Sanath Jayasuriya సరిగ్గా రెండు దశాబ్దాల క్రితం శ్రీలంక స్పిన్ బౌలింగ్ కు ముత్తయ్య మురళీధరన్ వెన్నెముకలా నిలిచేవాడు. తనదైన రోజు జట్టుకు అద్భుతమైన విజయాలు అందించేవాడు. ముత్తయ్య మురళీధరన్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత అజంతా మెండిస్ తెరపైకి వచ్చాడు. అతడి కూడా మురళి వారసత్వాన్ని కొనసాగించాడు. అజంతా మెండిస్ రిటర్మెంట్ ప్రకటించిన తర్వాత శ్రీలంక స్పిన్ బౌలింగ్ గాడి తప్పింది, గతి తప్పింది అనే వ్యాఖ్యలు వినిపించాయి. అయితే ఆ వ్యాఖ్యలు తప్పు అని.. యువరక్తం తో శ్రీలంక స్పిన్ బౌలింగ్ ఉరక లెత్తుతోందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి.
టి20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత టీమిండియా జింబాబ్వేలో పర్యటించింది. 4-1 తేడాతో సిరీస్ దక్కించుకుంది.. ఆ తర్వాత శ్రీలంకతో టి20 సిరీస్ ఆడింది. ఆతిథ్య జట్టును ఓడించి ట్రోఫీ దక్కించుకుంది. కానీ వన్డే సిరీస్ కు వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. బలమైన భారత బ్యాటర్లు.. ఫామ్ లో స్టార్ ఆటగాళ్లు శ్రీలంక స్పిన్ బౌలింగ్ కు దాసోహమయ్యారు. పరుగులు కాదు కదా.. వికెట్ కాపాడుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. రోహిత్ నుంచి మొదలుపెడితే అర్ష్ దీప్ సింగ్ వరకు ఇదే పరిస్థితి. దీంతో భారత ఆటగాళ్లపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇదే సమయంలో శ్రీలంక స్పిన్ బౌలింగ్ కు ప్రశంసలు లభించాయి. జయ సూర్య కోచ్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత శ్రీలంక ఆట తీరు ఒక్కసారిగా మారిపోయింది. ఆ జట్టులో ఆటగాళ్లు మెరుగ్గా రాణిస్తున్నారు. ముఖ్యంగా కమిందు మెండీస్, నిస్సాంక, రత్నాయకే అలాంటి ఆటగాళ్లు అనితర సాధ్యమైన ఆట తీరు ప్రదర్శిస్తున్నారు. ఇంగ్లాండ్ లో శ్రీలంక మూడు టెస్టులు ఆడింది. తొలి రెండు టెస్టులు పడిపోయినప్పటికీ.. పడి లేచిన కెరటం లాగా మూడవ టెస్టులో విజయం సాధించింది. ముఖ్యంగా మూడో టెస్టులో యువ ఆటగాళ్ల ప్రదర్శన శ్రీలంక జట్టుకు సరికొత్త ఉత్సాహం ఇచ్చింది .
జయ సూర్య సాహసం
రెండు టెస్టులు ఓడిపోయిన అనంతరం జట్టులోకి నిస్సాంక కు జయసూర్య అవకాశం ఇచ్చాడు. అతడికి అవకాశం ఇవ్వడం పట్ల నెట్టింట విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ జయ సూర్య పట్టించుకోలేదు. జయసూర్య నమ్మకాన్ని నిలబెడుతూ నిస్సాంక తొలి ఇన్నింగ్స్ లో ఆఫ్ సెంచరీ చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో అద్భుతమైన సెంచరీ చేసి.. శ్రీలంక జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. ఈ ప్రయోగంతో జయ సూర్య శ్రీలంక జట్టులో జవసత్వాలు నింపడానికి ప్రయత్నిస్తున్నాడు.
పేక మేడలా కూలిపోయింది
వాస్తవానికి మూడో టెస్టులో ఇంగ్లాండ్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో 325 పరుగులు చేసింది. పోప్ 154 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. డకెట్ 86 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. 14 పరుగుల తేడాతో సెంచరీని కోల్పోయాడు. ఆ తర్వాత శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 263 రన్స్ చేసింది. ధనుంజయ 69, కమిందు మెండిస్ 64, నిస్సాంక 64 పరుగులతో ఆకట్టుకున్నారు. ఇక రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ 156 పరుగులకే ఆల్ అవుట్ అయింది. లాహిరి కుమారా నాలుగు వికెట్లు పడగొట్టాడు. విశ్వ 3 వికెట్లు తీశాడు. హర్షిత రెండు వికెట్లు సొంతం చేసుకున్నాడు. రత్నాయకే ఒక వికెట్ దక్కించుకున్నాడు. ఇంగ్లాండ్ సెకండ్ ఇన్నింగ్స్ లో స్మిత్ ఒక్కడే హాఫ్ సెంచరీ చేశాడు. అతడు కనుక ఆ పరుగులు చేయకుంటే ఇంగ్లాండ్ మరింత దారుణంగా ఓడిపోయేది.
శ్రీలంక ఆట తీరు మారిపోయింది
కొంతకాలంగా శ్రీలంక జట్టు ప్రదర్శన ఏమంత గొప్పగా లేదు. వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్ లో దారుణమైన ఆట తీరు ప్రదర్శించింది. జయ సూర్య కోచ్ అవతారం ఎత్తిన తర్వాత శ్రీలంక జట్టు ఆట తీరు పూర్తిగా మారిపోయింది. ఇటీవల టీమిండియా పై శ్రీలంక వన్డే సిరీస్ గెలిచింది. ఇంగ్లాండ్ పై చివరి టెస్టు లో గెలుపును దక్కించుకుంది. స్థూలంగా చూస్తే జయ సూర్య శ్రీలంక జట్టును సమర్థవంతంగా తయారు చేస్తున్నట్టు కనిపిస్తోంది.