PBKS Vs RCB IPL 2025 Qualifier 1: ఇలా చెప్పుకుంటూ పోతే పంజాబ్ జట్టుకు క్వాలిఫైయర్ -1 లో అన్ని దరిద్రాలే. ఈ దశలో 60 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయిన క్రమంలో ఆదుకుంటాడని భావించి ఇంపాక్ట్ ప్లేయర్ గా ముషీర్ ఖాన్ కు అవకాశం కల్పిస్తే.. అతడు 0 చుట్టాడు. ముషీర్ ఖాన్ ఎవరో కాదు.. టీమ్ ఇండియా టెస్ట్ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు. అయ్యర్ జట్టు 60 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్రమైన కష్టాల్లో ఉన్నప్పుడు.. ముషీర్ ఖాన్ క్రీజ్ లోకి వచ్చాడు. శర్మ బౌలింగ్ లో 0 పరుగులకే అవుట్ అయ్యాడు. అప్పటికే దారుణమైన కష్టాల్లో ఉన్న పంజాబ్ జట్టును మరింత ఇబ్బందుల్లోకి నెట్టాడు..
ఎడమచేతి వాటం బ్యాటింగ్ చేసే ముషీర్ ఖాన్.. ఆర్థోడాక్స్ స్పిన్నర్. దేశీయ, అంతర్జాతీయ క్రికెట్లో, అంతర్జాతీయ యూత్ టోర్నమెంట్లలో తన సత్తా చాటాడు. అయితే కీలకమైన మ్యాచ్లో మాత్రం చేతులెత్తేశాడు. వాస్తవానికి ఐపీఎల్లో అవకాశం రావడం చాలా గొప్ప విషయం. మరీ ముఖ్యంగా క్వాలిఫైయర్ మ్యాచ్లలో అవకాశం దొరకడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి సందర్భాన్ని ముషీర్ ఖాన్ చేతులారా నాశనం చేసుకున్నాడు..
ముషీర్ ఖాన్ ఫిబ్రవరి 27 2005లో జన్మించాడు. అతని తండ్రి నౌషాద్ ఖాన్ కొడుకు ఆసక్తిని గమనించి క్రికెట్లో సత్తా చాటే విధంగా తోడ్పాటు అందించాడు.. అండర్ – 14 టోర్నమెంట్లో సత్తా చాటడంతో ముషీర్ ఖాన్ కు అవకాశాలు వెంట వెంటనే వచ్చాయి. 2022లో మసీద్ ఖాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. రంజీలో ముంబై జట్టు తరుపున ఆడాడు.
2024లో జరిగిన రంజీ ట్రోఫీలో బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో ముషీర్ ఖాన్ డబుల్ సెంచరీ చేశాడు. విదర్భ జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో సెంచరీ చేసి.. ముంబై జట్టు టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ముఖ్యంగా నాకౌట్ దశలో అతడు చూపించిన ప్రదర్శన ముంబై జట్టుకు తిరుగులేని విజయాన్ని అందించింది. ఇక 2024 దులీప్ ట్రోఫీలో ఇండియా బీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 181 పరుగుల కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. నవదీప్ షైనీతో కలిసి ఎనిమిదో వికెట్ కు ఏకంగా 205 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 2024లో అండర్ -19 ప్రపంచ కప్ లో భారత జట్టు తరఫున అద్భుతమైన ప్రదర్శన చేశాడు. ఏడు మ్యాచ్లలో 60 సగటుతో 360 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు ఉన్నాయి. ఏడు వికెట్ల కూడా పడగొట్టాడు..
ఇక అండర్ 19 వన్డే కెరియర్లో 14 మ్యాచులు ఆడిన ముషీర్ ఖాన్ 61.55 సగటుతో 554 పరుగులు చేశాడు. 13 వికెట్లు కూడా పడగొట్టాడు. అటు బ్యాటింగ్.. బౌలింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసి అసలు సిసలైన ఆల్రౌండర్ గా పేరు పొందాడు. అయితే అటువంటి ఆటగాడు క్వాలిఫైయర్ మ్యాచ్లో మాత్రం పంజాబ్ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. వాటన్నింటినీ వమ్ము చేశాడు.