Duleep trophy 2024 : ఆ క్యాచ్ ఏంటి బ్రో.. ఒంట్లో ఎముకలు ఉన్నాయా? లేవా?

ఈ రెండు వికెట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పంత్ పట్టిన క్యాచ్ చూసి.. ఆ క్యాచ్ ఏంటి బ్రో.. ఒంట్లో ఎముకలు ఉన్నాయా? లేవా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Written By: NARESH, Updated On : September 6, 2024 9:46 pm

Rishabh Pant

Follow us on

Duleep trophy 2024 : క్రికెట్ లో బ్యాటర్లు, బౌలర్ల కంటే కీపర్లకు ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రతి బంతిని వారు కాచుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఏమాత్రం తేడా అయినా మ్యాచ్ స్వరూపం సమూలంగా మారుతుంది. అప్పుడు ఏం మాట్లాడుకున్నా.. ఏం చేసినా పెద్దగా ఉపయోగం ఉండదు. అయితే టీమిండియాలో తన కీపింగ్ తో సరికొత్త ముద్ర వేసిన ఘనత ధోనికి దక్కుతుంది. అయితే అతడు క్రికెట్ కు శాశ్వత విరామం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో అతడి స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు అనే ప్రశ్న తలెత్తిన ప్రతిసారీ సమాధానం అస్పష్టంగా లభించేది. కానీ ఇప్పుడు ఇతని రూపంలో పూర్తిస్థాయిలో సమాధానం లభించినట్టే.

టీమిండియాలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పినిక్స్ పక్షి లాగా అతడు పడి లేచాడు. చావు చివరి అంచుల దాకా వెళ్లి వచ్చాడు. మంచం పై రెండు నెలలు అలానే ఉన్నాడు. అయినప్పటికీ తనను తాను పునరావిష్కరించుకున్నాడు. ఆ తర్వాత క్రికెట్లో తన పునరాగమనాన్ని అద్భుతంగా చాటి చెప్పాడు. ఐపీఎల్ లో ఢిల్లీ జట్టును ముందుండి నడిపించాడు. టి20 వరల్డ్ కప్ లోనూ సత్తా చాటాడు. త్వరలో టీమిండియా ఆడే టెస్ట్ మ్యాచ్ లలో స్థానం సంపాదించుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఇందులో భాగంగా దులీప్ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఇండియా బీ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇండియా – ఏ జట్టుతో బెంగళూరులో జరుగుతున్న మ్యాచ్లో అద్భుతమైన విన్యాసాన్ని ప్రదర్శించాడు. తనకు మాత్రమే సాధ్యమైన వికెట్ కీపింగ్ తో అదరగొట్టాడు. వికెట్ల వెనకాల సూపర్ మాన్ తరహా డైవ్ చేసి.. అనితర సాధ్యమైన క్యాచ్ అందుకున్నాడు.

బిత్తర పోయిన మయాంక్ అగర్వాల్

రిషబ్ పంత్ అద్భుతమైన క్యాచ్ తో మయాంక్ అగర్వాల్ (36) బిత్తర పోయాడు. తీవ్రమైన నిరాశతో పెవిలియన్ చేరుకున్నాడు. నవదీప్ షైనీ వేసిన అద్భుతమైన బంతికి గిల్ కూడా ఆశ్చర్యపోయాడు. బంతిని అంచనా వేయలేకపోవడంతో.. అది వేగంగా అతడి వికెట్లను గిరాటేసింది. దీంతో అతడు మౌన ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయాడు. దెబ్బకు నోరెళ్ళ బెట్టి డ్రెస్సింగ్ రూమ్ వైపు కదిలాడు. నవదీప్ చేసిన 14 ఓవర్లో గిల్ అవుట్ అయ్యాడు. ఆ ఓవర్ చివరి బంతిని నవదీప్ అత్యంత తెలివి ఇన్ స్వింగర్ వేశాడు. ఆ బంతి అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ లో పడింది. అనూహ్యంగా స్వింగ్ అయింది. ఆఫ్ స్టంప్ ను పడగొట్టింది. గంటకు 140+ కిలోమీటర్ల వేగంతో ఆ బంతి దూసుకు రావడంతో గిల్ కనీసం బ్యాట్ కూడా అడ్డం పెట్టలేకపోయాడు. ఆఫ్ స్టంప్ దిశగా ఆ బంతి వెళ్తుందని భావించాడు. అయితే అతని అంచనాలు తలకిందులయ్యాయి. ఇక తర్వాత తన మరుసటి రెండో బంతికి మయాంక్ అగర్వాల్ ను బోల్తా కొట్టించాడు. అగర్వాల్ ఆడిన ఆ బంతిని రిషబ్ పంత్ అమాంతం గాల్లోకి ఎగురుతూ క్యాచ్ పట్టాడు.. లెగ్ స్టంప్ దిశగా షైనీ వేసిన బంతిని..ఆఫ్ స్టంపు లెగ్ సైడ్ దిశగా ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ ఆ బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకొని రిషబ్ పంత్ ఎడమవైపుకు దూరంగా వెళ్ళింది. దానిని పంత్ అద్భుతంగా అందుకున్నాడు. ఈ రెండు వికెట్లకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. పంత్ పట్టిన క్యాచ్ చూసి.. ఆ క్యాచ్ ఏంటి బ్రో.. ఒంట్లో ఎముకలు ఉన్నాయా? లేవా? అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.