స్. వికెట్ కీపర్, బ్యాటర్ గా సంజూ సాంసన్ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఒకవేళ అతడికి అవకాశం ఇస్తే టీ – 20 ప్రపంచ కప్ వరకే పరిమితం చేయొద్దు. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వర్తమాన ఆటగాళ్ల చేతుల్లోకి టీమిండియా వెళ్లిపోవడం మంచిదనిపిస్తోంది. రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ బాధ్యతను అప్పగించాల్సి వస్తే.. సంజూ సాంసన్ కు ఇవ్వడం మంచిది. ఆ తర్వాత రోహిత్ ను ఇంకా కెప్టెన్ గా కొనసాగించడంలో అర్థం లేదని” హర్భజన్ సింగ్ ట్విట్టర్ ఎక్స్ లో రాసుకొచ్చాడు.
యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ ను హర్భజన్ సింగ్ కొనియాడాడు. ఇదే సమయంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పట్ల ఒకింత నిర్వేదం వ్యక్తం చేశాడు. అతడు పనికిరాడనే స్థాయిలో వ్యాఖ్యలు చేశాడు. కాగా, ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ జట్టు సారధిగా సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు. జట్టు కూర్పు కూడా చాలా బాగుంది. ఆటగాళ్లు కీలకమైన సమయాల్లో రాణిస్తున్నారు. అసలు ఈ సీజన్లో ఎటువంటి అంచనాలు లేకుండా మైదానంలోకి అడుగుపెట్టిన రాజస్థాన్ జట్టు.. అద్భుతమైన విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో కొనసాగుతోంది. ముంబై జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలుపొంది ప్లే ఆఫ్ ఆశలను మరింత పటిష్టం చేసుకుంది.