IPL 2024 Playoffs: లక్నో, ఢిల్లీ ఔట్…ప్లే ఆఫ్ లోకి రాజస్థాన్.. రేసులో ఎవరెవరంటే?

లక్నో జట్టుపై ఢిల్లీ విజయాన్ని అందుకోడంతో రాజస్థాన్ అధికారికంగా ప్లే ఆఫ్ కు వెళ్లిపోయింది. రాజస్థాన్ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. హైదరాబాద్ మినహా మిగతా జట్లేవీ ఆ పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ వెళ్లేందుకు మార్గం సుగమం అయింది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 15, 2024 8:19 am

IPL 2024 Playoffs

Follow us on

IPL 2024 Playoffs: ఈ సీజన్లో పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగింది రాజస్థాన్ జట్టు. క్రికెట్ పండితుల అంచనాలను తలకిందులు చేస్తూ దర్జాగా ప్లే ఆఫ్ కు వెళ్లిపోయింది. 16 పాయింట్లతో కోల్ కతా తర్వాత ప్లే ఆఫ్ వెళ్లిన రెండవ జట్టుగా రాజస్థాన్ నిలిచింది..

ఈ సీజన్లో రాజస్థాన్ జట్టు ప్రారంభంలో పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత కొన్ని మ్యాచ్లు ఓడిపోవడంతో రెండవ స్థానానికి పరిమితమైంది.. ఇటీవల చెన్నై, హైదరాబాద్ జట్ల చేతిలో ఓడిపోవడంతో రాజస్థాన్ జట్టు మొదటి స్థానం తీవ్రంగా ప్రభావితమైంది. ఈ సీజన్లో ఇప్పటివరకు 12 మ్యాచ్లు ఆడిన రాజస్థాన్.. 8 విజయాలు నమోదు చేసుకుంది. 0.349 నెట్ రన్ రేట్ తో రెండవ స్థానంలో నిలిచింది.. 16 పాయింట్లతో కొనసాగుతోంది.

లక్నో జట్టుపై ఢిల్లీ విజయాన్ని అందుకోడంతో రాజస్థాన్ అధికారికంగా ప్లే ఆఫ్ కు వెళ్లిపోయింది. రాజస్థాన్ జట్టు ఖాతాలో 16 పాయింట్లు ఉన్నాయి. హైదరాబాద్ మినహా మిగతా జట్లేవీ ఆ పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో రాజస్థాన్ ప్లే ఆఫ్ వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. రాజస్థాన్ జట్టు తన తదుపరి మ్యాచులు పంజాబ్, కోల్ కతా జట్లతో ఆడాల్సి ఉంది. పంజాబ్ తో బుధవారం రాజస్థాన్ తలపడనుంది. కోల్ కతా తో గౌహతి వేదికగా ఆదివారం ఆడుతుంది.. ప్రస్తుత ఫామ్ ప్రకారం చూసుకుంటే పంజాబ్ పై రాజస్థాన్ గెలవడం పెద్ద విషయం కాదు. ఒకవేళ పంజాబ్ ఎదురుదాడికి దిగితే మ్యాచ్ ఫలితం మారుతుంది.

ఒకవేళ రాజస్థాన్ జట్టు పంజాబ్, కోల్ కతా తో జరిగే మ్యాచ్లలో వరుసగా ఓడిపోతే.. హైదరాబాద్ వరుసగా రెండు మ్యాచ్ లలో గెలిస్తే.. అప్పుడు రాజస్థాన్ మూడో స్థానానికి పరిమితమవుతుంది. హైదరాబాద్ రెండో స్థానానికి వెళ్ళిపోతుంది. ఒకవేళ చెన్నై జట్టు కూడా తన తదుపరి మ్యాచ్లన్నీ గెలిస్తే నెట్ రన్ రేట్ ఆధారంగా చెన్నై, హైదరాబాద్ రెండు మూడు స్థానాలలో కొనసాగుతాయి. అప్పుడు రాజస్థాన్ నాలుగో స్థానానికి వెళ్ళిపోతుంది.

లక్నో జట్టుపై 19 పరుగుల తేడాతో విజయం సాధించిన నేపథ్యంలో ఢిల్లీ జట్టు సాంకేతికంగా తన ప్లే ఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇదే సమయంలో లక్నో జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది. కీలక దశలో ఆ జట్టు పేలవమైన ఆట తీరు ప్రదర్శించింది. దీనివల్ల రన్ రేట్ మైనస్ ల్లోకి వెళ్లిపోయింది. ఫలితంగా గత రెండు సీజన్లలో ప్లే ఆఫ్ వెళ్లిన లక్నో.. ఈసారి లీగ్ దశ నుంచే ఇంటికి వచ్చేసింది.