https://oktelugu.com/

IND VS BAN Test : బంగ్లా టెస్టులో రిషబ్ పంత్ సెంచరీ.. ధోనిని అధిగమించి సరికొత్త రికార్డు

రోడ్డు ప్రమాదానికి గురై.. దాదాపు రెండు సంవత్సరాల పాటు ఆటకు దూరమైన టీమిండియా స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బంగ్లా టెస్ట్ సిరీస్ లో సత్తా చాటుతున్నాడు.. అద్భుతమైన సెంచరీ తో ఆకట్టుకున్నాడు.

Written By:
  • Anabothula Bhaskar
  • , Updated On : September 21, 2024 / 02:10 PM IST

    Rishabh Pant Century

    Follow us on

    IND VS BAN Test :  చెన్నై వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టు బిగిస్తోంది. రెండవ ఇన్నింగ్స్ లో ధాటిగా బ్యాటింగ్ చేస్తోంది. స్టార్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, యశస్వి జైస్వాల్ త్వరగానే అవుట్ అయినప్పటికీ.. రిషబ్ పంత్ (109), మరో ఆటగాడు గిల్(119*) తో కలిసి 167 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్టార్ ఆటగాళ్లు విఫలమైన చోట పంత్, గిల్ సత్తా చాటారు. బంగ్లా బౌలర్లను ధైర్యంగా ఎదుర్కొన్నారు. గిల్ కంటే ముందు పంత్ సెంచరీ చేశాడు. అతడి ఇన్నింగ్స్ లో 13 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన పంత్.. చివరి వరకు అదే జోరుకొనసాగించాడు. ముఖ్యంగా శుక్రవారం అతడు బంగ్లా బౌలర్ తల మీద నుంచి కొట్టిన సిక్సర్ మ్యాచ్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. సెంచరీ చేసిన రిషబ్ పంత్.. టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని రికార్డును బద్దలు కొట్టాడు.

    రోడ్డు ప్రమాదం నుంచి కోలుకుని..

    రిషబ్ పంత్ దాదాపు రెండు సంవత్సరాల క్రితం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.. కొన్ని నెలల వరకు మంచానికే పరిమితమయ్యాడు. ఇటీవలి ఐపిఎల్ లో క్రికెట్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఢిల్లీ జట్టుకు నాయకత్వం వహించాడు. టి20 వరల్డ్ కప్ లో సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం బంగ్లాదేశ్ టోర్నీలో తొలి ఇన్నింగ్స్ లో 39 పరుగులు చేశాడు. రెండవ ఇన్నింగ్స్ లో సెంచరీ చేశాడు. 124 బంతులు ఎదుర్కొన్న అతడు 109 పరుగులు చేశాడు. టెస్ట్ కెరియర్ పరంగా అతనికి ఇది ఆరవ సెంచరీ.

    ప్రాణాలు పోగొట్టుకునే స్థితి నుంచి..

    వాస్తవానికి రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు అతడు ప్రాణాలు పోగొట్టుకునే దుస్థితి నుంచి.. కోలుకున్నాడు. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకుంటున్నాడు. దాదాపు రెండు సంవత్సరాలపాటు అతడు టెస్ట్ క్రికెట్ కు దూరమయ్యాడు. అయినప్పటికీ సత్తా చాటుతున్నాడు.. వేగంగా ఆడే అలవాటు ఉన్న రిషబ్ పంత్ సెంచరీ చేసి టీమిండియా దిగ్గజ క్రికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోని రికార్డును బ్రేక్ చేశాడు. భారత జట్టు వికెట్ కీపర్ లలో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డు ఇప్పటివరకు ధోని పేరు మీద ఉండేది. ఆ రికార్డును పంత్ ఈక్వల్ చేశాడు. 58 ఇన్నింగ్స్ లు ఆడిన రిషబ్ పంత్.. ఆరో సెంచరీ చేశాడు. ధోని మాత్రం 144 ఇన్నింగ్స్ లు ఆడి.. ఆరు సెంచరీలు పూర్తి చేశాడు. వృద్ధిమాన్ సాహా 54 ఇన్నింగ్స్ లలో మూడు సెంచరీలు చేశాడు. కాగా, భారత జట్టు రెండవ ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసింది.. గిల్(119*), రాహుల్ (22*) పరుగులు చేశారు. దీంతో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. ప్రస్తుతం బంగ్లా ఎదుట భారత్ 515 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా జట్టు వికెట్లేమీ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. జాకిర్ హసన్ (8), షాద్మాన్ ఇస్లాం(0) క్రీజ్ లో ఉన్నారు.