AP Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనే జారీ చేయాలని నిర్ణయించింది. ఇంగ్లీష్ తో పాటు తెలుగు భాషలో సైతం తప్పనిసరిగా ఉత్తర్వు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మొదట ఇంగ్లీషులో ఉత్తర్వులు ఇచ్చి అప్లోడ్ చేయాలని.. ఆ తర్వాత రెండు రోజుల్లోగా తెలుగులోనూ అవే ఉత్తర్వులు గారికి చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలకు సూచించింది సాధారణ పరిపాలన శాఖ. ఉత్తరువుల ట్రాన్స్లేషన్ కు సంబంధించి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్లేషన్ సేవలను వినియోగించుకోవాలని సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఇకనుంచి పాలన వ్యవహారాలతో పాటు ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులోనే జారీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు రచయితలు కోరారు. ఇటీవల విజయవాడలో నిర్వహించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభ ఈ మేరకు తీర్మానించింది. ప్రభుత్వానికి విన్నవించింది. దీనిపై తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై తెలుగు కవులు, రచయితలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
* మహాసభలు ప్రారంభం
మరోవైపు హైదరాబాదులో ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వై వార్షిక మహాసభలు ప్రారంభమయ్యాయి. ఏపీ సీఎం చంద్రబాబు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. చంద్రబాబు కీలక ప్రసంగం చేశారు. తెలుగువారు మరింత ఉన్నత స్థితికి ఎదగాలని ఆకాంక్షించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభల ప్రారంభం నేపథ్యంలోనే.. ఏపీలో అన్ని రకాల ప్రత్యుత్తరాలు తెలుగులోనే సాగాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
* ఎన్టీఆర్ హయాంలో
వాస్తవానికి ఎన్టీఆర్ హయాంలోనే ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు ప్రారంభమయ్యాయి. ఎన్టీఆర్ తెలుగుకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చేవారు. తెలుగు భాష ఖ్యాతిని చాటి చెప్పాలని తెలుగు ప్రజలకు పిలుపునిచ్చేవారు. అదే విషయాన్ని గుర్తు చేశారు సీఎం చంద్రబాబు. అనంతపురం నుంచి అదిలాబాద్ వరకు.. శ్రీకాకుళం నుంచి పాలమూరు వరకు ఎక్కడ ఉన్న తెలుగు వారంతా ఒక్కటేనన్నారు. అదే తెలుగుజాతి గొప్పతనం అని వ్యాఖ్యానించారు. ప్రపంచ తెలుగు సమాఖ్య 1993లో ఏర్పాటు అయింది. తొలి మహాసభలు 1996లో హైదరాబాదులో జరిగాయి. నాడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఇప్పుడు మరోసారి సీఎం హోదాలో మహాసభలను ప్రారంభించారు చంద్రబాబు.