Teenmar Mallanna: తీన్మార్ మల్లన్న.. ఓ జర్నలిస్ట్.. యూట్యూబ్ ఛానల్ పెట్టి ఫేమస్ అయ్యాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశాడు.. కొద్ది ఓట్ల తేడాతోనే భారత రాష్ట్ర సమితి అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత తన దూకుడును మరింత ముమ్మరం చేశాడు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా భారత రాష్ట్ర సమితి చేస్తున్న తప్పులను ఎండగట్టాడు.. అందులో విజయవంతం అయ్యాడు కూడా. అప్పట్లో భారతీయ జనతా పార్టీలో చేరినప్పటికీ కొంతకాలం మాత్రమే అందులో ఉన్నాడు.
ఎప్పుడైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందనే సంకేతాలు వినిపించాయో.. అప్పుడే తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పరోక్షంగా మాట్లాడాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత.. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై సీరియస్ గా ఫోకస్ పెట్టాడు. భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాకేష్ రెడ్డి మీద విజయం సాధించాడు. చివరికి తను ఎమ్మెల్సీ కావాలనుకునే కలను సాకారం చేసుకున్నాడు. అయితే ఎమ్మెల్సీ అయిన తర్వాత ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు గానీ.. తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను తప్పుపట్టాడు. అందులో బీసీల జనాభా తగ్గిందని.. బీసీల సర్వేను సమగ్రంగా చేయలేదని ఆరోపించాడు. ఓ సామాజిక వర్గం వారిని కావాలని టార్గెట్ చేసి తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. చివరికి ఆ సర్వేని తగలబెట్టాలని పిలుపునిచ్చాడు. ఇది సహజంగానే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారింది. గతంలో రెండు మూడు సందర్భాల్లో తీన్మార్ మల్లన్న ఇదే స్థాయిలో విమర్శలు చేసినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మందలించి ఊరుకుంది. కానీ ఇప్పుడు మాత్రం కఠిన చర్యలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
తీన్మార్ మల్లన్న చేసిన విమర్శలవల్ల కాంగ్రెస్ పార్టీకి డ్యామేజీ అవుతోంది. మల్లన్న చేసిన విమర్శలను కేటీఆర్ నిండు శాసనసభలో ప్రస్తావించడం విశేషం. దీనిని భారత రాష్ట్ర సమితి అనుకూల మీడియా ప్రధానంగా ఫోకస్ చేసింది. దీంతో ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. తీన్మార్ మల్లన్నను ఇలానే ఉపేక్షించుకుంటూ పోతే ఇబ్బంది ఎదురవుతుందని భావించిన కాంగ్రెస్ పార్టీ ఆయనపై వేటువేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న కు ముందుగా క్రమశిక్షణ ఉల్లంఘన నోటీసులు అందించి.. దానికి కల కారణాలను చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కోరే అవకాశం ఉంది. ఒకవేళ అతడు దానికి కూడా నిరాకరిస్తే పార్టీ నుంచి బయటికి పంపించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే దీనిపై దీపా మున్షి, కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. అదే విషయాన్ని పిసిసి అధ్యక్షుడి ద్వారా బయటికి చెప్పిస్తారని తెలుస్తోంది.. మొత్తానికి తీన్మార్ మల్లన్న పై వేటు పడటం ఖాయమని.. పార్టీ అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.