Rinku Singh: గురువారం ఐపీఎల్ 2025 సీజన్ కు సంబంధించి ఫ్రాంచైజీ లు రిటైన్ జాబితా ప్రకటించాయి. అయితే ఇందులో కోల్ కతా ఆటగాడికి మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఏకంగా 13 కోట్ల భారీ ధర చెల్లించింది. ఆ ఆటగాడే రింకూ సింగ్. కోల్ కతా నైట్ రైడర్స్ రింకూ సింగ్ కు 13 కోట్లు ఇచ్చింది. కోల్ కతా నైట్ రైడర్స్ తనను రిటైన్ చేసుకోవడం అతడిని భావోద్వేగానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో తన ఆనందాన్ని అతడు సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ” మా ఇద్దరి మధ్య గాఢత ప్రారంభమైంది. అసలు దృశ్యం ఇంకా ఉందని” ఆ వీడియోకు రింకూ క్యాప్షన్ జత చేశాడు. “కోల్ కతా కుటుంబానికి శుభాకాంక్షలు. సరిగ్గా ఏడు సంవత్సరాల క్రితం నేను కేకేఆర్ జెర్సీ ధరించాను. ఇది నా ఒక్కడి గెలుపు చరిత్ర కాదు. నా గెలుపులో, పరాజయం లో నాకు అండగా నిలిచారు. ఇంతటి సుదీర్ఘ ప్రయాణంలో నేను చాలా నేర్చుకున్నాను. కోల్ కతా నాపై అచంచలమైన నమ్మకాన్ని ఉంచింది.. దీనిని కచ్చితంగా నేను నిలుపుకుంటాను. ఇది కొత్త చాప్టర్” అని రింకూ సింగ్ ఒక వీడియోను షేర్ చేశాడు. ఇది ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో సందడిగా మారింది.
అప్పుడు 55 లక్షలు
2024 ఐపీఎల్ సీజన్ కు గానూ రింకూ సింగ్ ను కోల్ కతా 55 లక్షలు చెల్లించింది. అయితే అప్పట్లో ఈ వ్యవహారంపై కోల్ కతా యాజమాన్యంపై విమర్శలు వ్యక్తం అయ్యాయి. “స్థిరంగా ఆడుతున్న వ్యక్తికి.. అది కూడా భారతీయ ఆటగాడికి అత్యంత తక్కువ ఫీజు ఇస్తున్నారని” సోషల్ మీడియా వేదికగా నెటిజెన్లు మండిపడ్డారు. అయితే ఈసారి అతని వేతనాన్ని కోల్ కతా భారీగా పెంచింది. దాదాపు 2000% అతడి జీతాన్ని హైక్ చేసింది. 2018 నుంచి రింకూ సింగ్ కోల్ కతా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. చాలాకాలం పాటు అతడికి మైదానంలో దిగే అవకాశం లభించలేదు. 2023 లో మాత్రం అతడు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. ఆ ఏడాది గుజరాత్ జట్టు జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్ లో అతడు ఏకంగా ఐదు సిక్స్ లు కొట్టి సంచలనం సృష్టించాడు. దీంతో అతడు ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. ఆ సీజన్లో అతడు 149.52 స్ట్రైక్ రేట్ కొనసాగించాడు . 474 రన్స్ చేశాడు. దీంతో అతనికి జాతీయ జట్టులోకి పిలుపు లభించింది. ఇక ఆ ఏడాది జరిగిన ఐర్లాండ్ టూర్ లో అతడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎంట్రీ ఇచ్చాడు.