Etala Rajender : ఈటల రాజేందర్.. స్టూడెంట్ లీడర్ నుంచి ఎదిగిన నేత. మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం కొట్లాడిన నేత. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ తరువాత ఆయనే అంతటి మోస్ట్ పాపులర్ లీడర్. పార్టీలోనూ ఆయనకు ఆ స్థాయిలోనే గుర్తింపు ఉండేది. ఆ తరువాత కొన్ని పరిణామాల వల్ల ఆయన బీఆర్ఎస్ పార్టీకి దూరం అయ్యారు. పార్టీ నుంచి తప్పుకున్నారు. ఆయన పార్టీతోపాటే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆ తదుపరి బీజేపీలో చేరారు. ఇక అప్పటి నుంచి బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్నారు. ఆ సమయంలో వచ్చిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఈటల.. పోయిన ఎన్నికల్లో అనూహ్యంగా ఓడిపోయారు. ఆ తరువాత ఎంపీగా పోటీచేసి గెలుపొందారు.
తాజాగా.. బీజేపీలో ఈటల రాజేందర్ వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ఆ పార్టీలో ఆయన వైఖరి ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చినప్పటికీ ఇంకా ఆయనలో అదే రక్తం ప్రవహిస్తున్నదా అన్నట్లు ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్ ఎజెండానే బీజేపీకి రుద్దే ప్రయత్నం చేస్తున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇటీవల మూసీ అంశాన్ని తీసుకున్నా అదే రుజువైంది. మూసీపై బీఆర్ఎస్ చేస్తున్న వాదనలనే ఈటల వాదించడం కనిపించింది. బీఆర్ఎస్ ఏది చెబితే దానినే కోరస్ పడడం కనిపించింది. పైగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన దాంట్లో తప్పేముంది అన్నట్లుగా ఈటల కామెంట్స్ చేయడం ఆశ్చర్యానికి దారితీసింది.
ఇవన్నీ ఇలా ఉంటే.. ఇటీవల కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం వెనుక ఈటల రాజేందర్ హస్తం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మూసీ విషయంలో బీజేపీలోని కీలక నేతలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ముందుగా సాగారు. కానీ.. ఈటల మాత్రం బీఆర్ఎస్‌ను ఫాలో అయ్యారు. కేటీఆర్ తరహాలోనే దూకుడుగా ముందుకు సాగారు. మూసీ ప్రక్షాళనలో అవినీతి దగ్గర నుంచి ఇళ్ల కూల్చివేతలను వ్యతిరేకించడం వరకు అంతా బీఆర్ఎస్ నేతల్లాగానే ప్రకటన చేశారు. అటు కలెక్టర్‌పై దాడి వ్యవహారంలోనూ ఈటల తీరు బీఆర్ఎస్‌కు దగ్గర పోలికలు ఉన్నట్లుగా వెల్లడైంది. సామాన్యులపై కేసులు పెడుతున్నారని ఈటల ముందుగానే ఆరోపించారు. బీఆర్ఎస్ కూడా అదే వాదించింది. ఇక.. కలెక్టర్‌పై దాడి చేయాల్సిన అవసరం లేదని, అది కరెక్ట్ కాదని మాత్రం ఈటల ఖండించలేదు. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చాక రాజేందర్‌ను కేసీఆర్ ప్రభుత్వం ఏ స్థాయిలో ఇబ్బందులు పెట్టిందో ఇప్పుడు ఆయన మరిచిపోయినట్లుగా ఉన్నారా అన్న టాక్ నడుస్తోంది. ఆ సమయంలో ఇతర పార్టీల నేతలు కూడా ఆయనకు మద్దతుగా నిలిచారు. కేవలం కక్షసాధింపుతోనే ఇదంతా చేస్తున్నారని దుయ్యబట్టారు. కానీ.. తాజాగా ఈటల రాజేందర్ వ్యవహారం మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఫాలో అవుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే.. ఈటల రాజేందర్ మాత్రం వ్యూహాత్మకంగానే ఇవన్నీ వినిపిస్తున్నారని, దీని వెనుక రాజకీయ ఎజెండా వేరే ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.