Rishabh Pant : గత సీజన్లో లక్నో జట్టు చేతిలో హైదరాబాద్ ఓడిపోయిన తర్వాత .. లక్నో జట్టు మీద హైదరాబాద్ విపరీతమైన పరుగులు చేస్తున్న తర్వాత మైదానం లోనే ఉన్న లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయేంకా అప్పటి లక్నో జుట్టు కెప్టెన్ కే ఎల్ రాహుల్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగేనా ఆడేది అంటూ మండిపడ్డారు. దానికి కేఎల్ రాహుల్ నొచ్చుకున్నాడు. సున్నిత మనస్కుడైన అతడు బాధపడ్డాడు. ఆ తర్వాత అతని జట్టులో కొనసాగించేందుకు లక్నో యాజమాన్యం ఒప్పుకోలేదు. దీంతో అతడు మెగా వేలంలోకి వచ్చాడు. అతడిని ఢిల్లీ జట్టు యాజమాన్యం కొనుగోలు చేసింది. ఇక గత సీజన్లో ఢిల్లీ జట్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ ను అంటిపెట్టుకొని ఉండడానికి ఢిల్లీ యాజమాన్యం సుముఖత వ్యక్తం చేయలేదు. దీంతో అతడు కూడా మెగా వేలంలోకి వచ్చాడు. యాజమాన్యాలు పోటాపోటీగా ధర పెట్టడంతో రిషబ్ పంత్ వెల ఒకసారిగా రాకెట్ వేగంతో దూసుకుపోయింది. అది 27 కోట్ల వద్ద ఆగింది. 27 కోట్లకు లక్నో జట్టు యాజమాన్యం రిషబ్ పంత్ ను దక్కించుకుంది. అదే కాదు అతడే లక్నో జట్టు కెప్టెన్ అని సంకేతాలు ఇచ్చింది. మొత్తానికి అతడిని కెప్టెన్ ను చేసేసింది.
Also Read : SRH పై చెప్పినట్టే చేసిన రిషబ్ పంత్.. IPL లో ఇదో సంచలనం!
భారీ అంచనాలు ఉంటే..
రిషబ్ పంత్ ఆట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత చావు చివరి అంచుదాక వెళ్లిన అతడు.. సుదీర్ఘకాలం ఆసుపత్రిలో చికిత్స పొంది కోలు కొన్నాడు. ఆరోగ్యాన్ని పొంది గత ఐపీఎల్ లో ఢిల్లీ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ కెప్టెన్ గా తన మార్క్ చూపించాడు. మెరుగైన ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు. టి20 జాతీయ జట్టులో అవకాశం దక్కించుకొని.. టి20 వరల్డ్ కప్ సాధించిన జట్టులో కీలకపాత్ర పోషించాడు. అయితే ఇటీవల జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం రిషబ్ పంత్ కు అవకాశం లభించలేదు. అయితే దూకుడుగా ఆడే పంత్.. స్థిరమైన ఇన్నింగ్స్ ఆడక పోవడంతో జట్టు అతడిని పరిగణలోకి తీసుకోలేదు. అయితే ఐపీఎల్ లో సత్తా చాటి జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవాల్సిన అతడు నిర్లక్ష్యమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. అదృష్టం బాగుండి గురువారం లక్నో జట్టు హైదరాబాద్ మీద గెలిచింది..మార్ష్, పూరన్ అద్వితీయమైన భాగస్వామ్యం లక్నో జట్టు విజయానికి కారణమైంది. కానీ ఈ విజయంలో పంత్ పాత్ర నామ మాత్రం కావడం విశేషం. ఢిల్లీ జట్టుతో జరిగిన తొలి మ్యాచ్లో 0 పరుగులకే అవుట్ అయిన పంత్… హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 15 పరుగులు మాత్రమే చేశాడు. మైదానంలోకి దిగడమే ఆలస్యం దూకుడుగా ఆడే పంత్.. గత రెండు మ్యాచ్లలో తన శైలికి భిన్నంగా ఆడాడు. రిషబ్ పంత్ ఇలా అవుట్ అవుతున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో అతడిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలా ఆడితే లక్నో జట్టు విజేత ఎలా అవుతుందని నెటిజన్లు మండిపడుతున్నారు.
Also Read : పంత్ భయ్యా.. 27 కోట్లు పెట్టి కొంటే ఇలా ఆడావ్ ఏంటి?