Rohit Sharma: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (team India captain Rohit Sharma) కొంతకాలంగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నాడు. సరిగా ఆడలేక అభిమానులను పూర్తిగా నిరాశ పరుస్తున్నాడు.. జట్టు విజయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాడు. ఇటీవల ఆస్ట్రేలియా సిరీస్ లో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. అందువల్లే అతడిని సిడ్నీ టెస్ట్ కి దూరంగా పెట్టారు. టీమిండియా వరుసగా ఆస్ట్రేలియా చేతిలో టెస్టులు ఓడిపోవడంతో రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాలనే డిమాండ్ కూడా వ్యక్తమవుతోంది.
ఫామ్ లో కెప్టెన్ లేకపోయినప్పుడు.. సహజంగా సోషల్ మీడియాలో రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ వ్యక్తమౌతుంది. ఇప్పుడు రోహిత్ శర్మ ఎదుర్కొంటున్న డిమాండ్ కూడా కొత్తది కాదు. అయితే అతడి ఫామ్ అంతకంతకు దిగజారిపోతున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు రిటైర్మెంట్ పై చర్చ జరుగుతూనే ఉంది. రోహిత్ శర్మ గత ఏడాది శ్రీలంక జట్టుతో జరిగిన మూడు వన్డేల సిరీస్ లో 157 పరుగులు చేశాడు. విరాట్ కోహ్లీ కంటే రోహిత్ చేసిన పరుగులే ఎక్కువైనప్పటికీ.. ఎప్పటికప్పుడు రోహిత్ రిటర్మెంట్ పై డిమాండ్లు వస్తుండడం విశేషం. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత రోహిత్ తన రిటైర్మెంట్ పై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
సమయం ఆసన్నమైందా?
రోహిత్ ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎందుకంటే కొంతకాలంగా టెస్టులలో రోహిత్ ఏమంత గొప్పగా ఆడిన దాఖలాలు లేవు. టి20 వరల్డ్ కప్ లో పర్వాలేదనే స్థాయిలో ఆడాడు. అయితే వన్డేలలో రోహిత్ శర్మకు వంక పెట్టడానికి లేకపోయినప్పటికీ.. ప్రస్తుతం రోహిత్ 38 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నాడు. ఈ క్రమంలో అతడు రిటైర్మెంట్ ప్రకటించడమే మంచిదని సీనియర్ క్రికెటర్లు చెబుతున్నారు.. అప్పుడే జట్టులోకి కొత్త రక్తం వస్తుందని వివరిస్తున్నారు. ” అతడు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి. ఇప్పటికే ఇదే విషయాన్ని బీసీసీఐ రోహిత్ శర్మను కోరింది. బంగ్లాదేశ్, శ్రీలంక, ఆస్ట్రేలియా దేశాలపై రోహిత్ విఫలమయ్యాడు.. అతడు విఫలం కావడం జట్టు విజయాలను కూడా తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో రోహిత్ ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రోహిత్ ఇలాగే పేలవమైన ఆట తీరు కొనసాగిస్తే జట్టుకు తీవ్రమైన నష్టం. ఇటీవల జరిగిన రంజీ మ్యాచ్లో జమ్మూ కాశ్మీర్ పై రోహిత్ శర్మ 3, 28 పరుగులు మాత్రమే చేశాడు..ఈ ఫామ్ తో అతడు ఎలా అడగలడు? పరుగులు ఎలా సాధించగలడు? సుదీర్ఘకాలం నుంచి రోహిత్ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. టీమ్ ఇండియాకు విజయవంతమైన కెప్టెన్ గా సేవలు అందించాడు. విజయవంతమైన కెప్టెన్ ముద్ర ఎలాగూ ఉంది కాబట్టి.. దాని మీదనే అతడు రిటైర్మెంట్ తీసుకుంటే మంచిదని” నెటిజన్లు సోషల్ మీడియాలో పేర్కొంటున్నారు.. అయితే ఇటీవల తన రిటైర్మెంట్ పై వ్యాఖ్యలు వచ్చినప్పుడు రోహిత్ శర్మ స్పందించాడు. తను ఇంకా క్రికెట్ ఆడతానని.. ఆడే సత్తా తనలో ఉందని.. ఇప్పట్లో రిటైర్మెంట్ ప్రకటించేది లేదని స్పష్టం చేశాడు. మళ్లీ ఇప్పుడేమో జాతీయ మీడియాలో రోహిత్ రిటైర్మెంట్ పై వార్తలు రావడం విశేషం. మరి దీనిపై రోహిత్ ఈసారి ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సి ఉంది.