Ravi Shastri: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. టీమిండియా కు మూల స్తంభాలాంటి ఆటగాళ్లు. వీరిద్దరూ భారత జట్టుకు ఎన్నో అద్భుతమైన విజయాలు అందించారు. చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడి ఆకట్టుకున్నారు. అయితే అలాంటి ఈ ఆటగాళ్లు ఇప్పుడు ఫామ్ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో విరాట్ కోహ్లీ కానీ చెప్పుకోవడానికి ఒక్క సెంచరీ అయినా చేశాడు.. కానీ రోహిత్ పట్టుమని 10 పరుగులు దాటి వెళ్ళలేకపోతున్నాడు.
మెల్ బోర్న్ లో జరుగుతున్న ప్రస్తుత టెస్టులో గెలవాల్సిన తరుణంలో.. ఆస్ట్రేలియా విధించిన 340 పరుగుల లక్ష్యాన్ని సాధించాల్సిన సమయంలో.. నిలబడి.. జట్టును గెలిపించాల్సింది పోయి.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాట్ ఎత్తేశాడు. 9 పరుగులకే అవుట్ అయి పరువు పోగొట్టుకున్నాడు. విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్ రోహిత్ శర్మ దారిని అనుసరించాడు. విరాట్ కోహ్లీ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రోహిత్, విరాట్ ఆట తీరుపట్ల అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఇదే సందర్భంలో విరాట్, రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు..
రవి శాస్త్రి ఏమన్నాడంటే
విరాట్, రోహిత్ శర్మ ఫామ్ లేమి పై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడాడు. ” నిజమే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. విరాట్ కోహ్లీ ఇంకా 3 నుంచి 4 సంవత్సరాల పాటు టెస్ట్ క్రికెట్ ఆడతాడు. అతడికి ఆ సత్తా ఉంది. రోహిత్ శర్మ ను గమనించారా.. అతడు ఆలస్యంగా ఫుట్ వర్క్ ను చేపడుతున్నాడు. దీనివల్ల బంతిని ఆడేందుకు సమయం ఎక్కువ తీసుకుంటున్నాడు. అందువల్లే త్వరగా అవుట్ అవుతున్నాడు. ప్రస్తుత పరిస్థితిని గమనిస్తే అతడు రిటైర్మెంట్ కు దగ్గర్లో ఉన్నాడనిపిస్తోంది. ఈ సిరీస్ మాత్రమే కాదు.. గత న్యూజిలాండ్ సిరీస్ లోనూ రోహిత్ ఇలానే ఆడాడు. స్వదేశంలోనూ మెరుపులు మెరిపించలేకపోయాడు. ఇలా అయితే అతడు రిటైర్మెంట్ తీసుకోక తప్పదు. జట్టు మేనేజ్మెంట్ కూడా కొన్ని అవకాశాలు ఇస్తుంది. అన్ని అవకాశాలను ఇచ్చిన తర్వాత కూడా నిరూపించుకో లేకపోతే చేయాల్సింది చేస్తుందని” రవి శాస్త్రి వ్యాఖ్యానించాడు..మెల్ బోర్న్ మైదానంలో ఆస్ట్రేలియాతో సాగుతున్న నాలుగో టెస్ట్ రెండవ ఇన్నింగ్స్ లో రోహిత్ కేవలం 9 పరుగులకే అవుట్ కావడంతో.. రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడుతోంది. నెటిజన్లు రోహిత్ శర్మను ఉద్దేశించి రవి శాస్త్రి చేసిన వ్యాఖ్యలను ఉదహరిస్తున్నారు..”ఆడిన ఆట సరిపోయింది. చేసిన పరుగులు కూడా ఎక్కువయ్యాయి. ఇకపై బ్యాగ్ సర్దుకోవడం మంచిది. మీరు తప్పుకుంటే ఇతర ఆటగాళ్లకు అవకాశాలు లభిస్తాయని” నెటిజన్లు పేర్కొంటున్నారు. “యువ ఆటగాళ్లు ఎదురుచూస్తున్నారని.. వాళ్లకు అవకాశాలు లభిస్తే జట్టుకు విజయాలు దక్కుతాయని” వారు వివరిస్తున్నారు.