SBI Chairman : దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వరంగ వాణిజ్య బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తదుపరి చైర్మన్‌గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులుశెట్టి ఎంపికయ్యారు. ప్రస్తుతం బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్లలో ఈయన ఒకరు. శ్రీనివాసులుశెట్టి పేరును ఫైనాన్సియల్ సర్వీసెస్ ఇనిస్టిట్యూషన్స్ బ్యూరో(ఎఫ్ఎస్ఐబీ) కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ‘పనితీరు, అనుభవంతోపాటుఇతర పారామీటర్లను పరిగణనలోకి తీసుకుని ఎస్బీఐ చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులుశెట్టిని కేంద్రం ఎంపిక చేశామని ఎఫ్ఎస్ఐబీ తెలిపింది.
ముగ్గురికి ఇంటర్వ్యూ..
ఎస్‌బీఐ తదుపరి చైర్మన్ ఎంపిక కోసం ఎఫ్‌ఎస్‌బీఐ ప్రస్తుత డైర్టెర్లలో ముగ్గురికి ఇంటర్వూ్య చేసింది. శెట్టితోపాటు ఇంటర్వ్యూకు అశ్వినికుమార్‌తివారీ, వినయ్ ఎం.టోన్సే హాజరయ్యారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని చివరకు శ్రీనివాసులుశెట్టిని ఎంపిక చేసింది. ఈమేరకు కేంద్రానికి సిఫారసు చేస్తూ లేఖ రాసింది. శ్రీనివాసులుశెట్టి.. ప్రస్తుతం బ్యాంకు రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్ అధిపతిగా ఉన్నారు. ఎస్‌బీఐలో 30 ఏళ్లకుపైగా పనిచేశారు. 1988లో ప్రొబేషనరీ ఆఫీసర్‌గా ఎస్‌బీఐలో చేరారు.
ఆగస్టులో బాధ్యతల స్వీకరణ..
ప్రస్తుతం ఎస్బీఐ చైర్మన్‌గా దినేష్‌కుమార్ ఖరా ఉన్నారు. 2020 అక్టోబర్ 7 నుంచి ఆయనే చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. గతేడాది అక్టోబర్‌లో ఆయన పదవీకాలం ముగిసింది. అయితే కేంద్రం ఆయన పదవీ కాలాన్ని పొడిగించింది. ఆయన వయసు 63 ఏళ్లు వచ్చే వరకూ దినేష్ చైర్మన్‌గా కొనసాగుతారు. అంటే ఈ ఏడాది ఆగస్టు 28 వరకూ పదవిలో ఉంటారు. తర్వాత చల్లా శ్రీనివాసులు శెట్టి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరిస్తారు.
రాజేంద్రనగర్‌లో అగ్రికల్చర్ బీఎస్సీ..
శ్రీనివాసులుశెట్టి రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తిచేశారు. సర్టిఫైడ్ అసోసియేట్ ఆఫ్ ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకర్స్‌లో పట్టా పొందారు. కార్పొరేట్ క్రెడిట్, రిటైర్, డిజిటల్, ఇంటర్‌నేషనల్ బ్యాంకింగ్, అభివృద్ధి చెందిన మార్కెట్ల బ్యాంకింగ్ విభాగాల్లో అనుభవాన్ని గడించారు.
ఎస్‌బీఐలో కీలక బాధ్యతలు..
2020లో బ్యాంక్ బోర్డులో ఎండీగా చేరిన శ్రీనివాసులు శెట్టి ప్రస్తుతం బ్యాంక్‌లో ఇంటర్నేషనల్ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్ మరియు టెక్నాలజీ విభాగాల అధిపతిగా పనిచేస్తున్నారు. 30 ఏళ్లకుపైగా ఎస్‌బీఐలో పనిచేసిన ఆయన డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్, స్ట్రెస్‌డ్ అసెట్స్ రిజల్యూషన్ గ్రూప్, చీఫ్ జనరల్ మేనేజర్ మరియు కార్పొరేట్ అకౌంట్స్ గ్రూప్‌లో జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఎస్బీఐ న్యూయార్క్‌లో వీపీ అండ్ హెడ్ (సిండికేషన్స్) వంటి కీలక బాధ్యతలను నిర్వహించారు.
స్వగ్రామం చిత్తూరు జిల్లా..
చల్లా శ్రీనివాసులు శెట్టి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా. శ్రీనివాసులుకు వ్యవసాయమంటే ఎంతో ఇష్టం. దానికి తగ్గట్టే ఆయన హైదరాబాద్లోని ఆచార్య ఎన్జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో(ప్రస్తుతం ప్రొఫెసర్ జయశంకర్ వర్సిటీ) వ్యవసాయ విద్యను అభ్యసించారు. తర్వాత అనుకోకుండా బ్యాంకింగ్ రంగంలో అడుగు పెట్టి అక్కడే స్థిరపడ్డారు.