Rohit Sharma: సోషల్ మీడియాలోనూ రోహిత్ శర్మకు వ్యతిరేకంగా ప్రచారం జరుగుతోంది.. తన కెరియర్ లో ఎన్నడు కూడా ఈ స్థాయిలో వ్యతిరేక ప్రచారాన్ని రోహిత్ శర్మ ఎదుర్కొని ఉండడు. న్యూజిలాండ్ సిరీస్, అంతకుముందు బంగ్లాదేశ్ సిరీస్, ప్రస్తుతం ఆస్ట్రేలియా సిరీస్.. ఇలా మూడు సిరీస్లలో రోహిత్ దారుణమైన ఫామ్ ప్రదర్శిస్తున్నాడు. వాస్తవానికి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సైకిల్లో రోహిత్ గత సీజన్లో టీమ్ ఇండియాను ఫైనల్ దాకా తీసుకెళ్లాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ లోను మెరుగైన రికార్డు కలిగి ఉన్నాడు. కానీ ఈసారి మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోతున్నాడు. దీనికి కారణాలు ఏంటో తెలియదు గానీ.. రోహిత్ ఒకపట్లగా బ్యాటింగ్ చేయడం లేదనేది నిజం. అందువల్లే అతనిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యంగా మెల్ బోర్న్ టెస్టులో రోహిత్ విఫలమైన తీరు జట్టు మేనేజ్మెంట్ ను కలవరపాటుకు గురిచేసింది. అందువల్లే అతడిని సిడ్నీ టెస్ట్ కు దూరం పెట్టారని వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో రోహిత్ కూడా క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని కథనాలు కూడా ప్రసారమవుతున్నాయి. టెస్ట్ మాత్రమే కాదు, వన్డే జట్టుకు కూడా నాయకత్వ మార్పు ఉంటుందని.. హార్దిక్ పాండ్యాను కెప్టెన్ చేస్తారని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రోహిత్ శర్మ తొలిసారిగా తన రిటైర్మెంట్ పై నోరు విప్పాడు. సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఇప్పుడప్పుడే కాదు
రిటైర్మెంట్ పై తొలిసారిగా రోహిత్ నోరు విప్పాడు. ఆస్ట్రేలియా మీడియా ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించింది. కాస్త ఆలస్యంగానైనా మన దేశపు జాతీయ మీడియా కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతోంది. ” ఇప్పట్లో రిటైర్మెంట్ ఆలోచన లేదు. నా బ్యాట్ నుంచి పరుగులు రావడం లేదు కాబట్టే.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లడానికి ఈ మ్యాచ్ మాకు అత్యంత కీలకము. అందువల్ల నేనే స్వయంగా జట్టు నుంచి తప్పుకున్నాను. ఎవరో బయట కూర్చుని నా రిటైర్మెంట్ గురించి జడ్జిమెంట్ చేయలేరు. త్వరలోనే నేను ఫామ్ అందుకుంటాను. మెరుగ్గా బ్యాటింగ్ చేస్తాను. బలంగా పరుగులు రాబడతాను. ఇందులో ఏమాత్రం అనుమానం లేదు.. తిరిగి నా ఫామ్ అందుకుంటాను. ఒకప్పటి హిట్ మాన్ ను ప్రేక్షకులకు చూపిస్తానని” రోహిత్ వ్యాఖ్యానించినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇదే విషయాన్ని నేషనల్ మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తోంది. రోహిత్ త్వరలోనే ఫామ్ అందుకుంటాడని.. సూపర్ బ్యాటింగ్ చేస్తాడని.. మళ్లీ కెప్టెన్ అవుతాడని ఈ సందర్భంగా జాతీయ మీడియా వ్యాఖ్యానిస్తోంది.