2008లో మూడోస్థానం.. 2014లో రన్నరప్.. ఆ జట్టులో అందరూ హిట్టర్లే.. అటు బ్యాటింగ్‌లోనూ.. ఇటు బౌలింగ్‌లోనూ పటిష్టమే. కానీ.. ఫలితం వచ్చే సరికి మాత్రం ప్రతికూలం. ప్రతిసారీ ఆహా.. ఓహో.. అని అనిపించుకోవడమే తప్పితే ఆ జట్టు కప్పు సాధించింది అయితే లేదు. అయితే.. ఈసారి మునుపటికి భిన్నంగా ఎంట్రీ ఇవ్వబోతోంది. కొత్త బౌలింగ్ అస్త్రాలను.. యువ తేజాలను వెంటేసుకొని సరికొత్త అరంగేట్రం ఇవ్వబోతోంది పంజాబ్ జట్టు.
ఐపీఎల్ కప్ కల నెరవేరని జట్లలో పంజాబ్ కింగ్స్ కూడా ఒకటి. మంచి మంచి సామర్థ్యం ఉన్న ప్లేయర్స్ ఉన్నా కూడా.. చాలా సందర్భాల్లో కలిసికట్టుగా ఆడకపోవడం.. దీనికితోడు అదృష్టం కలిసిరాకపోవడం జట్టుకు ప్రతికూలం. దుబాయిలో జరిగిన 13వ సీజన్లో వరుసగా ఐదు మ్యాచ్‌లు ఓడినా.. గొప్పగా పుంజుకొని ఆ తర్వాత ఐదు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలిచింది. కానీ.. చివరి రెండు మ్యాచ్‌లను చేజార్చుకొని ఆరో స్థానంలో టోర్నీని ముగించింది. మునుపటి తప్పులు చేయకూడదని గట్టి సంకల్పంతో రాహుల్ సేన.. కుంబ్లే మార్గనిర్దేశనంలో టైటిల్ వేటకు సిద్ధమైంది.
2020 సీజన్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్. 14 మ్యాచుల్లో 670 పరుగులు చేసి టాప్ ప్లేస్ సాధించాడు. ఇది పంజాబ్ కింగ్స్‌కు పెద్ద బలమేనని చెప్పాలి. ఇంగ్లాండ్‌తో టీ20ల్లో విఫలమైన రాహుల్. వన్డే సిరీస్‌లో ఫామ్ అందుకోవడం సానుకూల అంశం. గత సీజన్లో మెరిసిన మయాంక్ అగర్వాల్, విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్, మెరుపు హిట్టర్ పూరన్ పంజాబ్ బ్యాటింగ్‌కు ఆయువుపట్టులాంటి వారు.
గత సీజన్లో తక్కువ మ్యాచ్‌లే ఆడినా తనదైన ముద్ర వేసి జట్టు విజయాల్లో కీలకమయ్యాడు గేల్. అతనితో కాకుండా మరో విండీస్ వీరుడు పూరన్ ఫామ్ కూడా పంజాబ్‌కు ప్లస్. ఇక రూ.1.5 కోట్లకే దక్కించుకున్న టీ20 నంబర్ వన్ బ్యాట్స్‌మన్ డేవిడ్ మలన్ ఆ జట్టు అస్త్రాల్లో ఒకడు. బౌలింగ్‌లో ఈసారి కొత్త పేసర్లతో ఆ జట్టు కళకళలాడుతోంది. ముఖ్యంగా వేలంలో కోట్లు పెట్టి దక్కించుకున్న ఆస్ట్రేలియా బౌలర్లు జే రిచర్డ్ సన్ (రూ.14 కోట్లు), రేలీ మెరీడిత్ (8 కోట్లు) నుంచి పంజాబ్ మెరుగైన ప్రదర్శన ఆశిస్తోంది. గాయం నుంచి కోలుకున్న స్టార్ పేసర్ షమితోపాటు స్పిన్నర్లు రవి బిష్ణోయ్, మురుగన్ అశ్విన్‌లతో కింగ్స్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. అయితే.. ఇవన్నీ కూడా పంజాబ్‌కు బలాలని చెప్పొచ్చు.
ఇదే క్రమంలో ఆ జట్టుకు కొన్ని బలహీనతలు సైతం ఉన్నాయి. మెరుగైన ఆరంభాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం పంజాబ్ ప్రధాన బలహీనత. గత సీజన్లో చాలా మ్యాచుల్లో రాహుల్–మయాంక్ మంచి ఆరంభాలు ఇచ్చినా.. మిడిలార్డర్ తడబాటుతో కింగ్స్ ఓటములను చవిచూసింది. గేల్ నిలకడలేని ఆట కూడా పంజాబ్‌కు సమస్యగా మారింది. అతడిని ఆడించాలో లేదో కూడా తెలియని పరిస్థితి. ఇక ఆస్ట్రేలియా బౌలర్లు జే రిచర్డ్ సన్, మెరిడీత్లకు భారత పిచ్‌లపై అనుభవం లేకపోవడం ప్రతికూలాంశం. పేసర్ షమీ కూడా పోటీ క్రికెట్ ఆడి చాలా రోజులు అయింది. ఇది కూడా పంజాబ్‌పై ప్రభావం చూపనుంది. స్పిన్ విభాగంలో బిష్ణోయ్ లాంటి కుర్రాళ్లు ఉన్నా.. మ్యాచ్‌ను మలుపు తిప్పే సత్తా ఉన్న స్పిన్నర్లు లేకపోవడం పెద్ద మైనస్. మిగిలిన జట్ల మాదిరి దేశవాళీ కుర్రాళ్లు బ్యాటింగ్‌లో రాణించలేకపోవడం పంజాబ్‌ను దెబ్బ తీస్తోంది. ముఖ్యంగా అవకాశాలు వస్తున్నా సర్ఫరాజ్‌ఖాన్, మన్దీప్, దీపక్ హుడా సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు.