Rohit Sharma : షామా మహమ్మద్ రోహిత్ శర్మ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో.. సోషల్ మీడియాలో ఆమెపై బీజేపీ నాయకులు ఏకంగా ఎదురుదాడికి దిగారు. ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్ కు ఒక్కరోజు ముందు ఇది చోటు చేసుకోవడంతో.. సోషల్ మీడియాలో “కాంగ్రెస్ కా బాప్ రోహిత్” అనే యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు. నిమిషాల వ్యవధిలోనే ఈ ట్రెండ్ ను అనుసరిస్తూ వేలాది ట్వీట్లు పడ్డాయి. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఇక రిపబ్లిక్ టీవీ అధినేత అర్ణబ్ గోస్వామి అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీమిండియా లెజెండరీ క్రికెటర్ మీద అలాంటి విమర్శలు చేయడం ఏంటని మండిపడ్డారు. అయితే ఇప్పుడు రోహిత్ శర్మ శరీర సామర్థ్యం పై విమర్శలు వస్తున్న నేపథ్యంలో టీమిండియా టి20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ స్పందించాడు.
Also Read : సెమీ ఫైనల్ లో ఆస్ట్రేలియాపై త్వరగానే అవుట్ అయినా.. రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. తొలి కెప్టెన్ గా ఘనత..
అవన్నీ గాలి కబుర్లు..
“రోహిత్ శర్మ సుదీర్ఘకాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. అతడు తన శరీర సామర్థ్యాన్ని ఎలా ఉంచుకోవాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీమిండియా కు అతని ఆధ్వర్యంలో ఎన్నో విజయాలు వచ్చాయి. గత నాలుగు సంవత్సరాల లో నాలుగు ఐసీసీ టోర్నీలలో భారత జట్టును అతడు ఫైనల్స్ కు చేర్చాడు. 15 -20 ఏళ్ల పాటు క్రికెట్ ఆడటమంటే అంత సులభమైన విషయం కాదు. రోహిత్ ను నేను దగ్గరుండి చూస్తున్నాను. చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం రోహిత్ శర్మ చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. అతడు ఆడే తీరు అద్భుతంగా ఉంటుంది. ప్రతిక్షణం కూడా అతడు జట్టు కోసం పరితపిస్తాడు. జట్టు కోసం మాత్రమే ఆడతాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే.. జట్టు విషయంలో రోహిత్ శర్మకు ఒక క్లారిటీ ఉంటుంది. ప్రతి ఆటగాడి నుంచి నూటికి నూరు శాతం రాబట్టాలని రోహిత్ భావిస్తుంటాడు. అందువల్లే అతడు నిత్యం ఆటగాళ్లతో సంప్రదింపులు జరుపుతూ ఉంటాడు. సంభాషణలు చేస్తూ ఉంటాడు. మైదానంలో ఆటగాడు ఎవరైనా తప్పు చేస్తే వెంటనే ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. కాకపోతే ఆ కోపాన్ని ఆ క్షణం వరకే ప్రదర్శిస్తాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత మళ్లీ యధావిధి గానే రోహిత్ ఉంటాడు. రోహిత్ శరీర సామర్థ్య విషయంలో వస్తున్న విమర్శలు మొత్తం గాలి కబుర్లే. ఎందుకంటే మైదానంలో ఉండి జట్టు కోసం ఆడే వారికి తెలుస్తుంది ఆ బాధ. బయట ఉండి ఎన్ని మాటలైనా చెప్పవచ్చు. అంతేతప్ప ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయకూడదు. అలాంటివారు మైదానంలో ఉన్న పరిస్థితులను ఒక్కసారి చూస్తే తెలుస్తుంది. ఏనుగు వెళ్తుంటే కుక్కలు చాలా మొరుగుతుంటాయి. అలాగని ఏనుగు స్థాయి తగ్గదు కదా.. రోహిత్ పై చేస్తున్న విమర్శలు కూడా అటువంటివే. రోహిత్ టీమ్ ఇండియాలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడు. నిర్లక్ష్యం అనే మాట ఆయనకు సరిపోదు. ఎలా ఆడతాడో నాకు తెలుసు. జట్టు కోసం ఎలా నిలబడతాడో కూడా తెలుసు. అటువంటి ఆటగాడి పై వస్తున్న విమర్శలు నిజంగా బాధాకరం. అటువంటివారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రోహిత్ ఆధ్వర్యంలో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్ వెళ్లిన నేపథ్యంలో వారికి నా హార్దిక శుభాకాంక్షలు” అని సూర్య కుమార్ యాదవ్ వ్యాఖ్యానించాడు.. ఒక ప్రైవేట్ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో సూర్య కుమార్ యాదవ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యల ద్వారా రోహిత్ శర్మ పై తనకున్న అభిమానాన్ని సూర్య చాటుకున్నాడు. అన్నట్టు ఐపీఎల్లో రోహిత్, సూర్య కుమార్ యాదవ్ ముంబై జట్టుకు ఆడుతున్నారు.
Also Read : రోహిత్‌శర్మపై నోరు జారిన కాంగ్రెస్ నాయకురాలు.. నెట్టింట ఆటాడుకుంటున్న ఫ్యాన్స్!