PBKS Vs SRH: ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి.. అయినప్పటికీ పంజాబ్ పంజా విసర లేకపోయింది..

హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు ఒకే ఒక్క విదేశీ ఆటగాడితో బరిలోకి దిగింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు ఒక్క విదేశీ ఆటగాడితో ఆడటం ఇదే మొదటిసారి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏ జట్టు అయిన గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించాల్సి ఉంటుంది.

Written By: Anabothula Bhaskar, Updated On : May 20, 2024 8:25 am

PBKS Vs SRH

Follow us on

PBKS Vs SRH: ప్లే ఆఫ్ నుంచి నిష్క్రమించిన నేపథ్యంలో.. చివరి లీగ్ మ్యాచ్ లో అయినా గెలిచి.. టోర్నీ నుంచి గౌరవప్రదంగా తప్పుకుందామని పంజాబ్ జట్టు భావించింది. కానీ ఆ జట్టు అంచనాలను హైదరాబాద్ ఆటగాళ్లు తలకిందులు చేశారు. హోరా హోరీగా సాగాల్సిన మ్యాచ్ ను ఏకపక్షం చేశారు. ఆదివారం సాయంత్రం ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్ లో నాలుగు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకున్నారు. ఫలితంగా పాయింట్ల పట్టికలో రెండవ స్థానానికి వెళ్లిపోయారు.. అయితే ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ 200కు పైగా పరుగులు చేసినప్పటికీ.. ఆ స్కోర్ ను కాపాడుకోలేకపోయింది. బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో విఫలమైన పంజాబ్ జట్టు.. ఒక్క ఘనతను మాత్రం సొంతం చేసుకుంది.. ఇంతకీ అదేంటంటే..

హైదరాబాద్ జట్టుతో జరిగిన మ్యాచ్లో పంజాబ్ జట్టు ఒకే ఒక్క విదేశీ ఆటగాడితో బరిలోకి దిగింది. ఐపీఎల్ చరిత్రలో ఓ జట్టు ఒక్క విదేశీ ఆటగాడితో ఆడటం ఇదే మొదటిసారి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఏ జట్టు అయిన గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లను ఆడించాల్సి ఉంటుంది. పంజాబ్ జట్టులోని ఉన్న విదేశీ ఆటగాళ్లు మొత్తం టి20 ప్రపంచ కప్ నేపథ్యంలో వారి సొంత దేశాలకు వెళ్లిపోయారు. దీంతో పంజాబ్ జట్టు చేతిలో ఒక్క రిలే రోసౌ మాత్రమే ఉన్నాడు. కీలకమైన సామ్ కరణ్, లివింగ్ స్టోన్, జానీ బెయిర్ స్టో వంటి వారు పాకిస్తాన్ జట్టుతో టీ 20 సిరీస్ ఉన్న నేపథ్యంలో.. ఇంగ్లాండ్ వెళ్లిపోయారు.

ఇక ఆస్ట్రేలియన్ స్టార్ పేస్ బౌలర్ నాథన్ ఎల్లీస్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతడిని ప్లే -11 లోకి తీసుకోలేదు. ఎలాగూ ప్రాధాన్యం లేని మ్యాచ్ కాబట్టి, కుర్రాడికి అవకాశం ఇవ్వాలని ఉద్దేశంతో రిలే రోసౌ తో మాత్రమే బరిలోకి దిగుతున్నామని పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ ప్రకటించాడు. విదేశీ ఆటగాళ్లు లేకుండా చివరి వరకు విజయం కోసం పోరాడామని అతడు వివరించాడు. “ఆటగాళ్లు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు.. దీటుగా బ్యాటింగ్ చేశారు. హైదరాబాద్ బౌలర్లను అడ్డుకున్నారు.. 200లకు పైగా పరుగులు చేయడంలో వారిది కీలకపాత్ర అని” జితేష్ శర్మ పేర్కొన్నాడు.

ఇక ఈ మ్యాచ్ లో హైదరాబాద్ జట్టు 4 వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ఈ మ్యాచ్ లో ముందుగా పంజాబ్ బ్యాటింగ్ చేసింది. 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 214 రన్స్ చేసింది.. ప్రభ్ సిమ్రాన్ సింగ్ 71, అధర్వ 46 రిలీ రోసౌ 49 పరుగులు చేసి, పంజాబ్ భారీ స్కోరు సాధించేందుకు దోహదపడ్డారు. చివర్లో పంజాబ్ తాత్కాలిక కెప్టెన్ జితేష్ శర్మ 15 బంతుల్లో 32 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. హైదరాబాద్ బౌలర్లలో నటరాజన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ప్యాట్ కమిన్స్, విజయ్ కాంత్ వియస్కాంత్ చెరొక వికెట్ దక్కించుకున్నారు. ఇక 215 పరుగుల విజయ లక్ష్యాన్ని హైదరాబాద్ జట్టు 19.1 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. అభిషేక్ శర్మ 66, క్లాసెన్ 42, రాహుల్ త్రిపాఠి 33, నితీష్ కుమార్ రెడ్డి 37 పరుగులు చేసి హైదరాబాద్ విజయంలో కీలకపాత్ర పోషించారు.