RCB Vs CSK: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో మరో హై వోల్టేజ్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో శనివారం కీలక మ్యాచ్ జరగనుంది. ప్లే ఆఫ్ లో నాలుగో స్థానం కోసం చెన్నై, బెంగళూరు జట్లు పోటీ పడనున్నాయి. సాయంత్రం ఏడు గంటల 30 నిమిషాలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సీజన్లో ఫస్ట్ ఆఫ్ లో వరుస వైఫల్యాలు ఎదుర్కొన్న బెంగళూరు జట్టు.. సెకండ్ హాఫ్ లో తిరుగులేని విజయాలను నమోదుచేసింది. ఏకంగా ఐదు మ్యాచ్లలో గెలిచి ప్లే ఆఫ్ రేసులో నిలబడింది. ఇక చెన్నై జట్టు ప్రారంభంలో దాటిగా ఆడినప్పటికీ.. ఆ తర్వాత తడబడుతూ ప్రయాణం సాగిస్తోంది. చివరి ఐదు మ్యాచ్లలో మూడు విజయాలు, రెండు ఓటములతో నిలిచింది. కీలకమైన ప్లే ఆఫ్ కోసం బెంగళూరు జట్టుతో అమీ తుమీ తేల్చుకోనుంది. ఈ సీజన్లో ప్రారంభ మ్యాచ్ బెంగళూరు, చెన్నై జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్లో చెన్నై విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో చెన్నై జట్టును ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని బెంగళూరు భావిస్తోంది. ఐపీఎల్ చరిత్రను పరిశీలిస్తే ఇప్పటివరకు బెంగళూరు పై చెన్నై జట్టు దే పై చేయిగా ఉంది. ఈ రెండు జట్లు గత ఐదుసార్లు పరస్పరం తలపడగా.. బెంగళూరు ఒకసారి మాత్రమే విజయాన్ని అందుకుంది. అనధికార నాకౌట్ గా పరిగణిస్తున్న ఈ మ్యాచ్లో బెంగళూరు గెలిచి ప్లే ఆఫ్ వెళ్లాలంటే.. ఒక నిర్దిష్ట తేడాతో విజయాన్ని దక్కించుకోవాలి. బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేస్తే 200 పరుగులు చేయాలి. ఆ తర్వాత చెన్నై జట్టును 18 పరుగుల తేడాతో ఓడించాలి. ఒకవేళ చేజింగ్ కు దిగితే, చెన్నై జట్టు 201 పరుగుల విజయ లక్ష్యాన్ని విధిస్తే, దానిని మరో పదకొండు బంతులు మిగిలి ఉండగానే ఛేదించాలి. అప్పుడే బెంగళూరు ప్లే ఆఫ్ వెళ్లేందుకు అవకాశం ఉంటుంది.
కీలకమైన సమరంగా భావిస్తున్న ఈ మ్యాచ్ ఆసక్తికరంగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది ధోని, విరాట్ కోహ్లీ చుట్టూ జరుగుతున్న చర్చ. ఎందుకంటే ఈ టోర్నీతో ఐపీఎల్ కు ధోని గుడ్ బై చెబుతాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కనుక నిజమైతే విరాట్ కోహ్లీ, ధోని పరస్పరం తలపడే మ్యాచ్ ఇదే చివరిదవుతుంది. అయితే ధోని రిటర్మెంట్ గురించి తనకు తెలియదని చెన్నై జట్టు బ్యాటింగ్ కోచ్ మైక్ హస్సీ చెబుతున్నాడు.
ఇక ధోని, కోహ్లీ తర్వాత.. శివం దుబే, రజత్ పాటిదార్ మధ్య ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఎందుకంటే శివం దుబే ఫస్ట్ హాఫ్ లో చెన్నై జట్టు తరఫున వీరోచిత ఇన్నింగ్స్ ఆడాడు.. ఆ జట్టు సాధించిన విజయాలలో కీలకపాత్ర పోషించాడు. ఇక రజత్ సెకండ్ హాఫ్ లో విజృంభించి ఆడుతున్నాడు. బెంగళూరు సాధించిన వరుస ఐదు విజయాలలో తన వంతు పాత్ర పోషించాడు. శనివారం జరిగే మ్యాచ్లో అటు శివం, ఇటు రజత్ పోటాపోటీగా ఆడటం ఖాయమని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు.
ఇక బెంగళూరు చిన్నస్వామి స్టేడియం పై ఇటీవల రెండు మ్యాచ్లు అడగా.. రెండింటినీ గెలుచుకుంది. చెన్నై జట్టు ఇటీవల ఇతర జట్ల మైదానాలపై ఆరు మ్యాచులు ఆడగా.. రెండు మ్యాచ్లలో మాత్రమే విజయం దక్కించుకుంది. చిన్న స్వామి స్టేడియం పై చెన్నై జట్టు రాణించాలంటే.. ఆ జట్టు బ్యాటర్లు దూకుడుగా ఆడాల్సి ఉంది. కీలకమైన మ్యాచ్ నేపథ్యంలో విల్ జాక్స్ స్థానంలో బెంగళూరు మాక్స్ వెల్ ను తీసుకునే అవకాశం ఉంది. యష్ దయాల్ లేదా స్వప్నిల్ సింగ్ జట్టులోకి వస్తే.. రజత్ పాటిదర్ ఇంపాక్ట్ ఆటగాడిగా రంగంలోకి దిగే అవకాశం ఉంది.. ఇక చెన్నై జట్టు మంచి మోయిన్ అలీ వెళ్లిపోవడంతో మిచెల్ సాంట్నర్ కు తుది జట్టులోకి అవకాశం లభించింది.
బెంగళూరులో గత కొద్దిరోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో.. శనివారం మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే అనుమానాలున్నాయి. ఆ ప్రాంతంలో శనివారం ఆకాశం మేఘావృతమైంది. ఒకవేళ వర్షం కురిసి మ్యాచ్ రద్దయితే.. బెంగళూరు ప్లే ఆఫ్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది.
తుది జట్ల అంచనా ఇలా..
బెంగళూరు
విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూ ప్లెసిస్, గ్లెన్ మాక్స్ వెల్, రజత్ పాటిదార్, మహిపాల్ లోమ్రోర్, గ్రీన్, దినేష్ కార్తీక్, యష్ దయాల్, కర్ణ్ శర్మ, మహమ్మద్ సిరాజ్, లాకీ పెర్గూ సన్/ స్వప్నిల్ సింగ్.
చెన్నై
రుతు రాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివం దుబే, రవీంద్ర జడేజా, సమీర్ రిజ్వి, శాంట్నర్, శార్దూల్ ఠాకూర్, మహిష పతిరణ, తుషార్ దేశ్ పాండే/ సమర్ జీత్ సింగ్.