Rohit Vs Shami: మన దాయాదిదేశ క్రికెట్ జట్టులో అలా జరిగితే.. “అబ్బో చూశారా.. ఎంత దారుణమో” అన్నట్టుగా మన దేశ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ రెచ్చిపోయారు. అయితే ఇప్పుడు ఆ పరిణామం మన క్రికెట్ జట్టులోనూ చోటుచేసుకుంది..”ఇళ్లు అన్నాకా గొడవలు జరగవా? జట్టు అన్నాకా వాగ్వాదాలు చోటుచేసుకోవా?” అనే ప్రశ్న మీలో ఉదయించవచ్చు. కాకపోతే క్రమశిక్షణకు మారుపేరైన టీమిండియాలో ఇలాంటివి జరగడమే కాస్త ఆశ్చర్యకరం. సంచలనం కూడా. గతంలో జరిగితే జరిగి ఉండవచ్చు. కాకపోతే నాడు క్రికెట్ పై మన ఆధిపత్యానికి.. నేడు మన ఏకచత్రాధిపత్యానికి చాలా తేడా ఉంది.. అందువల్లే ప్రపంచ మీడియా మొత్తం ఇటువైపు చూస్తోంది. ఇంతకీ టీమ్ ఇండియాలో అంతటి జరగరని సంఘటన ఏం జరిగింది? ఎందుకింత చర్చ జరుగుతోంది అంటే..
గొడవపడ్డారట
ఇటీవల టీమిండియా న్యూజిలాండ్ జట్టుతో స్వదేశంలో టెస్ట్ సిరీస్ ఆడింది. బెంగళూరు వేదికగా న్యూజిలాండ్ తో తొలి టెస్ట్ లో తలపడింది. ఆ సమయంలో టీమిండియా పేస్ బౌలర్ మహమ్మద్ షమీని కెప్టెన్ రోహిత్ శర్మ కలిశాడు. అంతకుముందు లండన్ లో సెమి తన కాలికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ చికిత్స పొందుతున్నాడు. ఫిజియోలు, ఇతర వైద్యుల పర్యవేక్షణలో అతడు తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నాడు. తన సామర్థ్యాన్ని తిరిగి సాధించేందుకు అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ సమయంలోనే అతడిని రోహిత్ శర్మ కలిశాడు. ఆ సందర్భంగా రోహిత్ శర్మ, షమీ మధ్య కుశల ప్రశ్నలు అయిపోయిన తర్వాత.. వాగ్వాదం జరిగిందట. దీనిపై జాతీయ మీడియాలో రకరకాల కథనాలు ప్రసారం అవుతున్నాయి.. నాడు బెంగళూరు టెస్ట్ కంటే ముందు రోహిత్ శర్మ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆ సమయంలో మహమ్మద్ షమీ సామర్థ్యం పై విలేకరులు ప్రశ్నించగా.. “మహమ్మద్ షమీ గాయపడ్డాడు. అతడు గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. పూర్తిస్థాయిలో సామర్థ్యాన్ని సాధించలేకపోవడం వల్ల న్యూజిలాండ్ తో జరిగే టెస్ట్ సిరీస్ కు అతడిని ఎంపిక చేయలేదని” రోహిత్ వ్యాఖ్యానించాడు. ఈ మాటలు మహమ్మద్ షమీకి ఆగ్రహం తెప్పించాయి. ” అసలు ఆ మాటలు అనాల్సిన అవసరం ఏమొచ్చింది. అంతమంది ముందు నాకు గాయం అయింది. సామర్థ్యంలేదని .. అందువల్లే సిరీస్ కు ఎంపిక చేయలేమని ఎందుకు చెప్పావు” అంటూ షమీ రోహిత్ తో వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం లేదని.. ఇదంతా ఒక సెక్షన్ మీడియా సృష్టిస్తున్న కల్పిత కథ అని సిరాజ్, రోహిత్ అభిమానులు అంటున్నారు. ఇలాంటి వాటిని నమ్మొద్దని సూచిస్తున్నారు.