Jagan: వైసీపీ అధినేత జగన్ కు కడప జిల్లా తలనొప్పిగా మారుతోంది. ఇప్పటివరకు తన కనుసైగతో జిల్లాను శాసించారు. నేతలు సైతం అధినేత ఆదేశాలను పాటించేవారు. కానీ ఎన్నికల్లో ఓటమితో పరిస్థితి మారింది. అధినేత జగన్ అంటేభయం తగ్గింది. మరోవైపు పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న వారు గుడ్ బై చెబుతున్నారు. దీంతో సహజంగానే ఆ ప్రభావం పార్టీపై పడుతోంది. అయితే ఇది సహజమేనని హై కమాండ్ భావిస్తోంది. నియోజకవర్గాలకు బలమైన నేతలను ఇన్చార్జిలుగా నియమిస్తోంది. ఈ క్రమంలో చాలా నియోజకవర్గాల్లో విభేదాలు బయటపడుతున్నాయి. అయితే దానిని సెట్ చేసే పనిలో ఉన్నారు అధినేత జగన్. కడప జిల్లాకు సంబంధించి జమ్మలమడుగులో పార్టీలో విభేదాలు కొనసాగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రెండు వర్గాలుగా విడిపోయి గత కొద్దిరోజులుగా బలప్రదర్శనకు దిగుతున్నారు. ఈ క్రమంలో జగన్ రాజీ చేసే ప్రయత్నం చేశారు. నియోజకవర్గ బాధ్యతల విషయంలో ఒక ఫార్ములాను రూపొందించారు. నియోజకవర్గంలో చెరి మూడు మండలాలకు ఒకరికి అప్పచెప్పారు. అయితే ఇందుకుమాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డి అంగీకరించడం లేదు. పార్టీలో ఎమ్మెల్యేగా కొనసాగాను కనుక తనకే ఇంచార్జ్ పోస్ట్ కొనసాగించాలని కోరుతున్నారు. అయితే జగన్ మనసులో వేరే ఆలోచన ఉన్నట్లు సమాచారం.
* ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి
జమ్మలమడుగు నుంచి ఈసారి బిజెపి తరఫున పోటీ చేసిన ఆదినారాయణ రెడ్డి గెలిచారు. సహజంగానే దూకుడు కలిగిన నేత. ఆయనను తట్టుకొని నిలబడడం అంత చిన్న విషయం కాదు. ఆయనను తట్టుకునే శక్తి రామసుబ్బారెడ్డి కి మాత్రమే ఉందని జగన్ నమ్మకం. అందుకే రామసుబ్బారెడ్డి కి బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. డాక్టర్ సుధీర్ రెడ్డి వినకుంటే లైట్ తీసుకోవడానికి కూడా సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే అక్కడ రామసుబ్బారెడ్డి కి లైన్ క్లియర్ చేయడానికి జగన్ ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే డాక్టర్ సుధీర్ రెడ్డి సైతం తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు టాక్ నడుస్తోంది. రామసుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టిడిపిలోకి రావడం ఖాయం.
* వస్తే టిడిపి ఇన్చార్జ్ పదవి
ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఇక్కడ టిడిపికి నాయకత్వం కొరత ఉంది. డాక్టర్ సుధీర్ రెడ్డి తెలుగుదేశంలోకి వస్తే ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. బిజెపితోటిడిపికి స్నేహం కొనసాగుతోంది. మరోవైపు ఆదినారాయణ రెడ్డికి రామసుబ్బారెడ్డి ప్రత్యర్థి. డాక్టర్ సుధీర్ రెడ్డి ని కలుపు కెల్లడం ద్వారా ఆదినారాయణ రెడ్డి నాయకత్వం బలపడుతుంది. అయితే డాక్టర్ సుధీర్ రెడ్డిని వదులుకునేందుకు జగన్ సైతం ఇష్టపడడం లేదు. అలాగని జగన్ మూడు మండలాల ఫార్ములా సుధీర్ రెడ్డికి నచ్చడం లేదు.దీంతో జమ్మలమడుగు రాజకీయ సమీకరణలు ఎలా మారుతాయో తెలియడం లేదు.