RR Vs KKR: ఉప్పల్ లో విజయం.. గుహవాటిలో వర్షం.. సన్ రైజర్స్ నక్కతోక తొక్కిందనుకుంటా..

గుహవాటి వేదికగా కోల్ కతా, రాజస్థాన్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆదివారం రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు ప్రారంభం కావలసిన ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. పలుమార్లు మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు సిద్ధమైనప్పటికీ వాతావరణం సహకరించలేదు.

Written By: Anabothula Bhaskar, Updated On : May 20, 2024 8:37 am

RR Vs KKR

Follow us on

RR Vs KKR: ఐపీఎల్ సీజన్లో హైదరాబాద్ ప్రయాణం ఈసారి అద్భుతంగా సాగింది. గత సీజన్లలో దారుణమైన ఆట తీరు ప్రదర్శించిన ఆ జట్టు.. ఈసారి మాత్రం రేసుగుర్రం లాగా దౌడు తీసింది. కీలకమైన ప్లే ఆఫ్ ముందు లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో పది వికెట్ల తేడాతో విజయాన్ని సాధించి తన సత్తా ఏమిటో చూపించింది. ఆ తర్వాత గుజరాత్ జట్టుతో జరగాల్సిన మ్యాచ్ వర్షం వల్ల రద్దయినప్పటికీ.. అప్పటికే హైదరాబాద్ కు జరగాల్సిన లాభం జరిగిపోయింది. ఈ క్రమంలో ఆదివారం పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో 215 పరుగుల విజయ లక్ష్యాన్ని ఇంకా ఐదు బంతులు మిగిలి ఉండగానే పూర్తి చేసింది. నాలుగు వికెట్ల తేడాతో గెలుపును అందుకుంది. ఈ విజయం అందుకున్నప్పటికీ.. హైదరాబాద్ టాప్ -2 కు వెళ్లినప్పటికీ.. ఆ స్థానంలో స్థిరంగా ఉండాలంటే కోల్ కతా దయాదాక్షిణ్యాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి హైదరాబాదు జట్టుది. అయితే అటువంటి ఇబ్బంది లేకుండా చేశాడు వరుణుడు.

గుహవాటి వేదికగా కోల్ కతా, రాజస్థాన్ జట్లు తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఆదివారం రాత్రి ఏడు గంటల 30 నిమిషాలకు ప్రారంభం కావలసిన ఆ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. పలుమార్లు మ్యాచ్ నిర్వహించేందుకు అంపైర్లు సిద్ధమైనప్పటికీ వాతావరణం సహకరించలేదు. అయితే రాత్రి 10 గంటల సమయంలో వర్షం కాస్త తగ్గింది. మైదానాన్ని సిద్ధం చేసి చివరికి 7 ఓవర్ల వరకైనా ఆట సాగించాలని నిర్ణయించారు. టాస్ గెలిచిన కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ను రాత్రి 10 గంటల 45 నిమిషాలకు ప్రారంభించాలనుకున్నారు. కానీ వర్షం మళ్ళీ ప్రారంభం కావడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు.

ఈ మ్యాచ్లో కోల్ కతా పై విజయం సాధించి క్వాలిఫైయర్ – 1 కి అర్హత సాధించాలని రాజస్థాన్ జట్టు భావించింది. కానీ, ఆ జట్టు ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. మ్యాచ్ రద్దు కావడంతో రెండు జట్లకు చెరొక పాయింట్ కేటాయించారు. అయితే రాజస్థాన్, హైదరాబాద్ పాయింట్ల పరంగా సమానమైన స్థితిలో ఉన్నప్పటికీ.. రన్ రేట్ మెరుగ్గా ఉండడంతో హైదరాబాద్ రెండవ స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. ఇక మే 21న అహ్మదాబాద్ లో కోల్ కతా, హైదరాబాద్ జట్ల మధ్య క్వాలిఫైయర్ -1 మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు నేరుగా ఫైనల్ వెళ్ళిపోతుంది. ఓడిపోయిన జట్టుకు మరొక అవకాశం ఉంటుంది. ఇక బుధవారం రాజస్థాన్ బెంగళూరు తో ఎలిమినేటర్ మ్యాచ్ ఆడుతుంది.