IND vs SA : టపటపా.. చూస్తుండగానే మూడు వికెట్లు.. ఇదేం ఆట రా అయ్యా?

IND vs SA ఎన్నో ఆశలు పెట్టుకుంటే రోహిత్ 9, రిషబ్ పంత్ 0, సూర్య కుమార్ యాదవ్ 3 పరుగులు చేయడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.

Written By: NARESH, Updated On : June 29, 2024 8:48 pm

IND vs SA

Follow us on

IND vs SA : 10 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. గ్రూప్ దశలో పాకిస్తాన్, సూపర్ -8 స్టేజిలో ఆస్ట్రేలియా, సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ జట్లను మట్టికరిపించింది. ఇదే సమయంలో ఆ జట్లతో ఎదురైన గత పరాభావాలకు ప్రతీకారం తీర్చుకుంది. దర్జాగా ఫైనల్ లోకి ఎంట్రీ ఇచ్చింది. మరోవైపు దక్షిణాఫ్రికా కూడా వరుస విజయాలతో తొలిసారి t20 వరల్డ్ కప్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఎలాగైనా తొలిసారి కప్ సాధించాలని పట్టుదలను ప్రదర్శించింది. దీంతో ఇరుజట్ల మధ్య శనివారం బార్బడోస్ వేదికగా ఫైనల్ మ్యాచ్ మొదలైంది. టాస్ గెలిచిన భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ మరో మాటకు తావు లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మైదానంపై టాస్ గెలిచి, ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న జట్లు ఎక్కువగా విజయం సాధించడంతో.. రోహిత్ ఆ నిర్ణయం తీసుకున్నాడు. అయితే అతడు నిర్ణయం తప్పని దక్షిణాఫ్రికా బౌలర్లు నిరూపించారు.

ఓపెనర్లుగా రోహిత్, విరాట్ మైదానంలోకి వచ్చారు. ఇటీవల వరుసగా విఫలమవుతున్న విరాట్.. ఈ మ్యాచ్లో స్వేచ్ఛగా ఆడటం మొదలుపెట్టాడు. వరుసగా బౌండరీలు కొట్టాడు. ఈ దశలో దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రం స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ను రంగంలోకి దింపాడు. అతడి బౌలింగ్లో రోహిత్ రెండు ఫోర్లు కొట్టాడు. ఈ దశలో కేశవ్ వేసిన ఓ అద్భుతమైన బంతిని ఆడబోయి మిడ్ ఆఫ్ లో ఉన్న ఫిల్టర్ కు చిక్కాడు. దీంతో స్టేడియంలో ఒక్కసారిగా గంభీరమైన వాతావరణం నెలకొంది. ఏం జరుగుతుందో తెలిసేలోపే రోహిత్ పెవిలియన్ చేరుకున్నాడు. ఐదు బంతులు ఎదుర్కొన్న రోహిత్ రెండు ఫోర్ల సహాయంతో 9 పరుగులు చేశాడు.

రోహిత్ ఔట్ అయిన తర్వాత మైదానంలోకి రిషబ్ పంతులు వచ్చాడు. సెమీ ఫైనల్ మ్యాచ్లో తీవ్రంగా నిరాశ పరిచిన పంత్.. ఈ మ్యాచ్లో ధాటిగా ఆడతాడని అభిమానులు ఆశించారు. కానీ వారందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేశవ్ మహారాజ్ బౌలింగ్ లో రిషబ్ పంత్ కీపర్ క్వింటన్ డికాక్ కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో ప్రేక్షకులు ఒకసారిగా షాక్ కు గురయ్యారు. 23 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి టీమ్ ఇండియా తీవ్ర కష్టాల్లో పడింది. ఈ దశలో సూర్య కుమార్ యాదవ్ క్రీజ్ లోకి వచ్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొని మూడు పరుగులు చేశాడు. రబాడా బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి.. బౌండరీ లైన్ వద్ద ఉన్న క్లాసెన్ కు చిక్కాడు. దీంతో 35 పరుగులకే టీమిండియా కీలకమైన మూడు వికెట్లు కోల్పోయింది. మైదానం స్పిన్నర్లకు అనుకూలిస్తున్న నేపథ్యంలో శివం దూబేకు బదులుగా కెప్టెన్ రోహిత్ శర్మ అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ కు పంపాడు.. కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అతడు ధాటిగా ఆడుతున్నాడు. ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కించుకున్న అక్షర్.. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్లో స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కడపటి వార్తలు అందే సమయానికి 17 బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్సర్ల సహాయంతో 25 పరుగులు చేశాడు.. మరో ఓపెనర్ విరాట్ కోహ్లీ 27 బంతుల్లో నాలుగు ఫోర్ల సహాయంతో 32 పరుగులు చేసి క్రీజ్ లో ఉన్నార్. ఎన్నో ఆశలు పెట్టుకుంటే రోహిత్ 9, రిషబ్ పంత్ 0, సూర్య కుమార్ యాదవ్ 3 పరుగులు చేయడం పట్ల అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు.