Air Travel : దేశంలోని విమానయాన సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి పక్కనే సీటును కేటాయించాలని ఎయిర్‌లైన్స్ కంపెనీలకు సూచించింది.
ఫిర్యాదుల వెల్లువ..
విమాన ప్రయాణం సందర్భంగా పిల్లలకు తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పక్కన సీటు కేటాయిచడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో డీజీసీఏకు అనేక మంది ఫిర్యాదులు చేశారు. ఈ ఫిర్యాదులను పరిగణలోకి తీసుకున్న డీజీసీఏ.. తల్లిదండ్రులు లేదా సంరక్షకుల పక్కనే సీటు కేటాయించడం సరైందే అని భావించింది. ప్రయాణం సజావుగా సాగుతుందని నిర్ణయానికి వచ్చింది. ఈ క్రమంలో విమానయాన సంస్థలకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది.
రికార్డుల్లో నమోదు..
ఇక విమాన టికెట్ బుకింగ్ సమయంలో పిల్లల వారి పక్కనే సీటు కేటాయించడంతోపాటు తల్లిదండ్రుల్లో ఎవరి పక్కన సీటును కేటాంచారో రికార్డుల్లో నమోదు చేయాలని డీజీసీఏ తాజా ఆదేశాల్లో పేర్కొంది. మరికొన్ని రూల్స్‌ను సైతం మార్చింది. ప్రిఫరెన్సియల్ సీటింగ్ అంశాన్ని ప్రస్తావించింది. విమానం బయలుదేరే సమయం వరకు చెకిన్ కోసం ఏ సీటు ఎంచుకోని ప్రయాణికులకు ఆటోమేటిక్‌గా సీటు కేటాయించే నిబంధనను మార్చింది. జీరో బ్యాగేజీ ఛార్జీలు, భోజనం, స్నాక్, డ్రింక్ ఛార్జీలు, సంగీత వాయిద్యాలు తీసుకెళ్లేందుకు వసూలు చేసే ఛార్జీలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ విషయంపై విమానయాన సంస్థలు గతంలోనే డీజీసీఏకు విన్నవించారు. వాటిని పరిశీలించి ఛార్జీల పెంపునకు అనుమతి ఇస్తూ ట్రాన్స్‌పోర్ట్ సర్క్యులర్‌లో డీజీసీఏ పేర్కొంది.