Rishabh Pant: పంత్ ఈ సీజన్లో భారీ అంచనాల మధ్య లక్నో జట్టులోకి వచ్చాడు. గత సీజన్లో లక్నో జట్టుకు నాయకుడిగా కేఎల్ రాహుల్ ఉండేవాడు. హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో లక్నో జట్టు అత్యంత పేలవమైన ఆట తీరు ప్రదర్శించడంతో.. మైదానంలోనే లక్నో యజమాని సంజీవ్ గోయంక రాహుల్ తో గొడవ పెట్టుకున్నాడు. దాదాపు నిలదీసినంత పని చేశాడు. దీంతో ఈ సీజన్లో లక్నో జట్టు తరఫున ఆడేందుకు రాహుల్ ఆసక్తి చూపించలేదు. దీనికి తోడు లక్నో యాజమాన్యం కూడా ఆయనను నిలుపుకోవడానికి ప్రయత్నించలేదు. ఫలితంగా రాహుల్ బయటికి వచ్చేసాడు. ఢిల్లీ జట్టులో చేరిపోయాడు. మరోవైపు ఢిల్లీ జట్టుకు నాయకుడిగా ఉన్న రిషబ్ పంత్ వేలంలోకి వచ్చాడు. వేలంలో అతడిని అందరి అంచనాలను పటా పంచలు చేస్తే లక్నో యాజమాన్యం అంతకుమించి అనే రేంజ్ లో కొనుగోలు చేసింది. అంతేకాదు అతడికి సలార్ సినిమా మాదిరిగా ఎలివేషన్లు ఇచ్చింది. ఈసారి ఎలాగైనా కప్ గెలిచేది మేమే అంటూ సంకేతాలు ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే రిషబ్ పంత్ కూడా మైదానంలో కసరత్తు చేస్తూ కనిపించాడు. కానీ ఆరంభ శూరత్వం అన్నట్టుగా అతడు అంతగా ఆకట్టుకోలేకపోయాడు. ఆడ లేక పోయాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్లోనే 0పరుగులకు పంత్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ఒక్క మ్యాచ్ మినహా.. మిగతా అన్నిటిలోనూ విఫలమయ్యాడు.
Also Read: సన్‌రైజర్స్‌కు షాక్.. లక్నో మ్యాచ్‌కు స్టార్ ప్లేయర్ దూరం
మళ్లీ అదే తీరు
రిషబ్ పంత్ కీలకమైన మ్యాచులలో చేతులెత్తేయడంతో లక్నో జట్టు గ్రూప్ దశ నుంచే ఇంటికి వెళ్లిపోవడం ఖాయమైంది. రిషబ్ పంత్ కేవలం ఒకే ఒక్క మ్యాచ్లో 63 రన్స్ చేశాడు. అలా రావడం.. ఇలా వెళ్లిపోవడం పరిపాటిగా మార్చుకున్నాడు. చివరికి అనామక ఆటగాడిగా ముద్రపడ్డాడు..ఈ సీజన్లో 12 మ్యాచ్లు ఆడిన రిషబ్ పంత్ 135 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతడి హైయెస్ట్ స్కోర్ 63 పరుగులు. స్ట్రైక్ రేట్ 100.00, యావరేజ్ 12.27 అంటే అతని బ్యాటింగ్ ఇంత దరిద్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు రిషబ్ పంత్ నాయకుడిగా విఫలం కావడం.. ఆటగాడిగా కూడా విఫలం కావడంతో.. వచ్చే సీజన్లో అతడిని సారధిగా లక్నో జట్టుకు కొనసాగించే అవకాశం ఉండకపోవచ్చని స్పోర్ట్స్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.. మరోవైపు జట్టు ఓటమి తట్టుకోలేక ఇప్పటికే సంజీవ్ గోయంక కీలక నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. అంత బాగా ఆడే కేఎల్ రాహుల్ ను పక్కన పెట్టిన సంజీవ్ గోయంక.. రిషబ్ పంత్ ను మాత్రం ఎందుకు ఉపేక్షిస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా చూస్తే కేఎల్ రాహుల్ మాదిరిగానే రిషబ్ పంత్ కూడా లక్నో జట్టును వీడి పోవాల్సి ఉంటుందని.. కొత్త జట్టును వెతుక్కోవాల్సి ఉంటుందని ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై అధికారికంగా సమాచారం వస్తే మరింత క్లారిటీ వస్తుందని క్రికెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్ లోనూ పంత్ విఫలమయ్యాడు. కేవలం 7 రన్స్ మాత్రమే చేసి ఇషాన్ మాలింగా బౌలింగ్లో కాట్ అండ్ బౌల్డ్ గా వెనుతిరిగాడు.