Sanju Samson-Tilak Verma : విరాట్, రోహిత్ వెళ్లిపోయిన తర్వాత.. వారి స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు ఎవరు? అనే ప్రశ్నకు ఇప్పటిదాకా సమాధానం లభించలేదు. ఇకపై ఆ ప్రశ్న తలెత్తే అవకాశం లేదు. ఎందుకంటే వారిద్దరి స్థానాలు భర్తీ చేసే ఆటగాళ్లు వచ్చేశారు. రావడమే కాదు టీమిండియా కు విజయాలను అందించడం మొదలుపెట్టారు. అది కూడా స్వదేశంలో కాదు.. మనకు అచ్చిరాని విదేశంలో.. దక్షిణాఫ్రికా మైదానంలో.. ఇటీవలి దక్షిణాఫ్రికా సిరీస్ లో సంజు శాంసన్, తిలక్ వర్మ చెరి రెండు సెంచరీలు చేశారు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడే వారిద్దరు అసాధారణమైన ఇన్నింగ్స్ ఆడారు. అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకున్నారు. దీంతో వీరిద్దరూ రోహిత్, విరాట్ స్థానాలను భర్తీ చేశారని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
2015లో ఎంట్రీ
సంజు 2015లో ఇంటర్నేషనల్ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు 37 t20 లు ఆడాడు. 16 వన్డేలలో ప్రాతినిధ్యం వహించాడు. అవకాశాలు రాకపోవడం.. వచ్చిన వాటిని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో అతడికి జట్టులో సుస్థిర స్థానం అంటూ లేకుండా పోయింది.. బంగ్లాదేశ్ సిరీస్ వరకు 30 t20 ఇన్నింగ్స్ లలో సంజు కు బ్యాటింగ్ ఆర్డర్లో ఏడవ స్థానం మాత్రమే లభించింది.. 2015లోనే ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. అతడు రెండో మ్యాచ్ లో ప్రాతినిధ్యం వహించేందుకు దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. ఇక ఈ ఏడాది బంగ్లాదేశ్ జట్టుతో జరిగిన సిరీస్లో యశస్వి జైస్వాల్, గిల్ కు టీమిండియా మేనేజ్మెంట్ విశ్రాంతి ఇచ్చింది. దీంతో సంజుకు అవకాశం లభించింది. ఫలితంగా మెరుపు ఆట తీరు ప్రదర్శించాడు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఏకంగా సెంచరీ కొట్టేశాడు. 2013లో రోహిత్ ఆడినట్టు.. 2024 లో సంజు దుమ్ము దులిపేస్తున్నాడు.. రోహిత్ 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా తన కెరియర్ ను పునరావిష్కరించుకున్నాడు. జట్టులో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఇప్పుడు సంజు కూడా అదే స్థాయిలో ఆడుతున్నాడు.. తను ఆడిన ఐదు మ్యాచ్లలో మూడు సెంచరీలు చేశాడు. టి20 ఫార్మేట్ లో వరుసగా రెండు సెంచరీలు చేసిన టీమిండియా ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.
తిలక్ వర్మ
అనేక కష్టాలు ఎదుర్కొని టీమిండియాలో స్థానం సంపాదించాడు ఆటగాడు తిలక్ వర్మ. ఇతర వయసు 22 సంవత్సరాలు మాత్రమే. అయితే ఇప్పుడు భారత క్రికెట్ లో నవ యువ సంచలనంగా ఇతడు మారాడు. ఐపీఎల్ లో అదరగొట్టాడు. దేశవాళిలో సత్తా చూపించాడు. గత ఏడాది ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. గాయాల వల్ల.. నిలకడ లేకపోవడం వల్ల జట్టుకు దూరమయ్యాడు. అయితే ఇప్పుడు వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నాడు. గాయం వల్ల శ్రీలంక, జింబాబ్వేసిరీస్లో అతడు ఆడలేదు. బంగ్లాతో ఆడే సిరీస్ కు అతడికి అవకాశం రాలేదు. ఇక దక్షిణాఫ్రికా సిరీస్లో తొలి రెండు మ్యాచ్లలో 33, 20 పరుగులు చేశాడు. అయితే సూర్యకుమార్ ను ప్రత్యేకంగా అభ్యర్థించి మూడో స్థానంలోకి బ్యాటింగ్ కు దిగాడు. అంతే ఒక్కసారిగా తన విశ్వరూపాన్ని చూపించడం మొదలుపెట్టాడు. ఏకంగా వరుసగా రెండు సెంచరీలు చేసి తన సత్తా ఏమిటో చూపించాడు. అద్భుతమైన బ్యాటింగ్.. అనితర సాధ్యమైన ఫుట్ వర్క్. బెంబేలెత్తించే బలమైన స్టాండింగ్ తో విరాట్ కోహ్లీ తనని భర్తీ చేస్తున్నాడు. అంతేకాదు టి20 క్రికెట్లో టీమిండియా ఆడిన ద్వైపాక్షిక సిరీస్లో హైయెస్ట్ రన్ చేసిన రికార్డు ఇప్పటివరకు విరాట్ కోహ్లీ మీద ఉంది. విరాట్ కోహ్లీ ఇంగ్లాండ్ జట్టుపై ఐదు మ్యాచ్లు ఆడి 231 రన్స్ చేశాడు. అయితే ఆ రికార్డును తిలక్ వర్మ బద్దలు కొట్టాడు. దక్షిణాఫ్రికా పై నాలుగు మ్యాచ్లు ఆడిన తిలక్ 280 పరుగులు చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మాత్రమే కాదు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ పురస్కారాలు కూడా దక్కించుకున్నాడు. అయితే బ్యాటింగ్ మాత్రమే కాకుండా తిలక్ వర్మ బౌలింగ్ కూడా చేయగలడు. అతడు అద్భుతమైన ఆల్ రౌండర్ గా ఎదగాలని కోరుకుంటున్నాడు. మూడు ఫార్మాట్ లలో స్థిరమైన ఆట తీరు ప్రదర్శించాలని భావిస్తున్నాడు. ఇప్పటివరకు తిలక్ 20 t20 మ్యాచ్ లు ఆడాడు. 4 వన్డేలలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అయితే ఇతడి సగటు 51.33 గా ఉండడం గమనార్హం.