RCB Vs KKR
RCB Vs KKR: ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై జట్టు తర్వాత ఎక్కువ విమర్శలు ఎదుర్కొంటున్నది బెంగళూరు జట్టు. సొంత గడ్డపై కోల్ కతా జట్టుతో జరిగిన మ్యాచ్ లో బెంగళూరు మరో పరాజయాన్ని చవిచూసింది. పోరాటం కూడా చేయకుండా ఏకపక్షంగా జరిగిన మ్యాచ్లో బెంగళూరు 7 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. జిడ్డు బ్యాటింగ్, పసలేని బౌలింగ్ తో దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది. ఐపీఎల్ 17వ సీజన్లో సొంత గడ్డపై ఓడిన తొలి జట్టుగా అపఖ్యాతి పాలయింది. బెంగళూరు ఓటమిని ఆ జట్టు అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా బెంగళూరు ఆటగాళ్లపై దుమ్మెత్తి పోస్తున్నారు. కోల్ కతా తో శుక్రవారం జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ (83) మాత్రమే దీటుగా బ్యాటింగ్ చేశాడు. గ్రీన్(33), దినేష్ కార్తీక్ (20) మాత్రమే మెరుగ్గా బ్యాటింగ్ చేశారు. మిగతా వారంతా ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.. కోహ్లీ నిలబడ్డాడు కాబట్టి బెంగళూరు 182 పరుగులు చేసింది. లేకుంటే ఆ జట్టు కథ 140 లోనే ముగిసేది.
మైదానం బ్యాటింగ్ కు సహకరిస్తున్నప్పటికీ బెంగళూరు ఆటగాళ్లు కోల్ కతా బౌలర్లను ప్రతిఘటించలేకపోయారు. స్లో క్రికెట్ అయినప్పటికీ భారీ షాట్లు కొట్టలేకపోయారు. మైదానంలో ఓ ఎండ్ స్లో గా ఉంటే.. మరో ఎండ్ బ్యాటింగ్ కు సహకరిస్తోంది. అయినప్పటికీ బెంగళూరు ఆటగాళ్లు పెద్దగా సత్తా చాటలేకపోయారు. వాస్తవానికి మైదానం పరిస్థితులను అంచనా వేయడంలో బెంగళూరు ఆటగాళ్లు విఫలమయ్యారు. ఇక బౌలర్లు అయితే మైదానానికి తగ్గట్టుగా బంతులు విసర లేకపోయారు. పవర్ ప్లే లో ఏకంగా 85 పరుగులు ఇచ్చుకున్నారు అంటే వారి బౌలింగ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. విజయ్ కుమార్ వైశాఖ్ మాత్రమే సత్తా చాటాడు.. స్లో కట్టర్స్ ద్వారా కోల్ కతా బౌలర్లు బెంగళూరు బ్యాటర్లను నిలువరిస్తే.. బెంగళూరు బౌలర్లు మాత్రం బౌన్సర్లు, ఫాస్ట్ బాల్స్ వేసి తమ అజ్ఞానాన్ని నిరూపించుకున్నారు..
బెంగళూరు బౌలర్లు దారుణంగా బంతులు సంధించడంతో.. నెట్టింట వారిపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.”కనీసం పోటీ కూడా ఇవ్వలేకపోయారు. ఇలా అయితే ఎలా కప్ సాధిస్తారు” అంటూ బెంగళూరు జట్టుపై అభిమానులు విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇక సింగర్ క్రికెటర్ సునీల్ గవాస్కర్ మ్యాచ్ అనంతరం స్పందించాడు.. బెంగళూరు బౌలర్లు సరిగ్గా బౌలింగ్ చేయలేదని విమర్శలు గుప్పించాడు. దర్శన్ పాఠక్ అనే ఓ నెటిజన్ బెంగళూరు బౌలింగ్ ను ఏకీపారేశాడు. “జట్టులో ఉన్న బౌలర్లకు బౌలింగ్ వేయడం రాదు. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బెంగళూరు జట్టును గెలిపించిన ఎల్లిస్ ఫెర్రీ, శ్రేయాంక పాటిల్ ను జట్టులోకి తీసుకోండి” అంటూ ఎగతాళి చేశాడు..” ఎల్లిస్ ఫెర్రీ, శ్రేయాంక పాటిల్ ఆల్ రౌండర్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తుందని” సలహా ఇచ్చాడు. ప్రస్తుతం అతడు చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Ellyse Perry and Shreyanka Patil replacing Alzarri Joseph and Yash Dayal.
— Darshan Pathak (@darshanpathak) March 29, 2024