DC Vs LSG: చివరి ఓవర్ లో 3 పరుగులా? లక్నో ఓడిపోయింది అతడి చేతుల్లోనే..

క్రీజ్ లో అర్షద్ ఖాన్, మరో ఎండ్ లో నవీన్ ఉల్ హక్ ఉన్నారు. అర్షద్ ఖాన్ అప్పటికే 30 బంతుల్లో 55 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఐదు సిక్స్ లు ఉన్నాయి. అతని జోరు చూస్తుంటే కచ్చితంగా లక్నో గెలిచేలా కనిపించింది..

Written By: Anabothula Bhaskar, Updated On : May 15, 2024 8:13 am

DC Vs LSG

Follow us on

DC Vs LSG: వేదిక ఢిల్లీ.. ఐపీఎల్లో కీలక లీగ్ మ్యాచ్. ఢిల్లీ, లక్నో తలపడుతున్నాయి. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నాలుగు వికెట్లకు 208 రన్స్ చేసింది. 209 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు పడుతూ లేస్తూ 19 ఓవర్ వరకు 9 వికెట్ కోల్పోయి 186 పరుగులకు వచ్చింది. ఈ దశలో చివరి ఓవర్ లో లక్నో జట్టు విజయానికి 23 పరుగులు కావాల్సి వచ్చింది.. చివరి ఓవర్ ను ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ రసిక్ సలాంకు ఇచ్చాడు.

క్రీజ్ లో అర్షద్ ఖాన్, మరో ఎండ్ లో నవీన్ ఉల్ హక్ ఉన్నారు. అర్షద్ ఖాన్ అప్పటికే 30 బంతుల్లో 55 పరుగులు పూర్తి చేశాడు. ఇందులో మూడు ఫోర్లు, ఐదు సిక్స్ లు ఉన్నాయి. అతని జోరు చూస్తుంటే కచ్చితంగా లక్నో గెలిచేలా కనిపించింది.. అద్భుతం జరుగుతుందని లక్నో జట్టు కూడా ఆశించింది.. ఈ క్రమంలో బౌలింగ్ వేసిన రసిక్ మైదానంలో పెను సంచలనమే సృష్టించాడు. ఒక్కో బంతిని బుల్లెట్ లాగా సంధించడంతో లక్నో ఆటగాళ్లకు పరుగులు తీయడమే కష్టమైపోయింది. ఒక్కో బంతిని ఒక్కో తీరుగా వేయడంతో.. అర్షద్ ఖాన్ తికమక పడ్డాడు. అప్పటిదాకా ఫోర్లు, సిక్స్ లు కొట్టిన అతడు సింగిల్స్ తీయడానికే కష్టపడ్డాడు.

మొదటి బంతిని ఆఫ్ స్టంప్ దిశగా వేశాడు. దానిని అర్షద్ ఖాన్ ఆడ లేకపోయాడు. ఫలితంగా అది డాట్ బాల్ అయిపోయింది. ఆ తర్వాతి బంతిని ఆఫ్ స్టంప్ దిశగా ఫుల్ టాస్ వేయడంతో దానిని అర్షద్ ఖాన్ బలంగా కొట్టాడు. ఫలితంగా రెండు పరుగులు వచ్చాయి. మూడో బంతిని యార్కర్ గా వేయడంతో అర్షద్ ఖాన్ సింగిల్ రన్ తీశాడు. అప్పటికి లక్నో జట్టు విజయ సమీకరణం మూడు బంతులకు 20 పరుగులుగా మారిపోయింది. నవీన్ – ఉల్ – హక్ బ్యాటింగ్ కు వచ్చాడు. నాలుగో బంతిని ఆఫ్ స్టంప్ దిశగా గుడ్ లెంగ్త్ బాల్ వేయగా.. పరుగు తీయలేకపోయాడు.. ఐదో బంతిని కూడా అలానే వేయడంతో.. లక్నోకు పరుగులేమీ రాలేదు. చివరి బంతిని అదే తీరుగా వేయడంతో నవీన్ ఉల్ హక్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు. దీంతో గెలుపు వాకిట్లో లక్నో బోర్లా పడింది. 19 పరుగుల తేడాతో ఓడిపోయింది.

చివరి ఓవర్లో రసిక్ అద్భుతంగా బౌలింగ్ చేయడం పట్ల నెటిజన్లు అభినందిస్తున్నారు. వాస్తవానికి బ్యాటర్ల దూకుడు అధికంగా ఉండే ఐపీఎల్ లో చివరి ఓవర్ లో ఇలా కట్టుదిట్టంగా వేయడం సాధ్యం కాదు. ఎంతో అనుభవం ఉన్న బౌలర్లు కూడా చాలా సందర్భాల్లో తేలిపోతారు. కానీ రసిక్ తిరుగులేని విధంగా బౌలింగ్ చేశాడు. ఒక్కో బంతిని ఒక్క విధంగా వేస్తూ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టాడు. ఢిల్లీ జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించాడు. రసిక్ కు కాకుండా మరో బౌలర్ కు పంత్ అవకాశం ఇచ్చి ఉంటే, పరిస్థితి మరో విధంగా ఉండేది.